జీ-సోనీ కలిశాక చాలా ఉద్యోగాలు పోతాయ్

0
731

జీ ఎంటర్టైన్మెంట్, సోనీ పిక్చర్స్ నెట్ వర్క్ విలీనమవుతున్నాయి. టెలివిజన్ పరిశ్రమ ఇప్పుడు దీన్నొక మహావిలీనంగా చెప్పు కుంటోంది. కానీ మరోముఖ్యమైన కోణముంది. ఈ విలీనంతో రెండు సంస్థల్లోనూ చాలామంది ఉద్యోగాలు కోల్పోతారు. ఒకే పరిశ్రమలో పోటీ పడే రెండు సంస్థలు కలిసి పోయినప్పుడు జరిగే అత్యంత సహజమైన పరిణామమే అయినా ఇప్పుడున్న కరోనా అనంతర వాతావరణంలో ఇది చాలా తీవ్రమైన అంశం.
డిసెంబర్ 22 న అధికారికంగా విలీనాన్ని ఖరారు చేస్తూ ప్రకటన వెలువడింది. నియంత్రణ సంస్థలనుంచి క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆ లాంఛనం కూడా పూర్తయితే ఉద్యోగుల హేతుబద్ధీకరణ పేరుతో చాలామందికి ఉద్వాసన పలుకుతారు. కొనుగోళ్ళు, విలీనాలూ జరిగినపుడు ఇలాంటి పరిణామం టీవీ పరిశ్రమకు కొత్తేమీ కాదు. 2018 లో స్టార్ ఇండియా మాతృసంస్థ ట్వెంటీ ఫస్ట్ సెంచరీ ఫాక్స్ ను వాల్ట్ డిస్నీ తీసుకున్నప్పుడు 500 మంది ఉద్యోగులను స్టార్ తొలగించింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది.
విలీనం తరువాత ఏర్పడే సంస్థకు ఎండీ, సీవో గా వ్యవహరించే పునీత్ గోయెంకా స్వయంగా ఈ విషయం ఒప్పుకున్నారు. సిబ్బంది హేతుబద్ధీకరణ విషయం కచ్చితంగా తమ ఎజెండాలో ఉందని చెప్పారు. “మావాళ్ళలోనూ, సోనీ వాళ్ళలోనూ సరైన వాళ్ళను ఎంచుకుంటాం. ఒకే సంస్థగా కొనసాగాల్సి ఉంటుంది కాబట్టి తప్పదు. పని ముఖ్యం కాబట్టి అలాంటి ఎంపిక, ప్రాధాన్యాయాలూ తప్పవు” అన్నారు. కొన్ని చానల్స్ కు కొంతమంది తప్పనిసరి కాబట్టి వాళ్ళను కొనసాగిస్తామని, అయితే, కార్పొరేట్ వ్యవహారాలు చూసే వాళ్ళలో ఎక్కువమందికి ఉద్వాసన తప్పకపోవచ్చునని తేల్చి చెప్పారు.
అయితే, బైటికి పంపాల్సివచ్చినప్పుడు అలాంటి ఉద్యోగులకు తగిన పరిహారం ఇస్తామని కూడా చూచాయిగా చెప్పారు. “దాన్ని లే ఆఫ్ అనటం నాకిష్టం లేదు. మానవతాదృక్పథంతో చూడాలి. ఇది చాలా సున్నితమైన విషయం. యథాలాపంగా పింక్ స్లిప్ ఇస్తే సరిపోదు. మా వ్యాపారమే మానవ పెట్టుబడి. మా దగ్గర ఉన్నవాళ్ళంతా ప్రతిభావంతులే. వాళ్ళలో కొంతమందికి వాడులుకోవాల్సి రావటం బాధాకరమే అయినా వాళ్ళబాగోగులు దృష్టిలోపెట్టుకుంటాం” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here