కొత్త టారిఫ్ ఆర్డర్: అసలేం జరుగుతోంది?

0
779

రెండేళ్ల కిందట టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) జారీ చేసిన కొత్త టారిఫ్ ఆర్డర్ (ఎన్టీవో 2.0) మీద బ్రాడ్ కాస్టర్ల కేసు ఒకవైపు సుప్రీం కోర్టు కేసులో పెండింగ్ లో ఉంది. స్టే ఇవ్వలేదు కాబట్టి అమలు చేయాల్సిందేనని ట్రాయ్ లేఖ రాయటంతో బ్రాడ్ కాస్టర్లు ధరలు పెంచుతూ టారిఫ్ ఆర్డర్ అసలు లక్ష్యానికి తూట్లు పొడిచారు. దీంతో నవ్వులపాలైన ట్రాయ్ ఏం చేయాలో అర్థం కాక అమలు తేదీని వాయిదా వేసింది. ఆ గడువు కూడా ఇప్పుడు ముగిసింది. చావు తప్పి కన్నులొట్టబోయిన ట్రాయ్ ఏదో రకంగా బ్రాడ్ కాస్టర్లతో రాజీపడే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, మరీ ఆలా ఒప్పుకుంటే బాగుండదని ముందుగా ఒక చర్చాపత్రం విడుదల చేసి బ్రాడ్ కాస్టర్లతో సంధికి ప్రయత్నిస్తున్నట్టు మార్కెట్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

బ్రాడ్ కాస్టర్ల ప్రధాన అభ్యంతరం గరిష్ఠ చిల్లర ధర విషయంలోనే. బొకేలో చేర్చే పే చానల్ ధర గరిష్ఠంగా రూ.19 వరకు ఉండేలా ఎన్టీవో 1.0 చెప్పగా దానివల్ల వినియోగదారులమీద భారం ఎక్కువగా పడుతున్నట్టు ట్రాయ్ గుర్తించింది. అందుకే ఈ గరిష్ఠ చిల్లర ధరను రూ.12 కి తగ్గించింది. దీంతో బ్రాడ్ కాస్టర్లు తమ ప్రధాన చానల్స్ ను బొకే నుంచి తప్పించి సగటున 30% మేరకు వాటి ధర మునుపటికంటే కూడా ఎక్కువగా ఉండేలా నిర్ణయించారు. ఎమ్మెస్వోలు, బ్రాడ్ కాసటర్లు. వినియోగదారులు ఒక్కసారిగా గగ్గోలుపెట్టారు. కొండ నాలుకకు మందువేస్తే ఉన్న నాలుక ఊడినట్టయింది ట్రాయ్ పరిస్థితి. ఎటూ జవాబు చెప్పుకోలేని ఇరకాటంలో పడింది.

అసలే కొన్ని రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో పెరిగిన ధరల ప్రభావం ఎన్నికలమీద ఉండవచ్చునన్న అభిప్రాయం ఎలాగూ అధికారపక్షానికి ఉండనే ఉంటుంది. ఇలా అనుమానిస్తున్న సమయంలోనే ట్రాయ్ ఈ కొత్త టారిఫ్ ఆర్డర్ అమలుకు కొంత సమయమిస్తున్నట్టు ప్రకటించింది. అప్పటికే ప్రధాన బ్రాడ్ కాస్టర్లందరూ కొత్త ధరలు ప్రకటించి ఉండటంతో ఏం జరగబోతున్నదో ట్రాయ్ కి స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు ఆ అదనపు సమయం కూడా ముగిసినా బ్రాడ్ కాస్టర్లు పట్టువీడకపోవటంతో ఒక కమిటీ వేయాలా, చర్చా పత్రం విడుదలచేసి అభిప్రాయసేకరణ పేరుతో ఎన్నికల దాకా కాలయాపన చేసి ఆ తరువాత అమలు చేయాలా అని ట్రాయ్ ఆలోచనలో పడింది.

నిజానికి బ్రాడ్ కాస్టర్లు సుప్రీంకోర్టులో కేసు ఉపసంహరించుకుంటే సమస్య పరిష్కారం దిశలో చర్చించవచ్చునని ట్రాయ్ భావిస్తోంది. ఈ మేరకు బ్రాడ్ కాస్టర్ల సంఘమైన ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ అండ్ డిజిటల్ ఫౌండేషన్ ( ఐబీడీఫ్) కు లేఖ రాసింది. అయితే, ఈ విషయంలో ఐబీడీఫ్ ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. ఏప్రిల్ 1 నుంచి ఎన్టీవో 2.0 అమలు చేయాలన్న ట్రాయ్ నిర్ణయంలో ఏదైనా మార్పు ఉంటే ఆ విషయం అధికారికంగా సుప్రీంకోర్టులోనే చెప్పాలని కోరుకుంటోంది.
ధరలు పెంచి చందాదారులను ఇబ్బంది పెట్టబోమని బ్రాడ్ కాస్టర్లు స్పష్టం చేసిన పక్షంలో వాళ్ళ సమస్యల సంగతి చూస్తామని ట్రాయ్ చెప్పింది. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో సైతం సమస్యలు ఎదురైనప్పుడు వాటి పరిష్కారానికే కట్టుబడి ఉంటామని ట్రాయ్ స్పష్టం చేసింది. కానీ ట్రాయ్ ఏ విషయమైనా కోర్టు ముందు స్పష్టంగా చెబితేనే అందుకు తగినట్టుగా నిర్ణయం తీసుకోవాలన్నది ఐబీడీఫ్ అభిప్రాయంగా కనబడుతోంది. ట్రాయ్ పొరపాటు ఉన్నప్పటికీ దాన్ని ఒప్పుకునే ధైర్యం లేకనే తమను కేసు వెనక్కి తీసుకోవాలని అడుగుతున్నదని బ్రాడ్కాస్టర్లు వాదిస్తున్నారు. అందుకే ట్రాయ్ స్వయంగా కోర్టుకు చెబితే తప్ప ఈ ప్రతిష్ఠంభన తొలగే అవకాశం కనబడటం లేదు.

చర్చా పత్రం విడుదల చేయాలని ట్రాయ్ భావిస్తున్నప్పటికీ ఈ వ్యవహారం కోర్టులో ఉన్నంతకాలం అది కుదరదు ఉపసంహరణ తరువాత మాత్రమే అలాంటి ప్రక్రియ ఏదైనా చేపట్టవచ్చునే తప్ప ఈలోపు చఱయగలిగిందేమే లేదని కూడా బ్రాడ్ కాస్టర్లు అంటున్నారు. మరో వైపు ట్రాయ్ కూడా పే చానల్ ధరలు ఒకసారిగా కాకుండా రెండు విడతలుగా కొద్ది మొత్తాల్లో పెంచుకోవాలసిందిగా బ్రాడ్ కాస్టర్లకు చెప్పినట్టు తెలుస్తోంది. కొంతమంది బ్రాడ్ కాస్టర్లకు ఈ ఆలోచన నచ్చినా, మరికొందరు మాత్రం ససేమిరా అంటూండటంతో వ్యవహారం ఒక కొలిక్కివచ్చేలా కనబడటం లేదు. ఒకవైపు టెలికాం కంపెనీలు ఈ మధ్యనే 20-25% ధరలు పెంచగా తాము మూడేళ్ళుగా పెంచలేదని బ్రాడ్ కాస్టర్లు వాదిస్తున్నారు.

బ్రాడ్ కాస్టర్లు ఈ మధ్య జారీచేసిన రిఫరెన్స్ ఇంటర్ కనెక్ట్ ఆఫర్ ప్రకారం చూస్తే కేబుల్ బిల్లు సగటున నెలకు రూ.50 మేరకు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. దీనివల్ల కొంతమంది చందాదారులు టీవీ వదిలేసి ఓటీటీకి వెళ్ళిపోయే అవకాశముంది. అదే సమయంలో ఉత్తరాదిన చాలామంది ఫ్రీడిష్ కోరుకోవచ్చు. మొత్తంగా చూసినప్పుడు ఇది కేబుల్ వ్యాపారం మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది. కనెక్షన్లు తగ్గితే స్థానిక కేబుల్ ఆపరేటర్లకు ఖర్చు తగ్గకపోగా ఆదాయం పడి పోయి భారీగా నష్టపోతారు.

ఈ నేపథ్యంలో ఒక పరిష్కారమార్గం కనుక్కుంటే బాగుంటుందంటూ ఈ వ్యవహారాన్ని ఒక కొలిక్కి తెచ్చేందుకు అనధికారికంగా సమావేశాలు జరిపిన ట్రాయ్ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అందులో బ్రాడ్ కాస్టర్లు, జాతీయ స్థాయి కార్పొరేట్ మల్టీ సిస్టమ్ ఆపరేటర్లు (ఎం ఎస్ వో లు) స్వతంత్ర ఎమ్మెస్వోలు ఉన్నారు. మొత్తంగా స్థానిక కేబుల్ ఆపరేటర్లను (ఎల్ సీ వో లు) కమిటీలో వేయలేదు. ఎన్టీవో 2.0 అమలు నిలిపివేయాలని కోరుతూ ఇప్పటికే అనేకమందికి ట్రాయ్ కి వినతి పత్రాలూ, లేఖలూ రాశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here