కేబుల్ రంగ యోధుడు కుల్దీప్ సహానీ కన్నుమూత: సుభాష్ రెడ్డి నివాళి

0
1919

తెలంగాణ రాష్ట ఎమ్మెస్వోల సంఘం మాజీ అధ్యక్షుడు కుల్దీప్ సహానీ కన్నుమూశారు. చాలాకాలంగా ఆయన మధుమేహంతో బాధపడుతూ ఉండగా నిన్న ఆరోగ్యం క్షీణించటంతో హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేసినా ఫలితం లేకపోవటంతో ఈరోజు ఆయన తుదిశ్వాస విడిచారు.
దాదాపు 20 ఏళ్ళ క్రితం ఆయన ఇ ఎం ఎస్ న్యూస్ ఏజెన్సీ ఫ్రాంచైజ్ తీసుకొని మీడియా రంగంలో అడుగుపెట్టారు. 2002 లో సి చానల్ నిర్వహిస్తూ కేబుల్ రంగంలో ప్రవేశించారు. అప్పట్లో నిజామాబాద్ లో ఇన్ కేబుల్, సిటీ కేబుల్ కూడా ఉండగా మూడో సంస్థగా సి చానల్ రంగప్రవేశం చేసింది. సహానీ వ్యాపార చతురత, దూసుకుపోయే స్వభావం ఆయనను తక్కువకాలంలోనే కేబుల్ రంగంలో ఎదిగేలా చేసింది.


అయితే, ఆయన హాత్ వే రాజశేఖర్ తో విభేదించిన కారణంగానే రహేజా గ్రూప్ వారి సి చానల్ కు స్వస్తి చెప్పి ఇన్ కేబుల్ వైపు వచ్చారు. అప్పటికీ సిటీ కేబుల్ మాత్రమే పోటీలో ఉండగా దానిని కూడా విలీనం చేసుకొని 2005 నాటికల్లా ఆయన గుత్తాధిపత్యం సాధించారు. దాదాపు జిల్లా అంతా ఆయన పరిధిలోకి వచ్చిన రోజులున్నాయి. అప్పట్లో రిపోర్టర్ల నియామకాలు సహా అనేక విషయాల్లో చానల్ యాజమాన్యాలు ఆయన మాట ప్రకారం నడుచుకునేవి. జిల్లాలో చానల్ ప్రసారాలు అందాలంటే ఆయన సహకారం తప్పనిసరి అనే అభిప్రాయం ఉండేది.
ఆ తరువాత కాలంలో అప్పటి కాంగ్రెస్ నాయకుడు డి.శ్రీనివాస్ సొంత జిల్లా కావటంతో తనకు అనుకూలంగా వ్యవహరించటం లేదనే కారణంతో నిజామాబాద్ లో సహానీ ఆధిపత్యానికి గండికొట్టాలనే ఆలోచన వచ్చింది. అంతకుముందు హాత్ వే నుంచి వెళ్ళిపోయినందున అదే హాత్ వే సీఈవోగా ఉన్న రాజశేఖర్ ఈ అవకాశాన్ని వాడుకున్నారు. తన సొంత నెట్ వర్క్ అయిన వెంకటసాయి మీడియా పేరుతో నిజామాబాద్ లో పాగావేశారు. డి శ్రీనివాస్ అండదండలుండటంతో క్రమంగా నెట్ వర్క్ ను విస్తరిస్తూ వచ్చారు. ఇక తప్పనిసరిపరిస్థితుల్లో మీడియాను వదిలేయాలని సహానీ నిర్ణయించుకున్నారు.


తన నెట్ వర్క్ ను అమ్మి ఇతర వ్యాపారాల వైపు దృష్టి పెట్టారు. అండమాన్ లో ఒక హోటల్ నిర్మించటంతోబాటు బాసర సరస్వతీ క్షేత్రంలో గోదావరి ఒడ్డున రిసార్ట్స్ నిర్మించారు. క్రీదలను ప్రోత్సహిస్తూ అనేక పోటీలను స్పాన్సర్ చేయటం మొదలుకొని గణేశ్ ఉత్సవాల నిర్వహనకు సహాయం చేయటం దాకా ఎన్నో దానధర్మాలు చేసి సహృదయునిగా అందరి మన్ననలూ పొందారు. దేశభక్తిని చాటుకునే అనేక కార్యక్రమాలు కూడా చేపట్టేవారు.

దాదాపు దశాబ్దానికి పైగా నిజామాబాద్ కేబుల్ రంగంలో ఆయన గుత్తాధిపత్యం సాగింది. అదే విధంగా రాష్ట్ర ఎమ్మెస్వోల సంఘం వ్యవస్థాపకునిగా కూడా ఆయన సేవలందించారు. నిజామాబాద్ కేంద్రంగా ఆయన కేబుల్ రంగంలో అత్యంత కీలకపాత్ర పోషిస్తూ తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమానికి అండగా నిలబడ్డారు. కేబుల్ పరిశ్రమలో స్థానికుల పాత్రను సమర్థిస్తూ ఆంధ్రప్రాంత ఎమ్మెస్వోల దాష్టికాన్ని ఎండగట్టారు. అంతకుముందు సన్ గ్రూప్ వారి పే చానల్ నిర్ణయాన్ని, తమిళకార్యక్రమాలను తెలుగు ప్రజలమీద రుద్దటాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమించారు.


స్వయంగా జర్నలిస్టు కూడా అయిన కుల్దీప్ సహానీ తన విద్యార్హతలతో సంబంధం లేకుందా విస్తృతంగా చదివేవారు. ఇందూర్ మిర్రర్ పేరుతో ఆయన ఒక వార పత్రిక కూడా నిర్వహించారు. దాన్ని దినపత్రికగా మార్చాలని కూడా అప్పట్లో ఆలోచించేవారు. సహానీ తల్లిదండ్రులు పాకిస్తాన్ లోని సింధ్ ప్రాంతానికి చెందినవారు కాగా నిజామాబాద్ వచ్చి స్థిరపడ్డారు.

కొద్ది కాలం క్రితం భార్య మరణంతో ఆయన బాగా కృంగిపోయారు. తన ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా ఉండటంతో ఆయనలో అంతకుముందున్న చురుకుదనం తగ్గింది. ఆయనకు కొడుకు, కూతురు ఉన్నారు. నిన్న ఆరోగ్యం క్షేణించటంతో ఆయాన కోలుకోవాలని ప్రార్థించమంటూ ఆయన కుమార్తె ఫేస్ బుక్ ద్వారా చేసిన విజ్ఞప్తితో ఒక్కసారిగా ఆయన అనారోగ్య వార్త తెలిసింది. ఈ ప్రార్థనలు గాని, చికిత్సగాని ఫలించకపోవటంతో ఈ రోజు ఆయన కన్నుమూశారు.
తెలంగాణ ఎమ్మెస్వోల సంఘం అధ్యక్షుడు, బ్రైట్ వే కమ్యూనికేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సుభాష్ రెడ్డి ఈ మరణవార్త పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేబుల్ టీవీ రంగానికి కుల్దీప్ సహానీ చేసిన సేవలను నెమరు వేసుకుంటూ అయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here