సుశాంత్ సింగ్ మరణాన్ని సంచలనాత్మకం చేసిన చానల్స్ మీద చర్యలు

0
561

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ పుత్ మరణానికి సంబంధించిన సున్నితమైన అంశాలను సైతం సంచలనాత్మకం చేసిన న్యూస్ చానల్స్ క్షమాపణ కోరుతూ ప్రసారం చేయాలని  న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ అదేశించింది. సుశాంత్ చేసిన ట్వీట్ గా పేర్కొంటూ సున్నితత్వం కోల్పోయి ప్రసారం చేసిన అభియోగం మేరకు ఆజ్ తక్ చానల్ కు లక్ష రూపాయల జరిమానా విధించింది.  

జీ న్యూస్, ఇండియా టీవీ, ఆజ్ తక్, న్యూస్ 24 చానల్స్ టీవీ కవరేజ్ లో విలువలు విస్మరించినందుకు, మృతుని గౌరవానికి భంగం కలిగించినందుకు క్షమాపణలు ప్రసారం చేయాలని ఎన్ బి ఎస్ ఎ ఆదేశించింది. సంస్థ ఛెయిర్ పర్సన్ హోదాలో రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎకె సిక్రీ ఈ ఆదేశాలమీద సంతకం చేశారు. మృతుని ట్వీట్లు అవునో, కాదో తేలకుండానే నకిలీ ట్వీట్లు ప్రసారం చేసే ముందు నిజానిజాలు నిర్థారించుకోవటంలో విఫలమైనందుకు ఈ చర్యలు అవసరమయ్యాయన్నారు. ఆజ్ తక్ ఈ క్షమాపణను ఎప్పుడు ప్రసారం చేయాలో తేదీ, విషయం తెలియజేస్తామని పేర్కొంది. ప్రసారం చేశాక దాన్ని రికార్డు చేసి వారం రోజుల్లోగా ఋజువుగా ఆ సీడీని ఇవ్వాలని కోరింది.

సుశాంత్ సింగ్ భౌతిక కాయాన్ని చూపినందుకు న్యూస్ నేషన్ సంస్థ మీద కూడా చర్యలు తీసుకోవాలని భావించినప్పటికీ ఆ చానల్ తప్పు ఒప్పుకుంటూ వెంటనే అ వీడియోను ఉపసంహరించుకోవటం వలన హెచ్చరికతో వదిలేసినట్టు పేర్కొంది. క్లోజప్ చూపకుండా దూరం నుంచి మృతదేహాన్ని చూపించిన ఎబిపి మఝా ను కూడా హెచ్చరికతో వదిలేశారు.

మీడియాకు వాక్స్వాతంత్ర్యం ఉన్నప్పటికీ, ఒక నటుని ఆత్మహత్య వ్యవహారం పెద్ద వార్తే అయినప్పటికీ దానిమీద చర్చ పెట్టినప్పుడు అది ఊహాగానాలవైపు దారితీస్తుందని ఎన్ బి ఎస్ ఎ పేర్కొంది. అలాంటి కేసులకు సంచలనాత్మకత జోడించి ప్రసారం చేయటం  సమంజసం కాదని, మీడియా సంయమనంతో వ్యవహరించాలని పేర్కొంది,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here