స్వీయ నియంత్రణ: ఒటిటి ల కొత్తమంత్రం

0
531

దేశంలో ఇంటర్నెట్ డేటా తక్కువ ధరకే అందుబాటులోకి రావటం, టీవీ చానల్స్ లో కార్యక్రమాలు వాళ్ళు ఇచ్చిన క్రమంలోనే చూదాలి తప్ప కోరుకున్నపుడు కోరుకున్న కార్యక్రమం చూసే అవకాశం లేకపోవటం ఒటిటి వేదికలపట్ల అనూహ్యమైన ఆసక్తి పెంచాయి. ఇది సంప్రదాయ బ్రాడ్ కాస్టింగ్ సంస్థలకు గట్టి పోటీ అని విమర్శిస్తూ వచ్చినా, చివరికి తప్పనిసరి అని తెలియటంతో దీన్ని వ్యాపారంగా మలచుకోవటానికి అనేక సంస్థలు ముందుకొచ్చాయి.

అన్ని ప్రధాన బ్రాడ్ కాస్టింగ్ సంస్థలూ ఈ విభాగాలను ప్రారంభించగా, ప్రాంతీయంగా కూడా కొత్త ఒటిటి సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే తెలుగులో ఆహా పుంజుకుంటూ ఉండగా టీవీ పంపిణీ రంగంలో ఉన్న రెండు ఎమ్మెస్వో సంస్థలు కూడా త్వరలో ఒటిటి లోకి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. మరోవైపు అన్ని ఒటిటి సంస్థలనూ కలిపి పాకేజ్ ల రూపంలో పంపిణీ చేసేందుకు హైదరాబాద్ నుంచే మరో సంస్థ  సిద్ధమవుతోంది.

అయితే, ఒటిటి వేదికల ద్వారా అందుతున్న కార్యక్రమాలు హద్దుమీరుతున్నాయనే విమర్శలు కొంతకాలంగా బాగా పెరిగాయి. ఇప్పటివరకు అది ఐటి చట్టం కింద మాత్రమే పరిగణనలో ఉండగా నియంత్రించటానికి మరింత పదునైన చట్టం అవసరమన్న అభిప్రాయం ఉంది. ఈలోపు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఒటిటి ని తన పరిధిలోకి తెచ్చుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. అదే జరిగి కఠిన నిబంధనలు విధించే దాకా ఆగటం కంటే స్వీయ నియంత్రణ పెట్టుకోవటం మేలు అని దాదాపు అన్ని ఒటిటి సంస్థలూ ఒక నిర్ణయానికొచ్చాయి.

ఈ క్రమంలోనే ఇంటర్నెట్ అండ్ మొబైల్ కమ్యూనికేషన్ ఆఫ్ ఇండియా ( ఐఎఎంఎఐ ) సంస్థ స్వీయ నియంత్రణ నియమావళి రూపొందించింది. దీన్ని ప్రధానమైన ఒటిటి సంస్థలు జీ5, వయాకామ్ 18, డిస్నీ హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, ఎం ఎక్స్ ప్లేయర్, జియో సినిమా, ఎరోస్ నౌ, ఆల్ట్ బాలాజీ, అర్రె, హొయ్ చోయ్, హంగామా, షెమారూ, డిస్కవరీ ప్లస్, ఫ్లిక్స్ ట్రీ అనుసరించటానికి ఆమోదించాయి.

దీనివలన వాడకందారుడు ఏ కార్యక్రమాలు తాను స్వయంగా చూడాలనుకుంటాడో, కుటుంబ సభ్యులకు, పిల్లలకు ఏవి అందుబాటులో ఉంచవచ్చునో నిర్ణయం తీసుకునే అవకాశం కలుగుతుంది. సృజనాత్మక కార్యక్రమాలు రూపొందించేవారిని న్పరోక్షంగా ప్రోత్సహించటానికి కూడా వీలవుతుంది. అప్పుడు భారత్ లో ఒక చురుకైన స్వీయ నియంత్రణ వ్యవస్థ ఏర్పాటుకు ఒటిటి నియమావళి అవకాశం కల్పించినట్టవుతుంది.

ఈ కొత్త నియమావళి ప్రకారం కార్యక్రమాలలోని అంశాల ఆధారంగా వర్గీకరణ, వివిధ వయోవర్గాలను విభజించటం సాధ్యమవుతుంది. అందువలన వయసును బట్టి మాత్రమే కొన్ని కార్యక్రమాలు అందుబాటులో ఉంటాయి. అదే సమయంలో ఫిర్యాదుల పరిష్కారానికి ఒక పారదర్శకమైన వ్యవస్థ కూడా ఏర్పాటవుతుంది. పరిష్కారం కన్నప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళటానికి కూడా అవకాశం కల్పించారు. మార్గదర్శకాలను పాటించని వాళ్ళమీద చర్యలకు కూడా వీలుంది.  ఇందులో భాగంగా ప్రతి ఒటిటి వేదిక అంతర్గతంగా ఒక ఫిర్యాదుల పరిష్కార విభాగాన్ని ఏర్పాటు చేస్తుంది. వినియోగదారులనుంచి నేరుగా వచ్చిన ఫిర్యాదులతోబాటు సలహా మండలి నుంచి వచ్చే అంశాలను కూడా పరిశీలిస్తుంది. సలహామండలి లో కనీసం ముగ్గురు సభ్యులుంటారు. ఒకరు వెలుపలి వ్యక్తి అయిన స్వతంత్ర సలహాదారు,  ఇద్దరు ఆ సంస్థకు చెమ్దిన సీనియర్ అధికారులు ఉంటారు.

ఐఎఎంఎఐ డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కమిటీ అధ్యక్షుడు తరున్ కటియాల్ ఈ విషయమై వ్యాఖ్యానిస్తూ, వొనియోగదారుణ్ని బలోపేతం చేయటానికి, కార్యక్రమాల సృజనాత్మకత పెంచటానికి ఈ స్వీయ నియంత్రణ నియమావళి రూపకల్పన జరిగిందన్నారు. వీటి వల్లనే దీర్ఘకాల విజయం సాధ్యమవుతుందని ఒటిటి పరిశ్రమ నమ్ముతున్నదన్నారు. వినియోగదారులు సరైన నిర్ణయం తీసుకోవటానికి, తమ కుటుంబ సభ్యులకు ఏది అవసరమో నిర్ణయించుకోవటానికి వీలుకలుగుతుందన్నారు.  ఈ క్రమంలో భారతీయులకు ప్రపంచవ్యాప్త కార్యక్రమాలు అందటంతోబాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు భారత కార్యక్రమాలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇప్పటికే ప్రధాన సంస్థలు ఇందులో చేరగా ఇకమీదట మిగిలిన సంస్థలు కూడా చేరతాయని కటియాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here