హిట్స్ వేదికను ఎమ్మెస్వోలు వాడుకునేలా మార్గదర్శకాలలో మార్పు

0
630

టెలివిజన్ పంపిణీ రంగంలో కీలకమైన మలుపుగా భావించే విధంగా సమాచార ప్రసార మంత్రిత్వశాఖ (ఎంఐబి) తాజాగా హెడ్ ఎండ్ ఇన్ ద స్కై ( హిట్స్) మార్గదర్శకాలను సవరించింది. 2009 నవంబర్ 26 నాటి మార్గదర్శకాలను తాజాగా 2020 నవంబర్ 6న సవరిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం సాంకేతికంగా సాధ్యమైనచోట హిట్స్ ఆపరేటర్ స్వచ్ఛందంగా తన ప్లాట్ ఫామ్ మౌలికసదుపాయాలను టీవీ చానల్స్ పంపిణీ కోసం ఇతర ఎమ్మెస్వోలతో పంచుకోవచ్చు. ఆ విధంగా అడ్రెసిబిలిటీకి గాని, ఎన్ క్రిప్షన్ కు గాని భంగం కలగకుండా హిట్స్ సిగ్నల్స్ ను చందాదారులకు అందించటానికి ఎమ్మెస్వోలకు వీలుకలుగుతుంది.
అయితే, అలాంటి సౌకర్యాన్ని వాడుకోవాలనే ఎమ్మెస్వో చందాదారులకు చానల్స్ పంపిణీ చేయటానికి వీలుగా బ్రాడ్ కాస్టర్లతో సరైన ఇంటర్ కనెక్షన్ ఒప్పందం ఉండి తీరాలి. అదే సమయంలో ఇలా మౌలిక సదుపాయాలు వాడుకోవటానికి ముందుగా ఆ ఎమ్మెస్వో ఎంఐబి నుంచి సెక్యూరిటీ క్లియరెన్స్ తీసుకోవటంతోబాటు ఎన్ ఓ సి సి, డబ్ల్యు పి సి, అంతరిక్షశాఖ నుంచి శాటిలైట్ క్లియరెన్స్ కూడా తీసుకొని ఉండాలి.
ఈ అనుమతులన్నీ పొందటం ఎమ్మెస్వో బాధ్యత కాగా, అన్నీ సరిచూసుకున్న తరువాతనే అనుమతించటం హిట్స్ ఆపరేటర్ బాధ్యత. ఈ విధంగా ప్రభుత్వం ఇద్దరిమీద ఉమ్మడి బాధ్యత పెట్టింది. ప్రస్తుతం హిట్స్ ఆపరేటర్ గా లైసెన్స్ పొంది కార్యకలాపాలు నిర్వహిస్తున్నది హిందుజా వారి ఎన్ ఎక్స్ టి డిజిటల్ మాత్రమే కావటంతో ఈ తాజామార్గదర్శకాలు వారికి మాత్రమే వర్తిస్తాయి.

ఎదుగుదలకు మూలస్తంభం: ఎన్ ఎక్స్ టి డిజిటల్
సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ సవరించిన మార్గదర్శకాలు హిట్స్ ఎదుగుదలకు మూలస్తంభంగా నిలుస్తాయని సంస్థ సీఈవో విన్ స్లే ఫ్రెనాండెజ్ వ్యాఖ్యానించారు. కొత్త టారిఫ్ ఆర్డర్ వచ్చిన తరువాత ధరల విషయంలో పారదర్శకత రావటం వలన ఎమ్మెస్వోలు ఇప్పుడు ఎన్ ఎక్స్ టి డిజిటల్ వారి హిట్స్ వేదికతో తో భాగస్వామ్యానికి మొగ్గు చూపుతారని భావిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు స్వతంత్ర ఎమ్మెస్వోలు ఈ వేదికమీదికి రావటానికి సిద్ధమైనట్టు కూడా ఆయన చెప్పారు.
అంతకుముందు పారదర్శకత లేకపోవటం వలన కలసి పనిచేయటానికి వెనుకాడేవారని, ఇప్పుడు వ్యాపారంలో పోటీదారులు కూడా నిస్సంకోచంగా తమ వేదికను వాడుకుంటూ మౌలిక సదుపాయాల ఖర్చు పెద్ద ఎత్తున తగ్గించుకోవటానికి సిద్ధమవుతున్నారని ఫెర్నాండెజ్ చెప్పారు. అదే సమయంలో నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకోవటానికి కూడా ఇది సరైన అవకాశంగా ఆయన అభివర్ణించారు. ట్రాయ్ నియంత్రణలను తట్టుకోవటం భారంగా అనిపించిన చిన్న సంస్థలకు ఇది మేలు చేకూరుస్తుందన్నారు.
ప్రస్తుతం దాదాపు 7 కోట్లమంది కేబుల్ చందాదారులకు స్వతంత్ర, ప్రాంతీయ ఎమ్మెస్వోలు సేవలందిస్తున్నారు. మిగిలిన కేబుల్ కనెక్షన్లు హాత్ వే, డెన్, సిటి నెట్ వర్క్స్, ఎన్ ఎక్స్ టి డిజిటల్ లాంటి జాతీయ స్థాయి కార్పొరేట్ ఎమ్మెస్వోల పరిధిలో ఉన్నాయి. ఇప్పుడు స్వతంత్ర, ప్రాంతీయ ఎమ్మెస్వోలకు ఎంఐబి తాజా హిట్స్ మార్గదర్శకాలు ఎంతో ఉపయోగపడబోతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here