విద్యుత్ స్తంభాలమీద కేబుల్స్ తొలగిస్తాం: ఎపి విద్యుత్ పంపిణీ సంస్థ హెచ్చరిక

0
638

కేబుల్ టీవీ నెట్ వర్క్ లు నిర్వహించే కేబుల్ ఆపరేటర్లు సొంతగా స్తంభాలు ఏర్పాటు చేసుకొని వాటిమీద వైర్లు వేసుకోవాలే తప్ప ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థ ఎపిసిపిడిసిఎల్ వారి విద్యుత్ స్తంభాలు వాడుకోవద్దంటూ సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యుటివ్ ఇంజనీర్ (ఆపరేషన్) సంతకంతో ఒక తాఖీదు జారీ అయింది. ఒకవైపు పాతబాకీలు చెల్లించాలని చెబుతూ మరోవైపు డిసెంబర్ 9 లోగా తమ విద్యుత్ స్తంభాలన్నిటిమీద ఉన్న కేబుల్ వైర్లు తొలగించాల్సిందేనని అందులో గడువు కూడా విధించారు.
విద్యుత్ వైర్ల గురించి, అందులో ప్రవహించే విద్యుత్ వైర్లలో 33కెవి, 11కెవి, ఎల్ టి, వోల్టేజ్ కి ఉండే ఇండక్షన్ ప్రభావం లాంటి అంశాలమీద కేబుల్ సిబ్బందికి ఎంతమాత్రమూ అవగాహన ఉండదని, సాంకేతికంగా ఎలాంటి అర్హతలూ ఉండవని కూడా ఆ లేఖలో తమ అభిప్రాయం వెలిబుచ్చారు. విద్యుత్ వైర్లకు కనీసం 2.44 మీటర్ల దూరంలో కేబుల్ వైర్లు ఉండాలని చెబుతూ, వైర్ల చుట్టల కాలంగా విద్యుత్ సిబ్బంది పోల్స్ మీదకు ఎక్కలేకపోతున్నట్టు పేర్కొన్నారు. దీనివలన సకాలంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు ఆటంకం కలుగుతోందని, పైగా ఆదాయ నష్టంతోబాటు సంస్థ ప్రతిష్ఠ దెబ్బతింటోందని కూడా ఆ లేఖలో రాశారు.
ఈ కారణాలన్నిటి దృష్ట్యా, కేబుల్ నెట్ వర్క్ నిర్వాహకులందరూ విద్యుత్ పోల్స్ మీద కేబుల్స్ తొలగించి డిసెంబర్ 9 లోగా సొంత ఏర్పాట్లు చేసుకోవాలని ఎపిసిపిడిసిఎల్ స్పష్టం చేసింది. అదే సమయంలో పాత బకాయిలు చెల్లించాలని కూడా కోరింది. అలా సొంత ఏర్పాటు చేసుకోకపోతే. ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండానే విద్యుత్ స్తంభాలమీద కేబుల్స్ తొలగిస్తామని హెచ్చరించింది.
అయితే, రైట్ ఆఫ్ వే కింద ప్రభుత్వ ఆస్తుల మీద కేబుల్స్ వేసుకోవటానికి కేబుల్ టీవీ చట్టంలో వెసులుబాటు కల్పించారు. అందుకుగాను అద్దె రూపంలో వసూలు చేసుకోవటానికి అవకాశం కూడా కల్పించింది. ఈ విషయంలో అనేకమార్లు విద్యుత్ శాఖ వారు ఆపరేటర్లను అడ్డుకోవటానికి ప్రయత్నించినా కోర్టులో చుక్కెదురైంది. అయినప్పటికీ, ఇప్పుడు మళ్లీ నోటీసు ఇవ్వటంతో ఈ వ్యవహారం కలకలానికి దారితీస్తోంది.
ప్రభుత్వం స్వయంగా ఎపి ఫైబర్ ను కూడా ఇలా ఓవర్ హెడ్ కేబుల్స్ మీదనే నడుపుతోంది. అదేసమయంలో ఎపి ఫైబర్ తరఫున కేబుల్ కార్యకలాపాలు నడిపే ఆపరేటర్లు సైతం విద్యుత్ స్తంభాలమీదనే కేబుల్స్ నడుపుతారు. ఇలాంటి స్థితిలో విద్యుత్ సంస్థ తీసుకున్న నిర్ణయం ఎంతమేరకు ఆచరణ సాధ్యం, కోర్టు కేసులకు నిలుస్తుందా అనేది ప్రశ్నార్థకంగా తయారైంది.
ఈ నేపథ్యంలో కేబుల్ ఆపరేటర్ లకు న్యాయ సహకారం అందించడానికి ఎపి డిజిటల్ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం ముందుకొచ్చింది. సహాయం కావాల్సినవారు ఆ సంస్థ లీగల్ సెక్రెటరీ వి.శ్రీరామ్ (9849343369) ని సంప్రదించవచ్చని తెలియజేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here