కేరళలో 20 లక్షల కుటుంబాలకు ఉచిత ఇంటర్నెట్

0
732

ఉన్నవాళ్లకు, లేనివాళ్లకు మధ్య ఉన్న డిజిటల్ అంతరాన్ని తొలగించటానికి కేరళ రాష్ట ప్రభుత్వం చరిత్రాత్మకమైన తొలి అడుగు వేసింది. రాష్ట్రంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 20 లక్షల కుటుంబాలకు ఉచితంగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. ఇంటింటికీ ఇంటర్నెట్ అందించే కేఫాన్ ( కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్ వర్క్) ను ఆ రాష్ట ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ప్రారంభించారు. కేరళ రాష్ట్ర ఐటి ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, కేరళ రాష్ట్ర విద్యుత్ బోర్డ్ భాగస్వామ్యంతో కేఫాన్ ఏర్పడగా ఈ కన్సార్షియం సారధిగా ఉన్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 2019 లో ప్రాజెక్ట్ అమలు పనులు చేపట్టింది.
ఈ పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ మాట్లాడుతూ, కేఫాన్ ను డిజిటల్ రంగంలో ఒక విప్లవంగా అభివర్ణించారు. దీనిలో భాగంగా 20 లక్షల పేద కుటుంబాలకు ఉచితంగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. మొత్తం 14 జిల్లాల్లో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారికి ఇది అందుబాటులోకి వస్తుందన్నారు. ఇంతకుముందు కేవలం 10 శాతం ప్రభుత్వ కార్యాలయాలకు మాత్రమే హై స్పీడ్ ఇంటర్నెట్ అందుతూ ఉండగా ఇప్పుడు కేఫాన్ ప్రారంభంతో 30,000 ప్రభుత్వ సంస్థలకు హై బాండ్ విడ్త్ కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుందన్నారు.
కేరళ విద్యుత్ బోర్డ్ వారి మౌలిక సదుపాయాలు వాడుకుంటూ నెట్ వర్క్ తో ఒక వలయం ఏర్పాటు చేసి నెట్ వర్క్ ఆపరేటింగ్ సెంటర్ ( నాక్) ను ఎర్నాకుళంలో నెలకొల్పారు. మొత్తం 14 జిల్లాలగుండా వెళ్ళేలా 35,000 కిలోమీటర్ల ఆప్టిక్ ఫైబర్ లైన్లు వేస్తున్నారు. ఇది పూర్తయితే అలాంటి అతిపెద్ద నెట్ వర్క్ గా తయారవుతుంది. సర్వీస్ ప్రొవైడర్లు అందరూ ఈ నెట్ వర్క్ వాడుకోవటానికి అవకాశం కల్పిస్తున్నారు. ఇందులో 10 ఎంబిపిఎస్ మొదలి 1 జిబిపిఎస్ దాకా ఇంటర్నెట్ వేగం అందుబాటులో ఉంటుంది.
గతంలో ప్రైవేట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల చేతిలోనే ఉన్న ఇంటర్నెట్ కేవలం నగరాల్లోని ప్రజలకు మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు కేఫాన్ రంగంలోకి దిగిన తరువాత ఆ తేడాలు మాయమవుతాయి. రాష్ట్రంలో డిజిటల్ మౌలిక సదుపాయాలు పటిష్టం చేయాలన్న కేరళ ప్రభుత్వ ఆలోచనలో భాగమే కేఫాన్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here