91% అప్పులు తీర్చిన సుభాష్ చంద్ర

0
533

ఎస్సెల్ గ్రూప్ ఛైర్మన్, జీ టీవీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర మొత్తం 43 మంది ఋణదాతలకు చెల్లింపులు జరపటం ద్వారా 91% అప్పులు తీర్చినట్టు తెలియజేశారు. మిగిలిన అప్పులు సైతం క్రమంగా తీర్చే పనిలో ఉన్నట్టు పేర్కొన్నారు. 2019 జనవరి 25 న ఆయన ఒక బహిరంగ లేఖ రాస్తూ, నగదురూపంలో ఆస్తి లేకపోవటం వలన ఋణదాతలు తనవలన ఇబ్బందులు పడుతున్నందుకు క్షమాపణలు చెప్పారు. ఆ తరువాత ఆస్తులు అమ్మి ఇవ్వటానికి కూడా కోవిడ్ సంక్షోభంలో సాధ్యం కాలేదని ఈరోజు (ఆగస్టు 8 న) రాసిన తాజా లేఖలో చెప్పారు.
“ మొత్తం 91.2% అప్పులు తీర్చివేయటం ద్వారా ఆర్థిక సంక్షోభం నుంచి బైటపడినందుకు సంతోషంగా ఉంది. 43 మంది ఋణదాతల 110 ఖాతాల మీద అప్పు తీర్చాను. ఇప్పటికే 88.3% చెల్లింపులు పూర్తి కాగా మరో 2.9% పురోగతిలో ఉంది. ఇంకా మిగిలిన 8.8 శాతం కూడా వీలైనంత త్వరగా చెల్లించే పనిలో ఉన్నా. ఈ అప్పులు తీర్చటానికి కొన్ని ఆస్తులు అమాలసి వచ్చినందుకు నాకెలాంటి బాధాలేదు. మా కుటుంబ గౌరవం కాపాడుకోవటానికి ఈ నిర్ణయం తీసుకున్నా. “ అని అందులో రాశారు.
భవిష్యత్తులో డిజిటల్ వీడియో రంగంలో ప్రవేశిస్తున్నట్టు కూడా ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఇప్పటికే వీడియో వ్యాపారంలో గడించిన అనుభవాన్ని జోడించి డిజిటల్ లో దిగుతున్నట్టు చెప్పారు. దీనికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ కూడా జోడిస్తున్నట్టు తెలియజేశారు. అయితే, ఈ వ్యాపారం వలన జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (జీల్) తో ఎలాంటి వివాదాలూ ఉండబోవని కూడా వివరణ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here