కనెక్షన్ల సమాచారం దాచే కాస్, ఎస్ఎంఎస్ మీద నిఘా

0
917

కేబుల్ టీవీ డిజిటైజేషన్ లో భాగంగా 2017లో టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( టాయ్) నిర్దేశించిన ఇంటర్ కనెక్షన్ నిబంధనలలో ఇప్పుడు తాజాగా మార్పులు చేసింది. కనెక్షన్ల సంఖ్యను నిర్దిష్టంగా, కచ్చితంగా తెలియజేయటానికి ఉపయోగపడే కండిషనల్ యాక్సెస్ సిస్టమ్ (కాస్), సబ్ స్క్రైబర్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ( ఎస్ ఎం ఎస్) పనితీరును ధ్రువీకరించటానికి ఒక వ్యవస్థ ఉండేలా ప్రతిపాదించింది. ఒక ఏజెన్సీ చేత పరీక్షింపజేసి ధ్రువీకరించటానికి ఇప్పుడు వెసులుబాటు కలుగుతుంది. అయితే,ఆ ఏజెన్సీ నియామకం ఇంకా జరగాల్సి ఉంది.
డిజిటైజేషన్ లో కనెక్షన్ల సంఖ్య కచ్చితంగా తెలుస్తుంది గనుక పారదర్శకత ఉంటుందని, లెక్కలు కచ్చితంగా తెలియటం వలన ఆదాయ పంపిణీ కూడా సజావుగా జరుగుతుందని అందరూ భావించారు. బ్రాడ్ కాస్టర్లకు పే చానల్ చందా ఆదాయాలు కచ్చితంగా అందుతాయని అనుకున్నారు. అయితే, ఆ లెక్కలు తేల్చే కండిషనల్ యాక్సెస్ సిస్టమ్ ( కాస్), సబ్ స్క్రైబర్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ( ఎస్ ఎం ఎస్) నాసిరకం వాడటం వలన , కొంతమంది ఉద్దేశపూర్వకంగా వాటిని తమకు అనుగుణంగా మార్చుకోవటం వలన సరైన సమాచారం రావటం లేదని, నష్టపోతున్నామని బ్రాడ్ కాస్టర్లు చాలా కాలంగా ఫిర్యాదు చేస్తున్నారు.
కొన్ని చోట్ల ఎమ్మెస్వోలు అక్రమపద్ధతులలో అనలాగ్ ద్వారా ప్రసారాలు అందజేయటం, లెక్కల్లోకి రాకుండానే కంటెంట్ అందేలా చేయటం లాంటి అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ఈ విధంగా డిజిటైజేషన్ లక్ష్యాన్నే దెబ్బతీసే కార్యకలాపాలను అడ్డుకోవాలని ట్రాయ్ నిర్ణయించుకుంది. బ్రాడ్ కాస్టర్ల వత్తిడి కూడా ట్రాయ్ ఇలాంటి నిర్ణయం తీసుకోవటానికి కారణమైంది. ప్రతి ఎమ్మెస్వో వాడుతున్న కాస్, ఎస్ ఎం ఎస్ లను ఒక ఏజెన్సీ తనిఖీ చేసి ధ్రువీకరించేలా చూడటం ద్వారా మాత్రమే అక్రమాలకు అడ్డుకట్ట వేయగలమని ట్రాయ్ భావించింది.
కాస్, ఎస్ ఎం ఎస్ ఎలాంటి ప్రమాణాలు పాటించాలో నిర్దేశించటం ఇందులో మొదటి భాగం. అలా అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా నిర్వచించిన ప్రమాణాలు పాటించినవారికే ధ్రువపత్రం జారీచేయటం ఏజెన్సీ బాధ్యత. అలా ధ్రువపడినప్పుడే చందాదారుల సంఖ్య కచ్చితంగా తేలుతుందని ట్రాయ్ భావిస్తోంది. బ్రాడ్ కాస్టర్లకు కూడా కచ్చితంగా రావాలసిన ఆదాయం, వసూలైన మొత్తాలు లెక్కతేలటం సులభమవుతుంది. ఆ విధంగా రావాల్సిన ఆదాయమంతా వస్తే చానల్ యాజమాన్యాలు మరింత ఖర్చు చేసి నాణ్యమైన ప్రసారాలు అందించటం సాధ్యమవుతుందని చెబుతున్నారు. అంతర్జాతీయ చానల్స్ కూడా ఆదాయం ఆధారంగా మెరుగైన కార్యక్రమాలు అందించటానికి మొగ్గుచూపుతాయి.
కొత్త నియమావళి అమలు చేస్తున్నప్పటికీ, ఎన్ క్రిప్ట్ చేసిన ప్రసారాల అందుబాటులో తెలియకుండానే పెద్ద ఎత్తున లీకేజ్ జరుగుతున్నట్టు, కనెక్షన్ల సంఖ్య కచ్చితంగా తేలకపోవటం వల్ల రావాల్సిన ఆదాయానికి గండిపడుతున్నట్టు బ్రాడ్ కాస్టర్లు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. అనధికార సిగ్నల్స్ పంపిణీ యధేచ్చగా జరిగిపొతున్నట్టు ట్రాయ్ కి అనేక ఫిర్యాదులు వచ్చాయి. పంపిణీ సంస్థలు అక్రమాలకు పాల్పడటమే కారణమని కూడా బ్రాడ్ కాస్టర్లు వాదిస్తూ ఉన్నారు.
కాస్, ఎస్ ఎం ఎస్ సర్వీస్ ప్రొవైడర్లనుంచి కూడా సానుకూల స్పందన కరవైంది. చందాదారుల సంఖ్యను తగ్గించి చూపటం సాధ్యమవుతుందన్న విమర్శలమీద ఆ సంస్థలు స్పందించటం లేదు. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలు వాటికి కనీస ప్రమాణాలు నిర్ణయించలేదు. దీంతో నాసిరకం కాస్, ఎస్ ఎం ఎస్ వాడకంలోకి వచ్చాయి. యావత్ పరిశ్రమకూ మచ్చ తెచ్చేలా అవి నాసిరకంగా తయారయ్యాయి. దీనివలన పంపిణీ నెట్ వర్క్స్ ను హాచ్ చెయ్యటానికి కూడ అవకాశం ఏర్పడుతోంది. ఆ విధంగా చానల్ ప్రసారాలను హాక్ చేసి దారి మళ్ళిస్తున్నట్టు తేలింది.
ఈ సమస్యకు పరిష్కారం కనుక్కునే దిశలో ట్రాయ్ 2020 ఏప్రిల్ 22న ఒక చర్చాపత్రం జారీచేసింది. బ్రాడ్ కాస్టింగ్, కేబుల్ సర్వీసుల కండిషనల్ యాక్సెస్ సిస్టమ్, సబ్ స్క్రైబర్ మేనేజ్మెంట్ సిస్టమ్ పనితీరును నిర్థారించటం కోసం ఒక చట్రాన్ని రూపొందించాలన్న ప్రతిపాదన మీద భాగస్వాములందరి అభిప్రాయాలు సేకరించింది. నాసిరకం కాస్, ఎస్ ఎం ఎస్ లను నియంత్రించటం, అక్రమంగా సిగ్నల్స్ పంపిణీచేస్తూ పైరసీకి పాల్పడేవారికి అడ్డుకట్ట వేయటం అనే రెండు ప్రధాన సమస్యలకు పరిష్కారమార్గాలు చెప్పాలని అందులో కోరింది.
ట్రాయ్ చర్చాపత్రానికి స్పందిస్తూ బ్రాడ్ కాస్టర్లు, పంపిణీదారులు, కాస్, ఎస్ ఎం ఎస్ టెక్నాలజీ పంపిణీదారులు, పరిశ్రమ పరిశీలకులు సహా 36 మంది తమ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తెలియజేశారు. ఆ తరువాత ట్రాయ్ స్వయంగా కొన్ని ఓపెన్ హౌస్ చర్చాకార్యక్రమాలద్వారా మరింతగా అభిప్రాయ సేకరణ జరిపింది. 2020 జూన్25న జరిపిన ఈ వీడియో కాన్ఫరెన్స్ కు దేశవ్యాప్తంగా విస్తృత స్పందన లభించింది. 220 మంది పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు.
అన్నిటినీ విశ్లేషించిన మీదట ఈ విషయంలో సాంకేతికాంశాలు ఇమిడి ఉన్నాయని గుర్తించిన ట్రాయ్ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అందులో కాస్, ఎస్ ఎం ఎస్ ప్రొవైడర్లు, డిటిహెచ్ ఆపరేటర్లు, ఎమ్మెస్వోలు, బ్రాడ్ కాస్టర్ల సంఘం ప్రతినిధులు, బెసిల్ సి-డాక్, ఐఐటి ( కాన్పూర్) సహా అనేక సాంకేతిక సంస్థల ప్రతినిధులు కూడా సభ్యులుగా ఉన్నారు. సమస్యలను ఈ కమిటీ విస్తృతంగా అధ్యయనం చేసిన మీదట ప్రమాణాలు మెరుగుపడాలంటే కాస్, ఎస్ ఎం ఎస్ లకు తనిఖీ, ధ్రువీకరణ వ్యవస్థ అవసరమని సిఫార్సు చేసింది.
కమిటీ సిఫార్సులను మరింత అధ్యయనం చేసిన మీదట ట్రాయ్ అంతిమ నిర్ణయం తీసుకుంది. కాస్, ఎస్ ఎం ఎస్ కచ్చితంగా ఉండటానికి నియంత్రణావిధానాలు అమలు చేస్తున్నప్పటికీ వీలున్నంతవరకు అవి మరీ కఠినంగా కాకుండా, ఎమ్మెస్వోల స్థాయిలోనే సరిదిద్దుకోవటానికి అవకాశం కల్పించాలని నిర్ణయించింది. అయితే, ఒక నిర్దిష్టమైన నియమావళికి కట్టుబడి ప్రామాణికంగా కాస్, ఎస్ ఎం ఎస్ అమలు చేసేలా ఆ సాఫ్ట్ వేర్ ల పనితీరును ధ్రువీకరించి ప్రామాణికంగా ఉండేట్టు చూసేలా ఒక ఏజెన్సీని త్వరలో ప్రకటించాలని ట్రాయ్ నిర్ణయించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here