తక్షణమే న్యూస్ చానల్స్ కు రేటింగ్స్: 4 వారాల సగటు పద్ధతి

0
587

న్యూస్ చానల్స్ కు మళ్ళీ రేటింగ్స్ వెల్లడించటం మొదలు కాబోతోంది. వివాదాలు తారస్థాయికి చేరి ఒక చానల్ సీఈవో, రేటింగ్స్ లెక్కింపు సంస్థ బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బారక్) మాజీ సీఈవో సహా 14 మంది అరెస్ట్ కావటానికి దారితీసిన పరిస్థితుల మధ్య దాదాపు 14 నెలల కిందట రేటింగ్స్ ఆగిపోవటం తెలిసిందే. తక్షణమే రేటింగ్స్ పునరుద్ధరించాలని సమాచార, ప్రసార మంతృత్వ శాఖ ఈ రోజు బార్క్ కు సూచించింది.
గత మూడు మాసాల డేటా కూడా ఇవ్వాలని చెబుతూనే నిజమైన ట్రెండ్ తెలిసేలా నాలుగు వారాల సగటు లెక్కించి ఇవ్వాలని కూడా చెప్పటం విశేషం. సాధారణంగా శనివారం నుంచి శుక్రవారం వరకూ లెక్కించిన సమాచారాన్ని ఆ తరువాత వచ్చే గురువారం నాడు విడుదల చేస్తారు. ఆ విధంగా బార్క్ ప్రతి వారం అంతకు ముందు వారం ప్రేక్షకాదరణ సమాచారం ఇస్తుంది.
అయితే, ఇప్పుడు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఇచ్చిన ఆదేశాల ప్రకారం నాలుగువారాల సగటు మాత్రమే ఇవ్వాలి. లెక్కించిన వారంతో బాటు అంతకు ముందు మూడు వారాల సమాచారాన్ని కూడా కలిపి నాలుగు వారాల సగటు మాత్రమే న్యూస్ చానల్స్ కు బార్క్ వెల్లడిస్తుంది. దీనివలన ట్రెండ్ తెలుస్తుంది. అనారోగ్యకరమైన ధోరణులను కొంత మేరకు అడ్డుకోవటానికి ఇది పనికొస్తుంది. న్యూస్ చానల్స్ తోబాటు అంశాలవారీ చానల్స్ ( మ్యూజిక్, మూవీస్, కిడ్స్, ఇన్ఫోటైన్మెంట్, స్పిరిచ్యువల్, స్పోర్ట్స్) కు కూడా ఇక మీదట ఇదే పద్ధతి పాటించాలని బార్క్ కు ప్రభుత్వం సూచించింది.
రేటింగ్స్ లెక్కింపులో మార్పులు సూచించవలసిందిగా సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కోరిన మీదట భాగస్వాములతో చర్చించి ట్రాయ్ 2020 ఏప్రిల్ 28 న కొన్ని సిఫార్సులు చేసింది. ఆ తరువాత పెద్ద ఎత్తున వివాదం చెలరేగినప్పుడు ప్రభుత్వం నేరుగా ప్రసార భారతి సీఈవో అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ ఇచ్చిన సిఫార్సులను కూడా దాదాపు ఏడాది తరువాత ప్రభుత్వం లెక్కలోకి తీసుకుంది. బార్క్ కూడా కొన్ని మార్పులు చేసి మరింత కట్టుదిట్టంగా రేటింగ్స్ లెక్కగట్టే చర్యలు తీసుకున్నట్టు చెప్పటంతో రేటింగ్స్ వెల్లడికి బార్క్ కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here