ప్రైమ్ టైమ్ లో సీరియల్స్, షోస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయని తెలిసిందే. అయితే. తెలుగులో ప్రధానమైన నాలుగు జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ ప్రేక్షకాదరణను గమనిస్తే సగం మంది ప్రేక్షకులు స్టార్ మా చూస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది.
తాజాగా బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్ ) అందించిన సమాచారం ప్రకారం స్టార్ మా చానల్ కు గతవారంలో 21.1 కోట్ల వీక్షణలు లభించగా జీ తెలుగుకు 9.9 కోట్లు, ఈటీవీకి 6.7 కోట్లు, జెమినీకి 2.5 కోట్ల వీక్షణాలు లభించాయి. అంటే స్టార్ మా ప్రేక్షకాదరణ 21.1 కోట్లతో పోల్చినప్పుడు మిగిలిన మూడు ఛానల్స్ ఆదరణ కలిపినా ( 19.1 కోట్లు) అంతకంటే తక్కువే.
ఏడు రోజుల మొత్తం ప్రేక్షకాదరణను లెక్కిస్తే స్టార్ మా మొదటి స్థానంలో (2548 లక్షలు), జీ తెలుగు (1410 లక్షలు) రెండో స్థానంలో, ఈటీవీ తెలుగు (1092 లక్షలు) మూడో స్థానంలో, జెమినీ టీవీ (772 లక్షలు) నాలుగో స్థానంలో ఉన్నాయి. జాతీయ స్థాయిలో సన్ టీవీ మళ్ళీ మొదటి స్థానం దక్కించుకోగా మూడో స్థానంలో ఉన్న స్టార్ మా ఒక్కటే టాప్ టెన్ లో ఉన్న తెలుగు చానల్.
