జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ , సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా అనే రెండు మీడియా సామ్రాజ్యాలు విలీనం కావాలన్న చరిత్రాత్మక నిర్ణయం ప్రకటించి టెలివిజన్ పరిశ్రమలో ప్రకంపనలకు కారణం అయిన సంగతి తెలిసిందే. అయితే, అంతకుముందు నుంచే జీ సంస్థ అసాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించాలని, ఎండీ సహా కొందరు డైరెక్టర్లు తప్పుకోవాలని డిమాండ్ చేస్తూ వచ్చిన ఇన్వెస్కో ఇప్పుడేం మాట్లాడుతుందో అర్థం కాక పరిశ్రమ వర్గాలు ఆసక్తితో గమనిస్తున్నాయి.
జీ సంస్థలో ఇన్వెస్కో, దాని అనుబంధ సంస్థ అయిన గ్లోబల్ చైనా ఫండ్ కు కలిసి ఉమ్మడిగా వాటా 17.9% ఉండగా సమావేశానికి పిలిచే హక్కు ఉంది. ఎండీ గా ఉన్న పునీత గోయెంకా తప్పుకోవాలని వాటాదారు హోదాలో డిమాండ్ చేస్తూ యమడా, విలీన సంస్థలో మెజారిటే వాటాదారు అయిన సోనీ ఇప్పటికే పునీత్ గోయెంకా కొత్త సంస్థలో కూడా మేనేజింగ్ డైరెక్టర్ గా కొనసాగుతారని ప్రకటించటం తెలిసిందే, ఈ నేపథ్యంలో ఇన్వెస్కో మొండి పట్టు పట్టటం అర్థరహితమని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అసాధారణ సర్వసభ్య సమావేశం జరపాలని సెప్టెంబర్ 11 న ఇన్వెస్కో లేఖ రాసింది. జీ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ అయిన పునీత్ గోయెంకాను తప్పించాలని కూడా అందులో డిమాండ్ చేసింది. పైగా సెప్టెంబర్ 23 న మరో లేఖ రాస్తూ, సమావేశం జరపాలని మరోమారు గుర్తు చేసింది. ఈ వివాద సమయంలో సోనీ ఆపద్బాంధవుడిలా వచ్చి జీ ని, మరీ ముఖ్యంగా పునీత గోయెంకాను ఆదుకున్నట్టయింది.
ఈ పరిస్థితుల్లో రెండు సంస్థల సీఈవోలు విలీనం చర్చలు కొనసాగించబోతుండగా దీన్ని సమర్థించకుండా ఉండటం ఇన్వెస్కోకి కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఫండ్ సంస్థగా ఆదాయ లాభాలు, సరైన నిర్వహణ మాత్రమే కోరుకోవాల్సిన సంస్థ అంతకు మించి వ్యవహరిస్తే దాని వెనుక ఏదైనా అదృశ్య హస్తం ఉండి ఉంటుందనే అనుమానాలు వస్తాయి. ఎందుకంటే పునీత్ గోయెంకా సామర్థ్యం కూడా టీవీ పరిశ్రమ నిపుణులకు తెలుసు. అందువలన ఆయన తప్పుకోవాలని ఎవరూ కోరుకోరు.
ఇన్వెస్కో కోరినట్టు జరిగే అసాధారణ సర్వసభ్య సమావేశంలో ఏం వాదన వినిపించాలన్నా ఇప్పుడు ఇన్వెస్కోకి తగిన అంశం లేదు. అందువలన వాటాదారులకు ఏం చెప్పాలో అర్థమయ్యే పరిస్థితి ఉండదు. విలీనం లాంటి అతిపెద్ద అంశం ముందు ఏవైనా వీగిపోవాల్సిందే. జీ వాటా ధర దాదాపు 35 శాతం మించి పెరగటం లాంటివి గమనించిన తరువాత వాటాదారులు ఇన్వెస్కో వైపు నిలబడటం కుదిరే పని కాదు. వెనక్కి తగ్గి విలీనానికి పచ్చజెండా ఊపటం తప్ప ఇన్వెస్కో చేయగలిగేదేమీ ఉండదని పరిశీలకులు వరుస ట్వీట్లు చేయటం గమనార్హం.