కేబుల్ ఆపరేటర్లమీద మరింత భారం: పోల్ చార్జీల భారీ పెంపు

0
1242

మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టు కేబుల్ ఆపరేటర్లమీద పోల్ రెంటల్ చార్జీల భారం పెరిగింది. ఉన్న పోల్ టాక్స్ ను రద్దు చేస్తామని ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు హామీ ఇస్తూ వస్తుండగా అది రద్దు కాకపోవటమే కాకుండా, ఏకంగా రెట్టింపు మించి భారీగా పెరగటం విశేషం. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ( ఎపిఇపి డీసీఎల్) కొత్త ఛార్జీలు ప్రకటిస్తూ, ఫిబ్రవరి 10 నుంచి ఇవి అమలులోకి వస్తాయని చెప్పింది. 9న విడుదలైన ఈ ఉత్తర్వు మీద ఎపిఇపిడీసీఎల్ (విశాఖపట్నం) సీఎండీ సంతకం చేశారు.
ఈ ఉత్తర్వు ప్రకారం స్థానిక కేబుల్ ఆపరేటర్లు తాము ఉపయోగించుకునే కరెంట్ స్తంభాలకు గాను కొత్తగా సవరించిన ఛార్జీలకు అనుగుణంగా జీఎస్టీ సహా చెల్లించాల్సి ఉంటుంది. మున్సిపాలిటీలు, జిల్లా కేంద్రాలలో ఒక్కో స్తంభానికి నెలకు రూ.100 చొప్పున, ఇతర మున్సిపాలిటీలు, మండల కేంద్రాలలో నెలకు స్తంభానికి రూ.75 చొప్పున, గ్రామీణ ప్రాంతాలలో అయితే స్తంభానికి నెలకు రూ,50 చొప్పున చెల్లించాలని ఈ తాజా ఉత్తర్వు చెబుతోంది.
ఈ చార్జీలను గతంలో పోల్ టాక్స్ అని పిలిచేవారు. అయితే, కోర్టు అభ్యంతరం చెప్పటంతో అద్దెగా మార్చారు. ఈ అద్దె నెలనెలా కట్టాల్సి ఉంటుంది. ఆలస్యమైతే 18% సర్ చార్జ్ విధిస్తారు, దానిమీద కూడా జేఎస్టీ ఉంటుంది. రెండు నెలల్లోగా చెల్లించకపోతే సర్వీస్ కేబుల్స్ తొలగిస్తారు. ఈ మేరకు ఈ తాజా ఉత్తర్వులలో స్పష్టం చేశారు.
ఈ ఛార్జీలు మూడేళ్ళకు వర్తిస్తాయని ఈ ఆదేశాలలో పేర్కొంటూనే, ఏడాదికి ఒకసారి సమీక్షించే అధికారం ఉంటుందని కూడా చెప్పటం గమనార్హం. కేబుల్ ఆపరేటర్ కార్యకలాపాల పరిధి డివిజన్ కే పరిమితమైతే డివిజన్ స్థాయిలోనే, డివిజన్ మీరీ పోతే సర్కిల్ స్థాయిలోనూ ఒప్పందాలు జరుగుతాయి.
మార్గదర్శకాలు, పాటించాల్సిన భద్రతా ప్రమాణాలు తదితర అంశాలను సంస్థ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్టు పేర్కొంటూ దాని అడ్రెస్ ఇచ్చారు: https://www .apeasternpower.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here