బార్క్ ను కోర్టుకీడ్చటానికి సిద్ధమైన ఇండియా టుడే

0
529

అక్టోబర్ 8న ముంబై పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి టి ఆర్ పి కుంభకోణాన్ని బయట పెట్టినప్పటి నుంచి రిపబ్లిక్ టీవీ, ఇండియా టుడే టీవీ, ముంబయ్ పోలీసుల మధ్య  ఆరోపణలు, ప్రత్యారోపణలు వరుసగా మరిన్ని పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా టుడే టీవీ ఒక ప్రకటనను తన వెబ్ సైట్ లో ప్రకటించింది. రహస్యంగా జరిపిన విచారణ వివరాలను రేటింగ్ సంస్థ లీక్ చేయటం పట్ల అందులో అభ్యంతరం తెలియజేసింది. ఆ విచారణ అనంతరం రూ. 5 లక్షల జరిమానా విధించగా దాన్ని ఇండియా టుడే టీవీ ఇప్పటికీ సవాలు చేస్తూనే ఉంది.

కొంతమంది ఉద్దేశ పూర్వకంగా ఇండియా టుడే టీవీ ప్రతిష్ఠను దెబ్బతీయటానికి ఇప్పుడు వెలుగు చూసిన రేటింగ్స్ కుంభకోణంలోకి తమ సంస్థను లాగే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించింది. ఈనెల 8న ముంబయ్ పోలీస్ కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ రిపబ్లిక్ టీవీ, ఫక్త్ మరాఠీ, బాక్స్ సినిమా ఒక పద్ధతి ప్రకారం రేటింగ్స్ వ్యవస్థను వాడుకున్నాయనటానికి తమ దగ్గర ఆధారాలున్నట్టు ప్రకటించటం తెలిసిందే. 45 ఏళ్ళుగా ఇండియా టుడే గ్రూప్ అత్యున్నత జర్నలిస్టు విలువలు పాటిస్తూ ఉందని, జర్నలిజంలో అత్యుత్తమ ప్రమాణాలు పాటించటమే సంస్థ ఇండియా టుడే ధ్యేయమని పేర్కొంది.

ఈ కుంభకోణం బైటపడుతుండగా ముంబై పోలీసుల ఎఫ్ ఐ ఆర్ లో బార్క్ కు చెందిన ఒక క్షేత్ర స్థాయి సంస్థ మాజీ ఉద్యోగి అయిన హన్సా రీసెర్చ్ ఫిర్యాదు చేసినట్టు నమోదైంది. అందులో  ఇండియా టుడే, మరికొన్ని చానల్స్ రేటింగ్స్ డేటా ను తారుమారు చేసినట్టు ఆరోపించారు.  అలాంటి ఎఫ్ ఐ ఆర్ ఒకటి ఉన్నట్టు తమ దృష్టికి రాలేదని ఇండియాటూడే ఆరోపించింది. అయితే ముంబై పోలీస్ కమిషనర్ వివరణ ఇస్తూ, ఇండియా టుడే పేరు ఎఫ్ ఐ ఆర్ లో ప్రస్తావించినప్పటికీ నిందితులు గాని సాక్షులుగాని అందుకు తగిన ఆధారాలు సమర్పించలేకపోయారని చెప్పటాన్ని ఇండియా టుడే గుర్తుచేసింది. పైగా, నిందుతులు రిపబ్లిక్ టీవీ, ఫక్త్ మరాఠీ, బాక్స్ సినిమా పేర్లనే ప్రస్తావించారని. దర్యాప్తు చురుగ్గా సాగుతోందని కూడా ఇండియా టుడే టీవీ స్పష్టం చేసింది.

ఈ కుంభకోణంలో ప్రధాన నిందితునిగా నమోదైన రిపబ్లిక్ టీవీ తన తప్పు కప్పిపుచ్చుకోవటానికి ఉద్దేశపూర్వకంగా మిగిలిన నెట్ వర్క్స్ మీదికి నేరాన్ని నెట్టే క్రమంలో ఇలాంటి ప్రయత్నాలకు పూనుకుంటోందని ఇండియా టుడే టీవీ ఆరోపించింది. మరో వ్యవహారంలో ఎలాంటి జ్యుడీషియల్ కమిటీ విచారణా జరపకుండానే ఇండియా టుడే మీద పెనాల్టీ విధించిన వ్యవహారంలో బార్క్ ను కోర్టుకీడుస్తామని ఆ సంస్థ స్పష్టం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here