6 లైసెన్సులు వెనక్కి తీసుకున్న ఈటీవీ, 3 తెలుగు ఛానళ్ళ లైసెన్సులు రద్దు

0
882

ఈటీవీ గ్రూప్ కొంతకాలం కిందట తీసుకున్న 14 లైసెన్సులలో ఆరింటిని వెనక్కి తీసుకుంటున్నట్టు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు తెలియజేసింది. కేసీపీ ఇన్ఫ్రా అనే సంస్థ కూడా రెండు లైసెన్సులను ఉపసంహరించుకుంది. అదే సమయంలో మంత్రిత్వశాఖ మూడు తెలుగు చానల్స్ సహా నాలుగు ఛానల్స్ లైసెన్సులు రద్దు చేసింది. రెన్యూవల్ కు దరఖాస్తు చేసుకోకపోవటం, లైసెన్స్ ఫీజు బకాయిలు చెల్లించకపోవటం సహా రకరకాల కారణాలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేరళకు చెందిన మీడియా వన్ అనే న్యూస్ చానల్ కు హోమ్ మంత్రిత్వశాఖ క్లియరెన్స్ ఇవ్వకపోవటంతో లైసెన్స్ రద్దయింది.
2020 ఫిబ్రవరి 25 న ఈటీవీ గ్రూప్ కి 14 కొత్త లైసెన్సులు మంజూరయ్యాయి. ఈటీవీ బాల భారత్ ఇంగ్లిష్, ఈటీవీ బాల భారత్ హెచ్ డి, ఈటీవీ బాల భారత్ గుజరాతీ, కన్నడ, మరాఠీ, పంజాబీ, తమిళ, తెలుగు, మలయాళం, అస్సామీస్, బంగ్లా, ఒడియా లైసెన్సులు తీసుకోగా ఇప్పుడు తాజాగా వాటిలో ఈటీవీ బాల భారత్ గుజరాతీ, మరాఠీ, పంజాబీ, అస్సామీస్, బంగ్లా, ఒడియా లైసెన్సులను ఉపసంహరించుకుంది.
ఇలా ఉండగా కెసిపి ఇన్ఫ్రా అనే సంస్థ 2020 నవంబర్ 5 న తీసుకున్న 4 లైసెన్సులలో రెండు లైసెన్సులను వెనక్కి ఇస్తున్నట్టు తెలియజేయగా మంత్రిత్వశాఖ జనవరి 19 న ఆమోదం తెలియజేసింది. కేసీపీ ఇన్ఫ్రా సంస్థ అప్ డేట్ న్యూస్, అప్ డేట్ టీవీ, అప్ డేట్ కిడ్స్, అప్ డేట్ మ్యూజిక్ అనే నాలుగు లైసెన్సులు తీసుకుంది. వాటిలో ఇప్పుడు అప్ డేట్ న్యూస్, అప్ డేట్ టీవీ అనే రెండు ఛానళ్ళ లైసెన్సులను వెనక్కి ఇచ్చేసింది.
3 తెలుగు ఛానళ్ళ లైసెన్సులు రద్దు
తెలుగులో ఒకప్పుడు ఆద్రి పేరుతో ఛానల్స్ నడపటం కోసం లైసెన్సులు తీసుకున్న ఆద్రి ఎంటర్టైన్మెంట్ అండ్ మీడియా వర్క్స్ సంస్థ ఇప్పుడు రెండు లైసెన్సులను పోగొట్టుకుంది. ఆద్రి వెల్నెస్ పేరుతో తీసుకున్న లైసెన్సును ఆ తరువాత ఒకసారి అగ్రో రాయల్ టీవీ గాను, ఇంకోసారి మహువా ప్లస్ గాను పేర్లు మార్చింది. చివరికి ఇప్పుడు లైసెన్స్ ఫీజు బకాయిపడి రెన్యూవల్ కోరకపోవటంలో లైసెన్స్ రద్దయింది.
ఆదరి సంస్థ మరో లైసెన్స్ ఆదరి ఎన్ రిచ్ పేరుతో తీసుకున్నప్పటికీ ఆ తరువాత ఒకసారి బెంజీ టీవీ గా, ఇంకోసారి శివశక్తి సాయి టీవీగా మార్చింది. ఆలా మార్చిన శివశక్తి సాయి టీవీని రమణానంద మహర్షి కొన్నేళ్ళపాటు నడిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చానల్ కు కూడా లైసెన్స్ ఫీజు బకాయి పడటం, రెన్యూవల్ కోరకపోవటం కారణంగా లైసెన్స్ రద్దయింది.
లైసెన్స్ రద్దయిన మూడో తెలుగు చానల్ ఏటీవీ. ఆపర్చునిటీ మీడియా సంస్థ ఏర్పాటు చేసిన ఈ చానల్ వార్తలు ప్రసారం చేసేందుకు అనుమతి లేకపోయినా, వార్తలు ప్రసారం చేసింది. ప్రస్తుతం అది మూతబడటం, రెన్యూవల్ కోరకపోవటం, లైసెన్స్ ఫీజు బకాయిపడటం లాంటి కారణాలతో ప్రభుత్వం దీని లైసెన్సులు రద్దు చేసింది.
చివరగా, కేరళకు చెందిన మాధ్యమం బ్రాడ్ కాస్టింగ్ సంస్థవారి మీడియావన్ టీవీ కి హోమ్ మంత్రిత్వశాఖ సెక్యూరిటీ క్లియరెన్స్ ఇవ్వకపోవటంతో లైసెన్స్ రద్దయింది. కేరళ హైకోర్టు 3 రోజుల పాటు ఊరటనిచ్చినా, ఆ తరువాత ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. దీంతో మూతబడ్డ ఈ చానల్ వ్యవహారం సుప్రీంకోర్టులో నడుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here