కొత్త ఐటి నిబంధనల నుంచి న్యూస్ చానల్స్ కు ఊరట

0
671

న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్ లోని న్యూస్ చానల్స్ కొత్త ఐటి నిబంధనలు పాటించటం లేదంటు చర్యలు తీసుకోవద్దని కేరళ హైకోర్టు ఈ రోజు తాత్కాలిక ఉపసమనం కలిగించింది. జస్టిస్ పిబి సురేశ్ కుమార్ ఈ మేరకు కేంద్రాన్ని ఆదేశించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలు అమలులోకి వచ్చిన నెల రోజుల తరువాత న్యుస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్ ( ఎన్ బి ఎ) ఆ నిబంధనలను సవాలు చేస్తూ కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ నిబంధనల ద్వారా మీడియా భావ ప్రకటనను నియంత్రించటానికి ప్రభుత్వ అధికారులకు అపరిమితమైన అధికారాలు కట్టబెట్టినట్టు అవుతుందని ఆ పిటిషన్ లో న్యూస్ చానల్స్ సంఘం ఆరోపించింది. ఇన్పర్మేషన్ టెక్నాలజీ ( ఇంటర్మీడియరీ గైడ్ లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) నియమాలు, 2021 అనేది 2020 నాటి ఐటి చట్టాన్ని ఉల్లంఘించటమేనని, వృత్తిని కొనసాగించటానికి రాజ్యాంగం కల్పించిన హక్కును కాలరాయటమేనని పిటిషనర్ వాదించారు.
ప్రభుత్వం ఇలాంటి అధికార వ్యవస్థకు రూపకల్పన చేయటం ద్వారా న్యాయాధికార పరిధిలోకి చొరబడినట్టేనని. ఆ విధంగా తన పరిధిలోకి రాని అంశాలలోకి వెళ్ళటం దురదృష్టకరమని కూడా వార్తా ప్రసారకుల సంఘం తప్పుబట్టింది. దేసవ్యాప్తంగా ఉన్న 78 వార్తా చానల్స్ కు ప్రాతినిధ్యం వహించే 25 ప్రసార సంస్థలు ఈ సంఘంలో సభ్యులు కావటంతో న్యూస్ చానల్స్ తరఫున ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఒకవైపు వార్తాంశాలకు సంబంధించిన నిబంధనలు అసంబద్ధంగా ఉన్న కార్యక్రమాల నిబంధనావళి అంతకు ముందు సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా లేకపోవటాన్ని కూడా ఆ పిటిషన్ లో ప్రస్తావించారు.
ఇలా ఉండగా కొత్త ఐటి నిబంధనలమీద వేసిన పిటిషన్లంటినీ సుప్రీంకోర్టుకు బదలాయించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం కోరింది. అనేక డిజిటల్ మీడియా వేదికలు ఇప్పటికే వివిధ దిగువ కోర్టులలో ఈ ఐటి నిబంధనలమీద పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 25న నోటిఫై చేసిన ఈ నిబంధనలు మే 26 నుంచి అమలు లోకి వచ్చాయి.
ఆన్ లైన్ మీడియా పోర్టల్స్, ప్రచురణ కర్తలు, ఒటిటి వేదికలకు మూడంచెల నిఘా వ్యవస్థను ప్రభుత్వం ఈ నిబంధనల ద్వారా ప్రతిపాదించింది. ఒక ఫిర్యాదుల పరిష్కర్తను నియమించుకోవటం, ఒక స్వీయ నియంత్రణ సంస్థను ఏర్పాటు చేసుకొని పరిష్కరించుకోవటం, అదీ కుదరనప్పుడు ప్రభుత్వం ఏర్పాటుచేసే కమిటీ నిర్ణయానికి కట్టుబడటం అనేది ఈ మూడంచెలలో భాగం. ఫౌండేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ జర్నలిజం, లైవ్ లా అనే లీగల్ వెబ్ సైట్ కూడా ఈ నిబంధనల మీద కోర్టు కెక్కాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here