డిటిహెచ్ కి కొత్త మార్గదర్శకాలు: 20 ఏళ్ల లైసెన్స్

0
636

డైరెక్ట్ టు ద హోమ్ ( డిటిహెచ్) సంస్థల కోసం రూపొందించిన కొత్త మార్గదర్శకాలకు కేంద్ర కాబినెట్ ఆమోదముద్ర లభించింది. ఆరేళ్ళ నిరీక్షణకు తెరపడింది. డిటిహెచ్ రంగానికి అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలను బుధవారం నాడు సమాచార, ప్రసార శాఖామంత్రి ప్రకాశ్ జావడేకర్ వెల్లడించారు. ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం డిటిహెచ్ ఆపరేటర్లకు 20 ఏళ్ళ పాటు అమలులో ఉండే లైసెన్స్ ఇస్తారు.

అయితే, మొదటి పదేళ్ళ తరువాత ఆటోమేటిక్ రెన్యూవల్ ఉంటుంది. ఏదైనా అభ్యంతరం ఉన్నప్పుడు మాత్రమే ఆటోమేటిక్ రెన్యూవల్ కు గండి పడుతుంది. సవరించిన మార్గదర్శకాలతో లైసెన్స్ పరిమితి మీద స్పష్టత రావటంతో ఈ రంగంలో స్థిరత్వం వస్తుందని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం పెరిగి ఉద్యోగావకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

2004లో మొదటి సారి ఇచ్చిన 10 ఏళ్ల లైసెన్సులు 2014 లో గడువు ముగిశాయి. అప్పటినుంచి తాత్కాలిక పొడిగింపులతోనే ఆరేళ్ళు నెట్టుకొచ్చారు. నిజానికి ట్రాయ్ 2014 లోనే డిటిహెచ్ మార్గదర్శకాలను సిఫార్సు చేసింది. ఇంతకాలం పెండింగ్ లో ఉంచిన ప్రభుత్వం ఎట్టకేలకు ఇప్పుడు ఆమోదించింది.

లైసెన్స్ పరిమితితోబాటు మరికొన్ని అంశాలను కూడా సవరించారు. డిటిహెచ్ ఆపరేటర్లు తమ స్థూల ఆదాయంలో 10% మొత్తాన్ని ప్రభుత్వానికి లైసెన్స్ ఫీజు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఇప్పుడు కొత్త మార్గదర్శకాల ప్రకారం జీ ఎస్టీ చెల్లింపు అనంతరం ఉండే ఆదాయంలో 8% మాత్రమే చెల్లించాలి. అదే విధంగా ఏడాదికొక్సారి కాకుండా ప్రతి మూడు నెలలకొక్సారి ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

శాటిలైట్ చానల్స్ , దూరదర్శన్ చానల్స్ కాకుందా సొంతగా నేరుగా ఇచ్చే చానల్స్ సంఖ్య విషయంలో ఇంతకుముందు ఎలాంటి పరిమితీ లేదు. వాటిని ప్లాట్ ఫామ్ సర్వీస్ చానల్స్ గా పరిగణిస్తూ, మొత్తం పంపిణీచేసే చానల్స్ లో 5% మించకూడదనే నిబంధన విధించారు. అంటే ఒక డిటిహెచ్ ఆపరేటర్ 400 చానల్స్ ఇస్తూ ఉంటే 20 మాత్రమే అలాంటి ఇతర చానల్స్ ప్రసారం చేయవచ్చు. అదే సమయంలో అలాంటి చానల్స్ కు రూ.10,000 రిజిస్ట్రేషన్ ఫీజు గా చెల్లించాలి. ఇది తిరిగి రాదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here