పంపిణీ సంస్థలు నిబంధనలు పాటించాలని ట్రాయ్ ఆదేశం

0
554

టీవీ చానల్స్ పంపిణీవేదికలు ( ఎమ్మెస్వోలు, డీటీహెచ్, హిట్స్, ఐపీటీవీ ఆపరేటర్లు) ఇంటర్ కనెక్షన్ నిబంధనలు పాటించాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్) ఆదేశించింది. అందిస్తున్న చానల్స్ జాబితా, ఎలక్ట్రానిక్ ప్రోగ్రామింగ్ గైడ్ లో వాటిని చూపటంలో నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని స్పష్టం చేస్తూ ఈ నెల 24 న ఒక లేఖ రాసింది. నిబంధనలు పాటిస్తున్నట్టు 15 రోజులలోగా వివరాలు అందజేయాలని కూడా ట్రాయ్ ఆదేశించింది.
పలువురు ఎమ్మెస్వోల నుంచి అందిన సమాచారాన్ని విశ్లేషించినమీదట ఇంటర్ కనెక్షన్ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించటం లేదని ట్రాయ్ దృష్టికి వచ్చింది. ఎలకటిరాణిక ప్రోగ్రామింగ్ గైడ్ ( ఈపీజీ) లో చానల్స్ జాబితా పెట్టటంలోనూ, వాటిని ప్రదర్శించటంలోనూ నిబంధనలను పాటించటంలో ఎమ్మెస్వోలు విఫలమైనట్టు తమ దృష్టికి వచ్చినట్టు ట్రాయ్ ఈ లేఖలో పేర్కొంది.
ప్రతి ఎమ్మెస్వో తన నెట్ వర్క్ లో అందుబాటులో ఉన్న ప్రతి టీవీ చానల్ కూ ఒక విశిష్ఠ సంఖ్య కేటాయించి, ఆ చానల్ ఏ కేటగిరీకి ( జనరల్ ఎంటర్టైన్మెంట్, మ్యూజిక్, మూవీస్, కిడ్స్, స్పోర్ట్స్, న్యూస్… ఇలా) చెందినదో ఇంటర్ కనెక్షన్ ఒప్పందంలో బ్రాడ్ కాస్టర్ చెప్పిన మేరకు పేర్కొనాలని 2020 సెప్టెంబర్ 17 న రాసిన లేఖలోనే ట్రాయ్ స్పష్టం చేసింది. ఈ పూర్తి సమాచారాన్ని తనకు సమర్పించాలని కూడా ఆ లేఖలో ట్రాయ్ సూచించింది. ఇప్పుడు మరోమారు లేఖ రాస్తూ 15 రోజుల గడువునిచ్చింది.
నిబంధనల ప్రకారం ప్రతి బ్రాడ్ కాస్టర్ తన చానల్ ఏ విభాగం కిందికి వస్తుందో ఇంటర్ కనెక్షన్ ఒప్పందంలో స్పష్టం చేయాలి. అంటే జనరల్ ఎంటర్టైన్మెంట్, ఆధ్యాత్మికం, ఇన్ఫోటైన్మెంట్, మ్యూజిక్, మూవీస్, కిడ్స్, న్యూస్ అండ్ కరెంట్ అఫైర్స్, స్పోర్ట్స్, ఇతరములు.. అంటూ స్పష్టంగా చెప్పాలి.
ఎమ్మెస్వో తన నెట్వర్క్ లో ఉన్న చానల్స్ అన్నిటినీ ఎలక్ట్రానిక్ ప్రోగ్రామింగ్ గైడ్ లో ఉంచటంతోబాటు ఒక భాషకు చెందిన ఒక విభాగపు చానల్స్ అన్నీ ఒకచోట మాత్రమే ఉండేలా అమర్చాలి. ఉదాహరణకు తెలుగు సినిమా చానల్స్ అన్నీ ఒకచోట ఒక వరుసలో, ఇంగ్లీష్ న్యూస్ చానల్స్ అన్నీ ఒకచోట.. ఉండేట్టు చూడాలి. ఒక్కో చానల్ కు ఒక విశిష్ఠ సంఖ్య కేటాయించాలి.
ఈ నియమాన్ని పాటిస్తున్నట్టు ఋజువుగా పూర్తి సమాచారాన్ని 15 రోజుల్లోగా ట్రాయ్ కి పంపాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here