ఎన్ ఎక్స్ టి డిజిటల్ డమ్మీ ఆపరేటర్ ప్రయత్నాన్ని తిప్పికొట్టిన కేబుల్ ఆపరేటర్లు

0
1489

కేబుల్ రంగాన్ని ధ్వంసం చేయటానికి కార్పొరేట్ కుయుక్తులు మళ్ళీ మొదలయ్యాయి. ఏళ్ల తరబడి కష్టపడి నిర్మించుకొని దీన్నే జీవనోపాథిగా మార్చుకున్న వారిని దెబ్బతీయటానికి ప్రయత్నించటం  కార్పొరేట్ ఎమ్మెస్వోలకు కొత్త కాకపోయినా ఇప్పుడు రకరకాల తాయిలాలతో ఏ మాత్రం అనుభవం లేని  పోటీ దారులను రంగంలోకి దింపి వ్యాపారాన్ని కైవసం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల నేరుగా ఆపరేటర్లమీద, మరికొన్ని చోట్ల స్వతంత్ర ఎమ్మెస్వోలమీద ఈ తరహా దొంగదాడులు చేయటానికి ఈ కార్పొరేట్ ఎమ్మెస్వోలు వెనకాడటం లేదు.

తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ( ప్రస్తుత జగిత్యాల జిల్లా) మెటపల్లి లో అదే జరిగింది.  దుజా గ్రూప్ వారి ఎన్ ఎక్స్ టి డిజిటల్ వారు అక్కడి కేబుల్ వ్యాపారాన్ని సొంతం చేసుకోవటానికి కుట్రపన్నారు. నేరుగా వ్యాపారం చేయటం కష్టమని భావించి కేబుల్ వ్యాపారంతో సంబంధం లేని ఒక ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ ను పావుగా వాడుకుంది. ఆ కేబుల్ ఆపరేటర్ కు కోప్ ( కేబుల్ ఆపరేటర్ ఆవరణలోని పరికరాలు)  అంటగట్టి రెచ్చగొట్టింది. అతడి ద్వారా సెట్ టాప్ బాక్సులు ఉచితంగా పంపిణీ చేస్తూ, ప్రస్తుతమున్న ఆపరేటర్ వ్యాపారాన్ని దెబ్బతీయటానికి ఎన్ ఎక్స్ టి డిజిటల్ కుట్రపన్నింది. కేబుల్ వ్యాపారంతో ఏ మాత్రమూ సంబంధం లేని వ్యక్తి ద్వారా ఇప్పటికే ఉన్న వ్యవస్థను ధ్వంసం చేయాలనుకోవటం అలాంటి కార్పొరేట్ ఎమ్మెస్వోకు మాత్రమే చెల్లింది.

చాలాకాలంగా ఈ వ్యాపారంలో ఉన్నవారికి ఇందులో మంచీచెడ్డా తెలుసు. తాత్కాలికంగా ఇచ్చే రాయితీల వలన చందాదారులకు మేలు జరగదని కూడా తెలుసు. కానీ అర్థం లేని ఆఫర్లతో వ్యాపారాన్ని దెబ్బతీసి ఆ తరువాత చందాదారులమీద భారం మోపాలనే కుట్రతో వచ్చే ఎన్ ఎక్స్ టి డిజిటల్ లాంటి వ్యాపారులకు చందాదారులకు మేలు చేయటం తెలియదు. కాలంగడిచే కొద్దీ మాత్రమే వీళ్ళ అసలు రంగు బయట పడుతుంది. సేవల లోపం తెలిసిన తరువాత చందాదారులు బాధపడినా ప్రయోజనం ఉండదు. బాక్స్ ఉచితంగా ఇచ్చినంత మాత్రాన మెరుగైన సేవలు అందించినట్టు కాదన్న సంగతి జనం గ్రహించాలి.

కేబుల్ టీవీ పరిశ్రమ అప్పుడప్పుడే బలం పుంజుకుంటున్న రోజుల్లో కొంతమంది ఇలాంటి డమ్మీ వేషాలు వేసేవారు. ఆ  తరువాత పరిశ్రమ స్థిమిత పడింది. పే చానల్స్ హడావిడిని,  డిజిటైజేషన్ లాంటి తుపానులను తట్టుకొని నిలబడింది. కానీ ఇప్పుడు వస్తున్న కార్పొరేట్ ఎమ్మెస్వోలు అటు ఆపరేటర్లను, ఇటు స్వతంత్ర ఎమ్మెస్వోలను దెబ్బతీయటానికి అడ్డదారులు తొక్కుతున్నారు. అందులో భాగంగానే ఎన్ ఎక్స్ టి డిజిటల్ ఇలాంటి దురాగతానికి పాల్పడింది.

చొప్పదండి లో ఒక డమ్మీ ఆపరేటర్ ను ప్రోత్సహించటం సహజంగానే ఆపరేటర్లకు కోపం తెప్పించింది. ఏళ్ల తరబడి ఈ వ్యాపారంలో ఉంటూ నిర్మించుకున్న వ్యవస్థను ఒక్క వేటుతో కూల్చి ఉపాధిని దెబ్బతీయాలనుకునే శక్తులకు గట్టిగానే బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. అందుకే అలాంటి డమ్మీ ఆపరేటర్ విధానాన్ని మొగ్గలోనే తుంచి ఒక హెచ్చరిక పంపారు.

ఒక మామూలు ఆపరేటర్ గా అవతారమెత్తాలనుకున్న విద్యుత్ కాంట్రాక్టర్  తనకు యాభై లక్షల దాకా నష్టం వచ్చిందని చెప్పటంలోనే ఇదంతా ఒక పథకం ప్రకారం అతణ్ని రెచ్చగొట్టి ఈ వ్యాపారంలోకి దించారని అర్థమవుతోంది. ఎన్ని సెట్ టాప్ బాక్సులు ఇచ్చి ఇప్పుడున్న కేబుల్ వ్యాపారాన్ని దెబ్బాతీయాలని నిర్ణయించారో తెలుస్తూనే ఉంది. కేవలం డబ్బుంటే చాలు, కేబుల్ వ్యాపారుల పొట్టగొట్టి ఆ వ్యాపారాన్ని సొంతం చేసుకోవచ్చునని ఆలోచించేవారికి స్థానిక్ ఆపరేటర్లు కలసికట్టుగా బుద్ధి చెప్పారు.

ఎక్కడ ఇలా డమ్మీలు ముందుకొచ్చి కేబుల్ వ్యాపారంలో జోక్యం చేసుకొని ఇప్పటికే ఉన్న వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నం చేసినా అడ్డుకుంటామని కేబుల్ ఆపరేటర్లు ఈ చర్య ద్వారా మార్కెట్ కు ఒక హెచ్చరిక పంపినట్టయింది. కార్పొరేట్ ఎమ్మెస్వోలు ఎక్కడో ముంబయ్ లోనో, హైదరాబాద్ లోనో ఉండి గ్రామీణ ప్రాంతాల్లో  కొంతమంది ఏజెంట్లకు లాభాలు ఆశచూపి డమ్మీ వ్యాపారం చేయటం ఇకనైనా మానుకోకపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు స్పష్టంగా తేలిపోయింది. ఈరోజు చొప్పదండిలో జరిగిందే ఇక రాష్ట్రమంతటా జరిగే అవకాశం ఉంది.

ఆపరేటర్లు తమ వ్యాపారాన్ని కాపాడుకోవాలంటే కార్పొరేట్ ఎమ్మెస్వోల డమ్మీలను అడ్డుకోవాలి. ఇప్పటిదాకా కేబుల్ వ్యాపారంలో లేని ఇలాంటి డమ్మీలు కేబుల్ వ్యాపారంలో ఉన్నవారి పొట్టకొట్టటానికి కార్పొరేట్ ఎమ్మెస్వోల అండతో ఉళ్ళలోకి వస్తే సహించే ప్రసక్తే లేదన్న సంకేతం ఇస్తే తప్ప ఇలాంటి డమ్మీలను అడ్డుకోవటం కష్టం. క్షేత్ర స్థాయిలో ఆపరేటర్ల ఉపాధిని దెబ్బతీసే ప్రయత్నాలకు దిగితే భంగపాటు తప్పదని కార్పొరేట్ ఎమ్మెస్వోలు ఇప్పుడైనా గుర్తించి కళ్ళు తెరవాలి. ఇలాంటి దుస్సాహసాలకు పూనుకోవటం వలన తీవ్ర మైన వ్యతిరేకత రావటంతోబాటు తాము రెచ్చగొట్టిన డమ్మీకూడా నష్టపోతాడని తెలుసుకోవాలి.

ఈ చొప్పదండి ఘటన ఆపరేటర్ల ఐకమత్యానికి నిదర్శనంగా మారింది. ఇలాంటి ప్రయత్నం చేసే ఏ కార్పొరేట్ ఎమ్మెస్వో డమ్మీ అయినా దొడ్డిదారిలో ప్రవేశిస్తే తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని గ్రహించాల్సిన సమయం దగ్గరపడింది. ఆపరేటర్లు అందరూ కలసికట్టుగా ఉన్నారన్న  సంగతి కార్పొరేట్ ఎమ్మెస్వోలు గ్రహించాలి. ఇలాంటి చౌకబారు ప్రయత్నాలు మానుకోవాలి. ఇప్పుడు ఎన్ ఎక్స్ టి డిజిటల్ కావచ్చు, రేపు మరో కార్పొరేట్ ఎమ్మెస్వో కావచ్చు. స్థానిక ఆపరేటర్ల వ్యాపారాన్ని దెబ్బతీస్తే ఫలితం ఇలాగే ఉంటుందని చొప్పదండి ఘటన రుజువు చేసింది.

అటు ఆంధ్రప్రదేశ్ లోను, ఇటు తెలంగాణలోను ఇలాంటి ధోరణులను అడ్డుకోవటానికి ఆపరేటర్లు, స్వతంత్ర ఎమ్మెస్వోలు నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైంది. ఒక కార్యాచరణ రూపొందింది ఉమ్మడి ప్రయోజనాలకోసం పోరాట వేదికను సన్నద్ధం చేసే క్రమంలో అడుగులు పడుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here