భారీ శిక్షలనుంచి ఆపరేటర్లకు విముక్తి: కేబుల్ టీవీ చట్టానికి త్వరలో సవరణ

0
713

కేబుల్ టీవీ చట్టంలోని కొన్ని ప్రమాదకరమైన సెక్షన్లను తొలగించటానికి సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కసరత్తు మొదలుపెట్టింది. ఆ సెక్షన్లను తొలగించటం ద్వారా ఆపరేటర్లకు జైలు శిక్ష, చట్టపరమైన ఇతర సమస్యలనుంచి విముక్తి కలుగుతుంది. మంత్రిత్వశాఖ ఇప్పటికే ఒక చర్చాపత్రం విడుదలచేసి పరిశ్రమలోని వారి అభిప్రాయల సేకరణకు పూనుకుంది. కేబుల్ టీవీ చట్టంలోని  16, 17, 18 సెక్షన్లను పూర్తిగా తొలగించటానికి నిర్ణయించింది.  ఈ ముసాయిదా మీద అభిప్రాయాల సేకరణ కోసం పొడిగించిన గడువు ఈ నెల24 తో పూర్తవుతుండగా ఆ తరువాత చట్ట సవరణ ప్రక్రియ మొదలవుతుంది.

నాలుగో అధ్యాయంలోని 16 వ సెక్షన్ ప్రకారం కేబుల్ నెట్ వర్క్ రిజిస్ట్రేషన్ సక్రమంగా జరగకపోయినా, అడ్రెసిబుల్ విధానంలో ప్రసారాలు చేయకపోయినా, ప్రామాణిక పరికరాలు వాడకపోయినా  జైలు శిక్ష పడుతుంది. అదే విధంగా బ్రాడ్ కాస్టర్లు ప్రోగ్రామింగ్, అడ్వర్టయింగ్ నిబంధనావళిని పాటించకపోయినా  వాటిని ప్రసారం చేసినందుకు ఆపరేటర్ కు శిక్ష తప్పదు. అందుకే ఈ సెక్షన్ ను రద్దు చేయటం వలన అనవసరమైన జైలు శిక్ష నుంచి ఎమ్మెస్వో/ఆపరేటర్ కు విముక్తి కలుగుతుంది.

ఇప్పుడు తలపెట్టిన సవరణల వలన శిక్ష పరిమితంగా ఉంటుంది. అంటే, కేబుల్ ఆపరేటర్ స్థాయిలో జరిగిన తప్పిదాలకు ఆ ఆపరేటర్ పరికరాల స్వాధీనం లాంటి చర్యలుంటాయి. టీవీ చానల్స్ ప్రసారం చేసే  కార్యక్రమాలకు గతంలో ఆపరేటర్ ను బాధ్యుణ్ణి చేసే నిబంధనలుండేవి. అయితే, ఇకమీదట ప్రోగ్రామింగ్, అడ్వర్టయిజింగ్ నిబంధనలను పాటించని  చానల్స్ లైసెన్సులు రద్దవుతాయి. అదే సమయంలో క్షమాపణ కోరుతూ ఆ చానల్స్ లో స్క్రోల్ నడపాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై శిక్ష వేసే ప్రక్రియను సెక్షన్ 16  నుంచి సెక్షన్ 11 లోని సబ్ సెక్షన్ (1) కి మారుస్తారు. ఈ విధంగా ఆ భారాన్ని కేబుల్ ఆపరేటర్ నుంచి తొలగించి చానల్స్ మీదనే వేస్తున్నారు.

అదే విధంగా సెక్షన్ 17 , 18లను పూర్తిగా తొలగించాలని మంత్రిత్వశాఖ ప్రతిపాదించింది. ప్రస్తుత చట్టాలను సమీక్షించి హేతుబద్ధంగా మార్చాలన్న కేంద్రప్రభుత్వ నిర్ణయాలలో భాగంగానే ఈ సవరణ జరుగుతోంది. చిన్నపాటి పొరపాట్లకు పెద్ద శిక్షలు వేసే విధానం పోవాలని మంత్రిత్వ శాఖ కేబుల్ టీవీ చట్టంలో మార్పులు చేయాలని నిర్ణయించుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here