రేటింగ్స్ పునరుద్ధరించాలి: కేంద్రానికి న్యూస్ చానల్స్ వినతి

0
592

నాలుగు నెలలకు పైగా నిలిచిపోయిన న్యూస్ చానల్స్ రేటింగ్స్ పునరుద్ధరించాలని సమాచార, ప్రసార శాఖామంత్రి ప్రకాశ్ జావడేకర్ కు విజ్ఞప్తి చేస్తూ 50 కి పైగా న్యూస్ చానల్స్ లేఖ రాశాయి. బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) నాలుగు నెలలకు పైగా న్యూస్ చానల్స్ కు రేటింగ్స్ ఇవ్వటం నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇలా రేటింగ్స్ ఇవ్వకపోవటం వలన న్యూస్ చానల్స్ ఆర్థికంగా దెబ్బతింటున్నాయని, ప్రకటనలివ్వటానికి ఒక ఆధారమంటూ లేకపోవటం వలన ఆదాయం కోల్పోయిన స్థితిలో లక్షలాదు ఉద్యోగుల జీవనోపాథి ప్రశ్నార్థకంగా మారిందని ఆ లేఖలో న్యూస్ చానల్స్ ఆవేదన వ్యక్తం చేశాయి.
2020 లో బార్క్ న్యూస్ చానల్స్ రేటింగ్స్ నిలిపివేస్తూ 2-3 నెలలపాటు ఈ నిలిపివేత ఉంటుందని ప్రకటించింది. అప్పట్లో రేటింగ్స్ లో అవకతవకలు జరుగుతున్నట్టు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సరిచూసుకునేందుకు ఈ చర్య తీసుకుంటున్నట్టు కూడా బార్క్ పేర్కొంది. సమీక్షించటానికి సమయం పడుతుంది గనుక 2-3 నెలల విరామం తప్పదని చెప్పింది. సరైన పోటీకి తావిచ్చే విధంగా ఎలాంటి విమర్శలకూ తావులేని రేటింగ్స్ ప్రకటించటమే లక్ష్యమని బార్క్ చైర్మన్ పునీత్ గోయెంకా ప్రమటించటం కూడా తెలిసిందే.
అయితే, నాలుగు నెలలు గడిచినా రేటింగ్స్ పునరుద్ధరించకపోవటంతో 50 కి పైగా చానల్స్ ఇప్పుడు కేంద్రమంత్రి జోక్యం కోరుతూ లేఖ రాశాయి. దీనిమీద సంతకం చేసిన చానల్స్ లో రిపబ్లిక్ టీవీ, న్యూస్ ఎక్స్, ఖబర్ ఫాస్ట్, ఇండియా న్యూస్ తోబాటు అనేక ప్రాంతీయ చానల్స్ ఉన్నాయి. ఒకవైపు దర్యాప్తు సాగుతున్నప్పటికీ ఈ లోపు రేటింగ్స్ ఇవ్వవచ్చునని ఆ లేఖలో విజ్ఞప్తిచేశాయి. అప్పుడే న్యూస్ చానల్స్ ఉద్యోగుల ఉపాధి సమస్య రాదని అన్నాయి.
ఒకవేళ వారం వారం రేటింగ్స్ ఇవ్వటంలో ఏదైనా సమస్య ఉంటే దానికి మరేదైనా ప్రత్యామ్నాయం ఆలోచించాలని కూడా ఆ లేఖలో న్యూస్ చానల్స్ కోరాయి. ప్రకటనదారుల విశ్వాసం చూరగొనేందుకు వీలుగా రేటింగ్స్ ఇచ్చేలా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ జోక్యం అవసరమని, లేని పక్షంలో న్యూస్ చానల్స్ అంతరించటం తప్పకపోవచ్చునని చెప్పాయి.
మొదట్లో చెప్పిన మూడు నెలల గడువు దాటిపోయినా, ఇప్పట్లో రేటింగ్స్ ఇచ్చే పరిస్థితి కానరావటం లేదని ఇప్పుడు న్యూస్ చానల్స్ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని ఆ లేఖలో పేర్కొన్నారు. బార్క్ ఏవైనా మార్పులు చేయదలచుకున్నా తాము సిద్ధమని కూడా అందులో స్పష్టం చేశాయి. గతంలో కూడా రేటింగ్స్ అవకతవకలమీద ఫిర్యాదులున్నాయని, అంతమాత్రాన మొత్తం రేటింగ్స్ నిలిపివేయటం దానికి పరిష్కారం కాదని స్పష్టం చేశాయి. టీవీ 9 గ్రూప్ మరో లేఖ రాస్తూ ఎంటర్టైన్మెంట్ చానల్స్ కు లేని నిషేధం న్యూస్ చానల్స్ కే విధించటాన్ని తప్పు పట్టింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here