కేబుల్ ఆపరేటర్లను, చందాదారులను వలలో వేసుకునే ఉచిత ఆఫర్లు, డిస్కౌంట్లతో జాగ్రత్త!

0
802

సెట్ టాప్ బాక్స్ ఫ్రీ అని గాని, మూడు నెలలపాటు చందా కట్టనక్కర్లేదని గాని ఎవరైనా ఆఫర్ ఇవ్వజూపితే కేబుల్ టీవీ చందాదారులు తొందరపడకుండా కాస్త ఆలోచించాలి. ఎవరైనా ఆలామటి ఆఫర్ ఎందుకిస్తారు? వాళ్ళ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవటానికి, నష్టానికి ఎవరూ వ్యాపారం చేయరు కాబట్టి కచ్చితంగా దాని వెనుక ఏదో కుట్ర దాగి ఉంటుందన్న చిన్న ఆలోచన వస్తే చాలు, అసలు విషయం అర్థమవుతుంది.
ఇప్పుడు జరుగుతున్నది అదే. పెద పెద్ద కార్పొరేట్ ఎమ్మెస్వోలు రకరకాల ఆఫర్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సెట్ టాప్ బాక్స్ ఉచితంగా ఇస్తామనేది అందులో ఒకటి. ఆలా ఎందుకిస్తారంటే, శాశ్వతంగా మిమ్మలని వాళ్ళ పరిధిలోకి తెచ్చుకోవటానికి. అంటే, మీకు తెలియకుండానే మీరు చూసే చానల్స్ మీద అజమాయిషీని వాళ్ళు తీసుకుంటున్నారు.
పైగా, ఆ సెట్ టాప్ బాక్స్ మీ ఇంట్లో ఉన్నా, దాని యజమాని మీరు కాదు. మీరు యజమాని అయితే మీరు ఇష్టమొచ్చిన చోటుకు దాన్ని తీసుకు పోవచ్చు. కానీ కార్పొరేట్ ఎమ్మెస్వో ఇచ్చే సెట్ టాప్ బాక్స్ యజమాని ఆ ఎమ్మెస్వో మాత్రమే. అందువలన అది మీకు ఉచితంగా ఇచ్చినట్టు కానే కాదు, కేవలం తన బాక్సును మీ ఇంటి ఆవరణలో పెడుతున్నాడంతే.
ఇప్పుడున్న సెట్ టాప్ బాక్స్ స్థానంలో కొత్త సెట్ టాప్ బాక్స్ ఉచితంగా ఇస్తాం కాబట్టి మీ చందాదారులను మా నెట్ వర్క్ లో కలిపేసేయ్ అని లోకల్ కేబుల్ ఆపరేటర్లను వలలో వేసుకునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కార్పొరేట్ ఎమ్మెస్వోలు ఈ విద్యలో ఆరితేరిపోయారు. ఆ తరువాత ఈ కేబుల్ కనెక్షన్ల సంఖ్య ఆధారంగా మరో పెద్ద కార్పొరేట్ సంస్థకు అమ్ముకోవటానికి ఇది పెట్టుబడి మాత్రమే. అంటే, ఈ ఆటలో ఆపరేటర్ ఒక పావు మాత్రమే. కష్టం ఆపరేటర్ ది, ఫలితం మాత్రమ్ కార్పొరేట్ ఎమ్మెస్వోది.
కేబుల్ వ్యాపారం మీద కార్పొరేట్ కంపెనీల డేగ కన్ను పడటంతో ఈ ధోరణులు బాగా పెరుగుతున్నాయి. చిన్న చిన్న కేబుల్ నెట్ వర్క్స్ ను తమ పరిధిలోకి లాక్కోవటానికి చేస్తున్న ప్రయత్నాలలో ఇవి ఒక భాగం మాత్రమే. కొన్ని సందర్భాలలో కొన్ని నెలలపాటు పే చానల్స్ చందా కూడా లేకుండా ఇస్తామంటారు. ఇవన్నీ కేబుల్ ఆపరేటర్లను, చందాదారులను బుట్టలో వేసుకునే ప్రయత్నం భాగమే.
అయితే, ఈ విషయాన్ని అర్థం చేసుకొని అప్రమత్తంగా ఉన్నవారు మాత్రమే రాబోయే ప్రమాదం నుంచి బైట పడగలుగుతారు. చందాదారులైనా, కేబుల్ ఆపరేటర్ అయినా తాత్కాలికమైన ఆఫర్లకు మోసపోకుండా ఉండాకసిన అవసరం ఉంది. లేనిపక్షంలో అసలుకే మోసం వస్తుంది. భవిష్యత్తులో వ్యాపారంలో నిలబడాలనుకునే ఎమ్మెస్వోలు, కేబుల్ ఆపరేటర్లు ఇలాంటి కార్పొరేట్ ఎమ్మెస్వోల ఉచ్చులో పడకుండా జాగ్రత్తపడాలి. అప్పుడే వ్యాపారంలో నిలదొక్కుకోవటం కుదురుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here