ఎమ్మెస్వోల మౌలికసదుపాయాల పంపిణీకి మార్గదర్శకాలు

0
849

మల్టీ సిస్టమ్ ఆపరేటర్లు (ఎమ్మెస్వోలు) తమ మౌలికసదుపాయాలను ఇతర ఎమ్మెస్వోలతో పంచుకోవటానికి ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు బుధవారం నాడు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ మార్గదర్శకాలు జారీచేసింది. అంతకుముందు 2017 మార్చి 3 న ట్రాయ్ ఈ విషయంలో చేసిన సిఫార్సులకు అనుగుణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పంపిణీ సంస్థలైన ఎమ్మెస్వోలు, హిట్స్ (హెడ్ ఎండ్ ఇన్ ద స్కై) ఆపరేటర్లు తమ మౌలికసదుపాయాలను పంచుకోవటం ద్వారా ఖర్చులు తగ్గించుకోవటానికి, ఆదాయం పెంచుకోవటానికి వీలవుతుందని ట్రాయ్ సిఫార్సు చేసింది. హిట్స్ కు ఇప్పటికే మార్గదర్శకాలు ఇవ్వగా సమర్థవంతంగా తమ సదుపాయాలను పంచుకుంటోంది. ఇప్పుడు కేబుల్ ఎమ్మెస్వోలకూ ఈ అవకాశం దక్కింది.
సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఇచ్చిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి:

  1. సాంకేతికంగా సాధ్యమయ్యే చోట ఎమ్మెస్వోలు తమ మౌలికసదుపాయాలను ఇతర ఎమ్మెస్వోలతో పంచుకోవచ్చు. అయితే ఇది స్వచ్ఛందమేగాని తప్పనిసరికాదు. నిబంధనలు, నియంత్రణలు, లైసెన్సులు, ఆదేశాలు, మార్గదర్శకాలు తదితర చట్టపరమైన అంశాలకు ఇరుపక్షాలూ కట్టుబడి ఉండాలి.
  2. ప్రస్తుతం ఎమ్మెస్వోలకు లైసెన్స్ మంజూరు చేసిన సమయంలో “మీ సొంత డిజిటల్ హెడ్ ఎండ్ నుంచి మాత్రమే డిజిటల్ అడ్రెసిబుల్ కేబుల్ టీవీ సేవలు అందించాలి” అనే నిబంధన ఉండగా ఇప్పుడు దాన్ని సవరిస్తున్నారు. స్వచ్ఛందంగా కాస్, ఎస్ ఎం ఎస్ హార్డ్ వేర్ ను ఉమ్మడిగా వాడుకున్నట్టయితే సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ జారీచేసిన మార్గదర్శకాలు అనుసరించాలి.
  3. ప్రతి ఎమ్మెస్వో కచ్చితంగా ఎన్ క్రిప్షన్ ను పాటించాలి. ప్రభుత్వ, లేదా ప్రభుత్వ ప్రతినిధులు జరిపే ఆడిట్ సమయంలో ఈ నిబంధనను పాటిస్తున్నదీ లేనిదీ చూస్తారు.
  4. కేబుల్ టీవీ, టీవీ చానల్స్ సిగ్నల్స్ ప్రసారం చేయటానికి వాడే హెడ్ ఎండ్ ను స్వచ్ఛందంగా ఎమ్మెస్వోలు పంచుకోవచ్చు.
  5. అయితే, ఆలా ఒక ఎమ్మెస్వో హెడ్ ఎండ్ ను వాడుకునే రెండో ఎమ్మెస్వో కూడా లైసెన్స్ పొందినవాడై ఉండాలి. అదే విధంగా సంబంధిత పే చానల్ యాజమాన్యాలతో లిఖితపూర్వకమైన ఇంటర్ కనెక్షన్ ఒప్పందం జరిగి ఉండాలి.
  6. ఎమ్మెస్వోలు ఎస్ ఎం ఎస్ ( సబ్ స్క్రయిబర్ మేనేజ్ మెంట్ సిస్టమ్) హార్డ్ వేర్ ఉమ్మడిగా వాడుకోవచ్చు. అయితే ఆ ఏర్పాట్లు, ఒప్పందాల గురించి ఎం ఐ బి కి, ట్రాయ్ కి, సంబంధిత బ్రాడ్ కాస్టర్లకి 30 రోజుల ముందే తెలియజేయాలి.
  7. ఎమ్మెస్వోలు కాస్ ( కండిషనల్ యాక్సెస్ సిస్టమ్) హార్డ్ వేర్ ను ఉమ్మడిగా వాడుకోవచ్చు. అయితే ఆ ఏర్పాట్లు, ఒప్పందాల గురించి ఎం ఐ బి కి, ట్రాయ్ కి, సంబంధిత బ్రాడ్ కాస్టర్లకి 30 రోజుల ముందే తెలియజేయాలి.
  8. ప్రతి ఎమ్మెస్వో కాస్, ఎస్సెమ్మెస్ కచ్చితంగా, సురక్షితంగా పనిచేస్తున్నట్టు చూసుకోవాలి. దానికి పూర్తి బాధ్యత వహించాలి.
  9. విడిగా స్టోరేజ్ నిర్వహిస్తూ, ప్రతి ఎమ్మెస్వో కనీసం రెండు సంవత్సరాల కాస్, ఎస్ ఎం ఎస్ సమాచారాన్ని నిల్వ చేయాలి. ప్రభుత్వ అధికారులు, వారి ప్రతినిధులు ఎప్పుడు అడిగినా చూపగలగాలి.
  10. బ్రాడ్ కాస్టింగ్ నెట్ వర్కుల పంపిణీ చేసే ఎమ్మెస్వోలు సంబంధిత బ్రాడ్ కాస్టర్లు అడిగినప్పుడు వారికి సమాచారం అందజేయాలి. ఆడిట్ చేసే అవకాశం ఇవ్వాలి. అధికారులు అడిగినప్పుడు తనిఖీకి అనుమతించాలి.
  11. బ్రాడ్ కాస్టర్లు ఇంటర్ కనెక్షన్ ఒప్పందాల ప్రకారం తమకు రావాల్సిన డబ్బు ఏ కారణం చేతనైనా ఎమ్మెస్వోలనుంచి రాకపోతే, ప్రసారాల అందజేతను నిలిపివేసే హక్కును ఉపయోగించుకోగలిగేలా ఎమ్మెస్వో దగ్గర సదుపాయాలు ఉండాలి.
  12. ఎక్కడైనా పైరసీ జరిగితే దాన్ని పట్టుకునేలా ఎమ్మెస్వో దగ్గర సాంకేతిక ఏర్పాట్లు ఉండాలి. మొదటి ఆడిట్ లోనే బ్రాడ్ కాస్టర్ల అనుమానాలన్నీ పటాపంచలు చేయగలగాలి.
  13. మౌలిక సదుపాయాలు పంచుకోవటానికి ప్రస్తుతం లైసెన్స్ ఉన్న ఎమ్మెస్వో, కొత్త దరఖాస్తుదారు ఉమ్మడిగా సవివరమైన ప్రతిపాదన సిద్ధం చేయాలి, ఏయే సదుపాయాలు పంచుకుంటున్నారు, ఎలాంటి నిబంధనలు పెట్టుకున్నారు ఎవరెవరి బాధ్యత, పాత్ర ఏంటి అనే విషయాలతో కూడిన ప్రతిపాదనను మంత్రిత్వశాఖకు పంపాలి. అందులో ఉండాల్సిన వివరాలు ఇవి:
    • మౌలిక సదుపాయాలు పంచుకోవటానికి సంబంధితులందరి ఆమోదం
    • మార్గదర్శకాలకు అనుగుణంగా ఇరువురూ పెట్టుకున్న షరతులతో కూడిన ఒప్పంద పత్రాల నకళ్ళు
    • పంచుకునే ఒప్పందాలలో ఎలాంటి రహస్య నిబంధనలు, లైసెన్స్ నియమాలకు విరుద్ధమైనవి ఉండకూడదు.
  14. ఏదైనా వైపరీత్యం సంభవించినప్పుడు చందాదారులకు ప్రసారాలలో అంతరాయం ఏర్పడకుండా ఆపరేటర్
    అత్యవసరంగా వైపరీత్య నష్టం నుంచి కోలుకునే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి.
  15. డిజిటల్ ఎమ్మెస్వో మౌలిక సదుపాయాలను వాడుకునే ఎమ్మెస్వో ఆ తరువాత కాలంలో తనకున్న లైసెన్స్ ఆధారంగా సొంత డిజిటల్ హెడ్ ఎండ పెట్టుకొని ఉమ్మడి వాడక ఒప్పందం నుంచి వైదొలగవచ్చు.
  16. కొత్తగా ఎవరైనా మౌలికసదుపాయాలు పంచుకోవటానికి వస్తే వాళ్ళ అర్హతలను, లైసెన్సులను సరి చూసుకోవాల్సిన బాధ్యత హెడ్ ఎండ్ యజమాని అయిన ఎమ్మెస్వోదే.
  17. కాస్ , ఎస్సెమ్మెస్, ఫింగర్ ప్రింటింగ్, సెట్ టాప్ బాక్స్ తదితర అంశాలలో ట్రాయ్ నిబంధనలు పాటించే బాధ్యత, చట్టవ్యతిరేకమైన పంపిణీని తనిఖీ చేసే బాధ్యత అందరిమీదా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here