డిజిటల్ సంస్థలను కూడా కలుపుకున్న బ్రాడ్ కాస్టర్ల సంఘాలు

0
590

టెలివిజన్ చానల్స్ఏర్పాటు చేసుకున్న సంఘాలు ఇప్పుడు డిజిటల్ సంస్థలను కూడా తమలో కలుపుకుంటూ పేర్లు మార్చుకున్నాయి. నాన్-న్యూస్ చానల్స్ కోసం ఏర్పాటైన ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్ (ఐబిఎఫ్ ) ఇప్పుడు ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ అండ్ డిజిటల్ ఫౌండేషన్ (ఐబీడిఎఫ్) గా పేరు మార్చుకుంది. అదే విధంగా న్యూస్ ఛానలస్ సంఘమైన న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్ ( ఎన్ బి ఏ) ఇప్పుడు న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్ ( ఎన్ బి డి ఏ) అయింది. డిజిటల్ మీడియాకు కూడా మూడంచెల నియంత్రణ వ్యవస్థను ప్రతిపాదించిన నేపథ్యంలో టీవీ సంస్థలు ఎఎ నిర్ణయం తీసుకొని తమ పరిధిని పెంచుకున్నాయి. పైగా, తమ సంస్థలన్నీటికీ డిజిటల్ వేదికలు కూడా ఉండటం దీనికి మరో కారణం. అందువలన టీవీ ఛానలస్ నిర్వహించే డిజిటల్ వేదికలన్నీ ఈ సంఘాల పరిధిలోకే వస్తాయి. ఆ విధంగా వాటి కంటెంట్ మీద వచ్చే అభ్యంతరాల పరిశీలనను కూడా ఈ సంఘాల ఆధ్వర్యంలోని ఫిర్యాదుల పరిశీలన విభాగాలే చేపడతాయి. దేశంలోని ప్రధాన న్యూస్ నెట్ వర్క్స్ అన్నీ న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్ లో సభ్యత్వం తీసుకున్నాయి. అయితే, ఈ మధ్య కాలంలో ఆర్ణబ్ గోస్వామి మరో సంఘానికి బీజం వేశారు. తమ సంఘానికి గుర్తింపు కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. కంటెంట్ మీద వచ్చే ఫిర్యాదుల పరిశీలనకు వీలుగా ఎన్ని సంఘాలున్నా అభ్యంతరం లేదన్న ప్రభుత్వ ధోరణికి అనుకూలంగా ఈ కొత్త సంఘం వచ్చింది. ఇలా ఉండగా ఎన్ బి ఏ ఇప్పుడు డిజిటల్ ను కూడా కలుపుకొని ఎన్ బి డి ఏ గా మారిన విషయాన్ని సంస్థ అధ్యక్షుడు రజత్ శర్మ ప్రకటించారు. 14 సంవత్సరాల కిందట ప్రారంభమైన ఎన్ బి ఏ స్వీయ నియంత్రణ ద్వారా ప్రభుత్వ జోక్యాన్ని సాధ్యమైనంత వరకూ తగ్గిస్తూ వచ్చిందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఇప్పుడు అదే స్ఫూర్తి కొనసాగిస్తూ డిజిటల్ మాధ్యమాల కంటెంట్ ను కూడా నియంత్రించటానికి వీలుగా ఫిర్యాదులను న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అండ్ డిజిటల్ స్టాండర్డ్స్ అథారిటీ (ఎన్ బి డి ఎస్ ఏ ) పరిశీలిస్తుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here