కేబుల్ ఎక్స్ పో సారధికి ఎగ్జిబిషన్ వేదిక మీద బ్రైట్ వే సత్కారం

0
698

టెలివిజన్ పరిశ్రమలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తూనే ఉన్నాయి. సరికొత్త పరిజ్ఞానం అందుబాటులోకి వస్తూనే ఉంది. అయితే, అలాంటి మార్పులను ప్రతిబింబించే కొత్త పరిజ్ఞానం అందరికీ అందించాలన్న ఆలోచన, అందుకు తగినట్టు అమలు చేయటం దాకా పూర్తి బాధ్యత సి ఎస్ సి ( కేబుల్ నెట్ వర్క్ కాన్సెప్ట్స్) అధిపతి రాముదే. కేబుల్ నెట్ వర్క్ ద్వారా వినియోగదారులకు ఇంటింటికీ సేవలందించాలన్న ఆలోచనకు పదును పెడుతూ ఈలోగా కేబుల్ ఆపరేటర్ల సాంకేతిక అవసరాలకోసం ఈ ఎగ్జిబిషన్ల నిర్వహణ ప్రారంభించి ఇప్పుడు తొమ్మిదోవిడత నడుపుతున్నారు. .
నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం తలమంచి ఆయన పుట్టిపెరిగిన ఊరు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో ఆయన జీవితపు సాగుబడికి చదువూ, పనీ రెండు కాడెద్దులయ్యాయి. పూల అమ్మకంతో సహా ఆయన చేయని పనిలేదు. హాస్టల్ సౌకర్యం ఉన్న మండలకేంద్రానికి వెళ్ళి కూడా చదువు కొనసాగించారు. మెరుగైన చదువుతోబాటు ఉద్యోగావకాశాలు వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చి సిటీ కాలేజ్ లో చేరారు. సరిగ్గా 30 ఏళ్ల కిందట కొరియర్ సర్వీస్ లో రూ. 500 జీతంతో హైదరాబాద్ లో ఆయన ఉద్యోగపర్వం మొదలైంది. .
ఈ క్రమంలో కళా, సాంస్కృతిక సంస్థ రసమయితో అనుబంధం ఏర్పడి సంస్థ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనటంతోబాటు కార్యవర్గంలోనూ చోటు సంపాదించుకున్నారు. అప్పుడప్పుడే వీసీఆర్ సాయంతో సినిమాలు ప్రసారం చేసే కేబుల్ టీవీ దశ మొదలైంది. ఆ విధంగా హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ సమీపంలోని ఇందిరా నగర్ లో కేబుల్ టీవీ ప్రారంభించారు. కేబుల్ రంగం అప్పుడప్పుడే కాస్త పుంజుకుంటూ ఉండటంతో ఆ రంగానికి అవసరమైన మెటీరీయల్ తో నెల్లూరు లో ఒక షాపు ప్రారంభించారు. అదే సమయంలో టీవీలు చూడటం బాగా పుంజుకోవటం గమనించి చిత్తూర్, నెల్లూరు. ప్రకాశం జిల్లాలలో ఆర్టీసీ బస్టాండ్లలో టీవీలు పెట్టి ప్రసారాలు అందించే కాంట్రాక్ట్ సంపాదించుకున్నారు.
కొరియర్ సర్వీస్ ను మరింత విస్తృత పరచి వస్తువుల అమ్మకాలకు కూడా మాధ్యమంగా తయారుచేయాలన్న ఆలోచన ఆయనది. ఆ రోజుల్లోనే 500 మందితో కూడిన కొరియర్ నెట్ వర్క్ ఏర్పాటు చేసి అనేక నగరాలకు వ్యాపారాన్ని విస్తరించారు. నిజం చెప్పాలంటే అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటి వ్యాపారపు ఆలోచన అప్పట్లోనే ఆయన నదిలో మెదిలింది. ఊరారా ఉండే కేబుల్ ఆపరేటర్ల నెట్ వర్క్ తో ఇలాంటి వ్యవస్థను అత్యంత సమర్థంగా నడపవచ్చునన్నది ఆయనకున్న గట్టి నమ్మకం. అయితే, ఆపరేటర్లకు అప్పట్లో కేబుల్ వ్యాపారంలో ఉన్న లాభాల దృష్ట్యా దీన్ని పెద్దగా పట్టించుకోక పోవటం తనను కాస్త నిరాశ పరచిన మాట వాస్తవం. అయితే, ఇప్పటి ఇంటర్నెట్ అందుబాటు కారణంగా తన ఆలోచన ఇంకా బాగా పనిచేస్తుందన్నదే ఆయన నమ్మకం. దాన్ని విజయవంతం చేయటం లక్ష్యంగా కనిపిస్తుంది.
“ ఆపరేటర్లకు వాళ్ళ విలువ తెలియజేస్తా. ఇంటింటికీ ఉండే పరిచాయాలను వ్యాపారంగా మార్చుకోవటం వాళ్ళకు తెలియాలి. ఇక ఇల్లు ఖాళీ అయితే అద్దెకిచ్చే అవకాశం ఉందని ముందుగా తెలిసేది ఆపరేటర్ కే. రెంటల్ బ్రోకర్ పని ఆపరేటర్ చేయవచ్చు. తన సిబ్బందిని వాడుకుంటూ కొరియర్ సర్వీస్ చేయవచ్చు. ఇంటర్నెట్ ఇవ్వవచ్చు. సర్వీసింగ్, ఛార్జింగ్ సెంటర్లు, కిరాణా, ఈ-వెహికిల్స్, సిసి టీవీ, హోమ్ ఆటోమేషన్ …ఇలా ఎన్నిటిలోనో పాలుపంచుకోవచ్చు. ఇంటి యాజమానులతో ఇలాంటి సంబంధాలు కొనసాగించటం వలన వాళ్ళు కేబుల్ కనెక్షన్ వద్దనే అవకాశమే ఉండదు. పైగా, డీటీహెచ్ వైపు వెళ్ళిన వాళ్లను కూడా అతని వైపు ఆకర్షించవచ్చు” అంటారు రాము. ఇంతకాలంగా ఈ కాన్సెప్ట్ మీద పనిచేస్తూ వచ్చిన రాము త్వరలోనే దీన్ని ఆచరణలో పెట్టటానికి సిద్ధమవుతున్నారు .
అనేక రాష్ట్రాలలోనూ, జాతీయ స్థాయిలోనూ ఉన్న కేబుల్ ఆపరేటర్ల సంఘాలతో రాముకు పరిచయాలున్నాయి. అరవింద్ ప్రభు, రూప శర్మ లాంటి దిగ్గజాలతో ఆయనకు సత్సంబంధాలున్నాయి. జాతీయ స్థాయి సంఘంలో కోశాధికారిగా కూడా పనిచేశారు. అందుకే 2005 లో మొదటిసారిగా ఎక్స్పో ఏర్పాటుచేసి అప్పటి ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి చేత ప్రారంభింపజేశారు. అప్పటినుంచి 2008, 2014, 2015,2016, 2018, 2019 సంవత్సరాల్లో నిర్వహించి ఇప్పుడు 9 వ ప్రదర్శన ఈ 2021 లో చేపట్టారు.
బ్రైట్ వే సత్కారం
కేబుల్ రంగానికి టెక్నాలజీని పరిచయం చేసే వేదిక కేబుల్ నెట్ ఎక్స్ పో రూపొందించి వరుసగా తొమ్మిదో విడత విజయవంతంగా చేపట్టిన రామును సత్కరించాలని బ్రైట్ వే కమ్యూనికేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎం. సుభాష్ రెడ్డి నిర్ణయించారు. ఎక్స్ పో వేదికమీదనే మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతులమీదుగా కేబుల్ పరిశ్రమ తరఫున జరిగే అభినందనలో భాగమని ఆయన చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here