ప్రకటనల పరిమితి కేసు నవంబర్ 19 కి వాయిదా

0
501

టీవీ చానల్స్ లో గంటకు 12 నిమిషాలకు మించి ప్రకటనలు వేయకూడదంటూ ట్రాయ్ అమలు చేయదలచిన నిబంధనమీద ఢిల్లీ హైకోర్టులో కేసు విచారణ మళ్ళీ వాయిదా పడింది. 10 నిమిషాల వాణిజ్య ప్రకటనలతో బాటు 2 నిమిషాల సొంత కార్యక్రమాల ప్రచార ప్రకటనలు మాత్రమే ప్రసారం చేసుకోవటానికి కేబుల్ టెలివిజన్ నెట్ వర్క్స్ నిబంధనలు అనుమతిస్తున్నాయంటూ ట్రాయ్ ఆ నియమాన్ని అమలు చేయటానికి ప్రయత్నించగా పలువురు బ్రాడ్ కాస్టర్లు కోర్టును ఆశ్రయించారు. ఏడేళ్ళుగా కోర్టులోనే ఉన్న ఈ కేసు మీద మళ్లీ ఈ మధ్యనే విచారణ ప్రారంభం కాగా మరోమారు ఢిల్లీ హైకోర్టు దీనికి నవంబర్ 19 కి వాయిదా వేసింది.

2013 మార్చిలో ట్రాయ్ ఈ నిబంధనను అమలు చేయాలని ప్రయత్నించింది. సేవల నాణ్యతా నిబంధనల కింద వినియోగదారుల ప్రయోజనాలు కాపాడే లక్ష్యంతో దీన్ని అమలు చేయాలనుకోగా, బ్రాడ్ కాస్టర్లు దీన్ని తీవ్రంగా ప్రతిఘటించారు. అయితే, అధికశాతం పే చానల్స్ మాత్రం ప్రేక్షకులను కోల్పోయే పరిస్థితి ఉందని గ్రహించి తమంతట తామే ఈ నిబంధన పాటించటానికి సిద్ధపడ్డాయి. ప్రకటనల పరిమితి పాటించని చానల్స్ సీఈవోల మీద క్రిమినల్ చర్యలకు సైతం ట్రాయ్ సిద్ధపడటం అప్పట్లో తీవ్ర కలకలానికి దారితీసింది.

ట్రాయ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్ , బి4యు, 9X మీడియా, టీవీ విజన్, సన్ టీవీ నెట్ వర్క్, కలైంజ్ఞర్ టీవీ కోర్టును ఆశ్రయించాయి. అంతకుముందు న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసొయేషన్ టిడిశాట్ ను ఆశ్రయించగా, ట్రాయ్ ఉత్తర్వులమీద స్టే మంజూరైంది. కానీ ఆ అధికారం టిడిశాట్ కు లేదని, ట్రాయ్ ఆదేశాలలో జోక్యం చేసుకోకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటంతో బ్రాడ్ కాస్టర్లు హైకోర్టుకు వెళ్ళారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here