కొత్త టారిఫ్ ఆర్డర్ కేసు ఫిబ్రవరి15కు వాయిదా

0
678

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్) జారీచేసిన టారిఫ్ ఆర్డర్ అమలు మీద సుప్రీంకోర్టులో నడుస్తున్న కేసు ఫిబ్రవరి 15 కు వాయిదా పడింది. పే చానల్ ధరల నియంత్రణ దిశలో ట్రాయ్ ఇచ్చిన రెండో టారిఫ్ ఉత్తర్వుల (ఎన్టీవో 2.0 ) మీద బ్రాడ్ కాస్టర్లు బొంబాయ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా అక్కడ ట్రాయ్ కి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీన్ని బ్రాడ్ కాస్టర్లు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. దీనిమీద బ్రాడ్ కాస్టర్లకు ఎలాంటి తాత్కాలిక ఊరట ఇచ్చేందుకూ సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. అంతిమంగా తీర్పు వెలువరించేందుకు అక్టోబర్ 1 నాడు ఈ కేసును ఈ రోజుకు (నవంబర్ 30 కి) వాయిదా వేయగా ఈరోజు జస్టిస్ యు.యు. లలిత్, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, బేలా త్రివేది తో కూడిన ధర్మాసనం ఫిబ్రవరి 15 కు వాయిదా వేసింది. ఈలోపు ట్రాయ్ ఎన్టీవో 2.0 అమలు మీద సమాధానం ఇవ్వాలంటూ బ్రాడ్ కాస్టర్లకు లేఖలు రాసింది.

స్టార్, జీ, సోనీ, వ్యయాకాయం 18 లాంటి పెద్ద బ్రాడ్ కాస్టర్లు దీనికి స్పందిస్తూ కొత్త టారిఫ్ ప్రకటించారు. వారి వారి ప్రధాన చానల్స్ ను బొకే నుంచి బైటికి తీసి, వాటికి రూ.20 కి పైగా ధర పెట్టారు. బొకేలో ఉంటే గరీష్ఠ చిల్లర ధర రూ.12 కాగా బొకే నుంచి అ లా కార్టే ధరను అంతకు ముందుకంటే దాదాపు 25-30% మేరకు పెంచారు. అదే విధంగా స్పోర్ట్స్ ఛాన్సల్స్ కూడా అదే తరహాలో పెరిగాయి.

బ్రాడ్ కాస్టర్లు వేసిన ఈ ఎత్తుగడవల్ల చందాదారులు తక్కువ చానల్స్ కు ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. టీవీ వ్యాపారంలోని అందరి మీదా ఏదో విధంగా దీని ప్రభావం పడుతుంది. పే చానల్ ధరల పెంపు వలన చానల్స్ అందుబాటు బాగా తగ్గి ప్రకటనల ఆదాయం బాగా పడిపోతుంది. పంపిణీదారులైన ఎమ్మెస్వోలు, డీటీహెచ్ ఆపరేటర్లు చందాదారులను కోల్పోయి నష్టపోయే ప్రమాదముంది. దీనికి కారణం చందాదారులు ఓటీటీ లేదా డీడీ ఫ్రీడిష్ లాంటి ప్రత్యామ్నాయాల వైపు వెళ్ళిపోయే అవకాశం ఉండటమే.

బ్రాడ్ కాస్టర్లు తీసుకున్న ఈ నిర్ణయంతో ట్రాయ్ దిగ్భ్రాంతి చెందింది. ఇలా ముఖ్యమైన చానల్స్ ను బొకే నుంచి బైటికి తీసి భారీగా ధరలు పెంచటం ద్వారా చందాదారులమీద మునుపాటిం కంటే ఎక్కువ భారం పడటం ట్రాయ్ కి మింగుడు పడలేదు. కొండనాలుకకు మందువేస్తే ఉన్న నాలుక ఊడినట్టవటంతో రెండో టారిఫ్ ఆర్డర్ అమలును ఏప్రిల్ 1 వ తేదీకి వాయిదావేస్తున్నట్టు ప్రకటించింది. ట్రాయ్ ఇలా రెండో టారిఫ్ ఆర్డర్ అమలును వాయిదా వేయటం మీద రక రకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ధరలు తగ్గిద్దామనుకుంటే తన నిర్ణయం బెడిసి కొట్టటాన్ని జీర్ణించుకోలేక ఇలా వాయిదా వేసిందన్నదే చాలామంది అభిప్రాయం.

అయితే ఈ నిర్ణయం తీసుకున్న సమయం మీద ప్రధానంగా కొన్ని అనుమానాలకు కారణమైంది. కేవలం త్వరలో జరగబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఇలా కొత్త ధరల అమలును వాయిదావేసిందన్న అనుమానానికి బలం చేకూరింది. అయితే, కొత్త ధరలను జనం అర్థం చేసుకోవటానికి కొంత సమయం కావాలి కాబట్టి ఇలా నిర్ణయం తీసుకుందని కూడా భావిస్తున్నారు. మరోవైపు ఈ మొత్తం గందరగోళం నుంచి బైటపడే మార్గం వెతుక్కోవటానికి సమయం కోసమే ఇలా చేసి ఉండవచ్చునని విశ్లేషించేవాళ్ళు కూడా ఉన్నారు.

ఏమైనప్పటికీ కొత్తధరలు ఏప్రిల్ లోపు అమలు జరిగే వీలులేదు. ఈలోపు సుప్రీంకోర్టు తీర్పు కూడా రావచ్చు. ట్రాయ్ మళ్ళీ ఏ వ్యూహం అనుసరిస్తుందో తెలియదు. బహుశా సుప్రీంకోర్టు తీర్పు తరువాతనే ట్రాయ్ వ్యూహం కూడా ఖరారయ్యే అవకాశముంది. అందువలన ఫిబ్రవరి 15 వరకూ వేచి చూడాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here