రేటింగ్స్ కుంభకోణంపై ఇడి దర్యాప్తు

0
654

రేటింగ్స్ కోసం అడ్డదారులు తొక్కుతున్నారంటూ చానల్ యాజమాన్యాలమీద వచ్చిన ఆరోపణల దుమారం ఇప్పట్లో తగ్గేట్టు కనబడటం లేదు. మొత్తం బ్రాడ్ కాస్టింగ్ పరిశ్రమనే కుదిపెసిన ఈ ఆరోపణలు ముంబయ్ పోలీసులకే పరిమితం కాలేదు. ఉత్తరప్రదేశ్ పోలీస్ కేసు చివరికి సిబిఐ దర్యాప్తుకు దారితీయగా, ఇందులో డబ్బు చెల్ల్లింపులు ఉండటంతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా రంగ ప్రవేశం చేసింది. మనీ లాండరింగ్ కోణంలో ఈ దర్యాప్తు జరుగుతుందని తెలుస్తోంది.
ముంబయ్ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ ఐ ఆర్ లో పేర్కొన్న నిందితులందరినీ ఇప్పుడు ఇడి కూడా విచారణకు పిలిచే అవకాశాలు కనబడుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లో ఒక అడ్వర్టయిజింగ్ కంపెనీ యజమాని చేసిన ఫిర్యాదు ఆధారంగా లక్నో పోలీసులు ఈ కేసును సిబిఐ కి అప్పగించగా రేటింగ్స్ కోసం డబ్బు చేతులు మారిందన్న అంశం ఆధారంగా ఇప్పుడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తన దర్యాప్తు మొదలుపెట్టబోతోంది.
ముంబయ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్న కేసులో రీసెర్చ్ సంస్థలు, రేటింగ్ సంస్థలు, న్యూస్ చానల్స్, మార్కెటింగ్ సంస్థలు ఇరుక్కున్నాయి. వీళ్లమీద అనేక ఎఫ్ ఐ ఆర్ లు నమోదు కావటంతో వీళ్ళందరినీ పిలిపించి వాళ్ళ స్టేట్ మెంట్స్ రికార్డ్ చేశారు. ఆ కర్మంలో మరింత మంది అనుమానితులను కూడా విచారించవలసి వచ్చింది. అయితే, పోలీసులు అనవసరంగా వేధిస్తున్నారని రిపబ్లిక్ టీవీ ఆరోపిస్తూ వచ్చింది. ఒక దశలో బొంబాయ్ హైకోర్టు జోక్యం చేసుకొని హన్సా రీసెర్చ్ ఏజెన్సీ ఉద్యోగులను వేధించవద్దని చెప్పటం గమనార్హం.
ఈ దర్యాప్తు ప్రభావం ఎంత తీవ్రంగా ఉందంటే బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ( బార్క్) మూడు నెలలపాటు న్యూస్ చానల్స్ కు రేటింగ్స్ ఇవ్వటం నిలిపివేస్తానని ప్రకటించాల్సి వచ్చింది. దీంతో దేశంలోని న్యూస్ చానల్స్ రెండుగా విడిపోయి, రెండు వేరు వేరు సంఘాలుగా మారాయి. ఈ రేటింగ్స్ కుంభకోణం స్థాయి చాలా పెద్దదన్న సంకేతాలిస్తూ స్వయంగా ముంబయ్ పోలీస్ కమిషనర్ పరం బీర్ సింగ్ అక్టోబర్ 8న మీడియా ముందుకొచ్చారు.
కమిషనర్ మీడియా సమావేశంలో రిపబ్లిక్ టీవీ సహా మూడు చానల్స్ పేర్లు ప్రస్తావించటం, అప్పటినుంచి ఈ కేసులో నిందితుడైన రిపబ్లిక్ మీడియా అధిపతి ఆర్ణబ్ గోస్వామి నానా హడావిడి చేయటం తెలిసిందే. తమకు ఎలాంటి సంబంధమూ లేదని పదే పదే వాదిస్తూ వచ్చారు. మహారాష్ట్ర ప్రభుత్వం తనమీద కక్ష సాధిస్తున్నదని, అందులో భాగంగానే రిపబ్లిక్ ఉద్యోగులను విచారణ పేరుతో ఇబ్బందిపెడుతున్నదని వాదిస్తూ వచ్చారు. ఇప్పుడు ఇడి రంగప్రవేశంతో కేసు ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here