కేబుల్ ఆపరేటర్ ను బ్రాడ్ బాండ్ తో బలపరచటం ట్రాయ్ ఉద్దేశ్యం కాదా?

0
570

టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఈమధ్యనే ఒక చర్చాపత్రం విడుదల చేస్తూ, బ్రాడ్ బాండ్ నిర్వచనాన్నే సమూలంగా మార్చాలని ఆలోచిస్తున్నట్టు సూచనప్రాయంగా వెల్లడించింది. ప్రస్తుతం సెకెనుకు 512 కిలోబిట్స్ వేగాన్నే ప్రాతిపదికగా తీసుకుంటూ ఉండగా అది బంగ్లాదేశ్ కంటే పది రెట్లు, అమెరికా కంటే యాభై రెట్లు తక్కువగా ఉండటం గమనార్హం. ఇలా తక్కువ స్థాయిలో ఉండటం వలన ఫిక్సెడ్ బ్రాడ్ బాండ్ ప్రొవైడర్లు తమ కస్టమర్లకు అతి తక్కువ వేగంతో బ్రాడ్ బాండ్ అందించినట్టవుతుంది. ఇప్పుడు ట్రాయ్ ప్రతిపాదించిన నిర్వచనం ప్రకారమైతే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఇలా 512 కెబిపిఎస్ కంటే తక్కువ వేగంతో ఇస్తే వాళ్ళను బ్రాడ్ బాండ్ సర్వీస్ ప్రొవైడర్లుగా పరిగణించరు.
ఇప్పుడు మొబైల్ బ్రాడ్ బాండ్ ప్రొవైడర్లు మెరుగైన వేగంతో బ్రాడ్ బాండ్ అందించగలిగే స్థితిలో ఉండటంతో ప్రస్తుత ఫిక్సెడ్ బ్రాడ్ బాండ్ ప్రొవైడర్లు బ్రాడ్ బాండ్ కొత్త నిర్వచనానికి అభ్యంతరం చెప్పినా ట్రాయ్ పట్టించుకునే పరిస్థితిలో లేదు. బ్రాడ్ బాండ్ రంగం మీద సమూలమైన మార్పుల కోణంలో సాగిన ట్రాయ్ చర్చా పత్రం అభిప్రాయ సేకరణకోసం అనేక ప్రశ్నాస్త్రాలు సంధించింది. ఎక్కువమందికి అందుబాటు, నాణ్యత లాంటి అంశాలకు ప్రాధాన్యమిచ్చింది.
ట్రాయ్ ప్రశ్నలు

  • బ్రాడ్ బాండ్ వేగాన్ని కొత్తగా నిర్వచిస్తూ ఎంత వేగం నిర్దేశిస్తే బాగుంటుంది? ఇదే నిర్వచనాన్ని మొబైల్ నెట్ వర్క్స్ కూ, అప్ లోడ్ వేగానికీ కూడా వర్తింపజేయాలా? లేదా వేరు వేరు విభాగాల కింద నిర్వచించాలా?
  • దేశంలో బ్రాడ్ బాండ్ వేగాన్ని కొలవటానికి ఒక వ్యవస్థ ఉండాలంటారా?
  • పెద్ద నగరాలలో సైతం ఫైబర్ లేదా ఇతర నెట్ వర్క్ పరికరాలు అమర్చటం ఆలస్యం కావటానికి రైట్ ఆఫ్ వే సమస్యలు ప్రధానకారణాలుగా ఉన్నాయి. అయితే, 2016 లో ట్రాయ్ చేసిన నిబంధనలు సరిపోతాయా, లేదంటే పాలనాపరంగా ఎలాంటి చర్యలు అవసరమని భావిస్తున్నారు?
  • భవనాలలో డక్ట్ ల ఏర్పాటు ద్వారా ప్రకృతి వైపరీత్యాలనుంచి ఫైబర్ ను రక్షించుకోవటం సాధ్యమవుతోంది. అయితే ఉమ్మడిగా డక్ట్ లు వాడుకోవటానికి, డార్క్ ఫైబర్, టవర్లు లీజికివ్వటానికి ఈ-మార్కెట్ ప్లేస్ స్థాపించటం అవసరమనుకుంటున్నారా?
  • భారతదేశంలో వైర్డ్ బ్రాడ్ బాండ్ విస్తరణ పరిమితంగా ఉండటానికి కారణమేంటి? ఎలాంటి విధానపరమైన నిర్ణయాల వలన పరిస్థితి మెరుగుపడుతుంది? ఫైబర్ టు ద హోమ్ ( ఎఫ్ టి టి హెచ్ ) ఎదుగుదల నిదానంగా ఉండటానికి కారణమేంటి? స్థానిక కేబుల్ ఆపరేటర్లు ఆశించినంతగా బ్రాడ్ బాండ్ ఇవ్వలేకపోవటానికి కారణమేంటి? భారత టెలికాం కంపెనీలు ఫిక్సెడ్ వైర్లెస్ యాక్సెస్ టెక్నాలజీని బ్రాడ్ బాండ్ కోసం వాడుకోకపోవటానికి కారణమేంటి?
  • దేశంలో బ్రాడ్ బాండ్ వేగం బాగా దెబ్బతినటానికి కారణమేంటి? ఒక కనెక్షన్ వాడుకునే వారి సంఖ్య మీద ఏవైనా పరిమితులు అవసరమా? అధిక జనావాస ప్రాంతాల్లో నెట్ వర్క్ రద్దీని నివారించటానికి మొబైల్ బ్రాడ్ బాండ్ వేగాలమీద మరిన్ని నియంత్రణలు అవసరమా?
  • ట్రాయ్ తన పరిమితి దాటిపోయి కూడా ట్రాయ్ “వినియోగదారుల పరికరాలు నెట్ వర్క్ ప్రమాణాలకు అనుగుణంగా ఉందాలా?” అని ప్రశ్నించింది. అలా చేస్తే కొనుగోలు స్థాయి ప్రశ్నార్థకమవుతుందా?
    దీనిమీద ట్రాయ్ ఒక వైపు సంబంధితులందరి అభిప్రాయాలూ సేకరిస్తున్నప్పటికీ దీని లక్ష్యం సూచన ప్రాయంగా అర్థమవుతూనే ఉంది. భారత్ లో వైర్డ్ బ్రాడ్ బాండ్ తక్కువగా ఉండటానికి కారణమేంటని ప్రశ్నిమ్చిందే తప్ప విధాన పరమైన నిర్ణయాలు కేబుల్ ఆపరేటర్లకు అనుకూలంగా ఉన్నాయా అని మాత్రం అడగలేదు. నిజానికి ఇంటింటికీ చేరుకోగల వెసులుబాటు కేబుల్ ఆపరేటర్లకే ఉంది. అందువలన ఫైబర్ టు ద హోమ్ ఏర్పాటుకు వీలుగా ఆపరేటర్ ను బలోపేతం చేయాల్సి ఉంది.
    కేబుల్ రంగాన్ని ఒక పరిశ్రమగా గుర్తించి ఉంటే బాంకుల నుంచి అప్పులు సులభంగా వచ్చేవి. మరీ ముఖ్యంగా కోవిడ్ సంక్షోభ సమయంలొ ఇచ్చిన రాయితీలను వాడుకుంటూ దేశమంతటా బ్రాడ్ బాండ్ కనెక్టివిటీని బాగా పెంచగలిగి ఉండేవారు. కానీ ప్రభుత్వం గాని, ట్రాయ్ గాని ఆ దిశలో ఆలోచించలేదు. కేబుల్ ఆపరేటర్లు బ్రాడ్ బాండ్ సేవలు ఎందుకు అందించటంలేదు అని అమాయకంగా ప్రశ్నించటం ట్రాయ్ నిర్లక్ష్యాన్ని, అజ్జానాన్ని మాత్రమే చాటి చెబుతోంది.
    భారత్ లో వైర్డ్ బ్రాడ్ బాండ్ వేగంగా అందుబాటులోకి తీసుకురావటానికి భారత ప్రభుత్వం, ట్రాయ్ కృషి చేయాలి. భారత్ బ్రాడ్ బాండ్ నెట్ వర్క్ పేరుతో దేశమంతటా కేబుల్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలనుకున్న లక్ష్య సాధనలో కేబుల్ ఆపరేటర్లను భాగస్వాములను చేయాలి. కేంద్ర నిధులతో రాష్ట్రాలు చేపడుతున్న ఈ పథకంలో కేబుల్ ఆపరేటర్ల పాత్రను స్పష్టంగా నిర్వచిస్తే రాష్ట్రాలు అందుకు అనుగుణమ్గా నడుచుకుంటాయి.
    నిరాటంకంగా బ్రాడ్ బాండ్ సేవలందించటానికి కేబుల్ ఆపరేటర్ ను మించిన ప్రత్యామ్నాయం లేదన్న వాస్తవాన్ని ట్రాయ్ గుర్తించి అదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదించాలి. క్షేత్ర స్థాయి ఆదాయాల్లో కనీసం 70 నుంచి 80% ఆపరేటర్ కు అందేట్టు చూడాలి.హై స్పీడ్ బ్రాడ్ బాండ్ ఇచ్చే స్థానిక కేబుల్ ఆపరేటర్ ను సవరించిన స్థూల ఆదాయం (ఎజిఆర్) నియమాన్నుంచి తప్పించాలి. తక్కువ వడ్డీకి కేబుల్ ఆపరేటర్ కు సంస్థాగత ఋణాలు అందజేస్తే ఫైబర్ టు ద హోమ్ చాలా వేగంగా పూర్తవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here