రేటింగ్స్ మీద ప్రభుత్వం కన్ను: బార్క్ కొనసాగింపు ప్రశ్నార్థకం

0
461

టెలివిజన్ రేటింగ్స్ మీద కేంద్రప్రభుత్వం దృష్టి సారించింది. దేశంలో రేటింగ్స్ ఏజెన్సీలకు కొత్త మార్గదర్శకాలు రూపొందించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పుడున్న బార్క్ పనితీరులో లోపాలను గుర్తించటం మొదలుకొని గుత్తాధిపత్యం లేకుండా వేరు వేరు సంస్థలకు రేటింగ్స్ లెక్కించే పనిని అప్పగించే విషయం కూడా కమిటీ పరిశీలిస్తుందని ఈ ఉత్తర్వులలో పేర్కొన్నారు, దీన్నిబట్టి ప్రస్తుతమున్న బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) కొనసాగుతుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

ఒకప్పుడు టామ్ మీద విమర్శలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని రేటింగ్స్ సంస్థలకు కొన్ని మార్గదర్శకాలు రూపొందించింది. వాటికి తగినట్టుగా నడుచుకోవటానికి టామ్ కు అర్హతలు లేకపోవటం, పరిశ్రమలోనే అడ్వర్టయిజర్లు, బ్రాడ్ కాస్టర్లు, అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలు కలిసి స్వయంగా ఏర్పాటు చేసుకున్న బార్క్ రంగంలో దిగటం తెలిసిందే. అయితే, ఇప్పుడు బార్క్ మీద కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యవస్థను మరింత పటిష్ఠంగా, పారదర్శకంగా తీర్చిదిద్దాల్సిన అవసరముందని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ క్రమంలోనే నవంబర్ 4 (బుధవారం నాడు) సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ టెలివిజన్ రేటింగ్ ఏజెన్సీలకు మార్గదర్శకాలు రూపొందించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రసార భారతి సీఈవో శాస్త్రి ఎస్. వెంపటి చైర్మన్ గా ఉండే ఈ కమిటీలో మరో ముగ్గురు సభ్యులుంటారు. ఐఐటి కాన్పూర్ లో స్టాటిస్టిక్స్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న  డాక్టర్ శలభ్,  సి-డాట్ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ డాక్టర్ రాజ్ కుమార్ ఉపాధ్యాయ్, డెసిషన్ సైన్సెస్ సెంటర్ ఫర్ పబ్లిక్ పాలసీ కి చెందిన ప్రొఫెసర్ పులక్ ఘోష్ సభ్యులుగా నియమితులయ్యారు.

రేటింగ్స్ విధానం మీద గతంలో చేసిన సిఫార్సులను, ఇటీవల ట్రాయ్ చేసిన సిఫార్సులను అధ్యయనం చేసి, ఈ రంగంలో పోతీ పెంచటానికి తీసుకోవాల్సిన చర్యలను  ఈ కమిటీ సూచిస్తుంది. తాజా మార్గదర్శకాల వలన అనుకున్న లక్ష్యం సాధించగలమా, లేదా అన్నది చూసి అత్యంత పారదర్శకమైన, సాంకేతికంగా అత్యాధునికమైన, బాధ్యతాయుతమైన  రేటింగ్ వ్యవస్థ నిర్మాణానికి తగిన సూచనలిస్తుంది.

అవసరమైతే ఈ రంగంలో ఇంకెవరైనా నిపుణులు ఉంటే ప్రత్యేక ఆహ్వానితులుగా గుర్తించి, వారిని ఆహ్వానించి సమాచారం తెలుసుకోవచ్చునని కూడా మంత్రిత్వశాఖ తన ఆదేశాలలో కమిటీకి సూచించింది. ఈ కమిటీ రెండు నెలలలోగా ( జనవరి 4 లోగా) తన నివేదికను సమాచార, ప్రసార శాఖామంత్రికి సమర్పించాల్సి ఉంటుంది.

బార్క్ రేటింగ్స్ లో లోపాలను కమిటీ గుర్తిస్తుందా, గుర్తిస్తే సవరణలు సూచిస్తుందా, ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో రేటింగ్స్ ఉండకూడదని, ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని చెబుతుందా అనేది వేచి చూడాలి. బార్క్ కు సూచనలు మాత్రమే ఇచ్చే పక్షంలో మరిన్ని జాగ్రత్తలకు బార్క్ హామీ ఇవ్వాల్సి వస్తుంది. లేదా, పోటీ ఉండటం మంచిదనిపిస్తే మళ్ళీ టామ్ రంగప్రవేశం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here