అక్రమ సెట్ టాప్ బాక్స్ రాకెట్ బట్టబయలు

0
1298

ఎలాంటి లైసెన్స్ గాని పంపిణీ ఒప్పందం గాని లేకుండా అనధికార్ సెట్ టాప్ బాక్సులు అమ్ముతున్న రాకెట్ ను లుధియానా పోలీసులు బట్టబయలు చేసారు. సోనీ తరఫున ఏర్పాటైన మీడియా సాఫ్ట్ లీగల్ ఏజెన్సీ అనే సంస్థ మేనేజర్ హర్మీందర్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మీద లుధియానాలోని కొత్వాలి పోలీసులు పాల్ ఎలక్ట్రానిక్స్ షాప్ మీద దాడి జరిపినప్పుడు ఈ విషయం బైటపడింది. సోనీ, స్టార్, జీ తదితర ప్రధానమైన బ్రాడ్ కాస్టర్ల పే చానల్స్ ను అనధికారికంగా అందించే ఏర్పాటు ఉన్న సెట్ టాప్ బాక్సులను గుర్తించారు.
ఈ సెట్ టాప్ బాక్సులు రూ.1500 చొప్పున కొన్నవారు ఆరు నెలలలపాటు ఎలాంటి చందా చెల్లించకుండానే సోనీ, స్టార్, జీ గ్రూప్ చానల్స్ చూడవచ్చునని, ఈ వ్యవధి పూర్తయిన తరువాత మళ్లీ రూ.200 చెల్లిస్తే మరో ఆరు నెలలపాటు చూదవచ్చునని కూడా ఆ షాపు వారు కొనుగోలుదారులకు చెబుతున్నారు. సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ బృందంతోబాటు మీడియా సాఫ్ట్ లీగల్ సొల్యూషన్స్ సభ్యులు, కొత్వాలి పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి ఆ షాప్ మీద దాడి చేసినప్పుడు అలాంటి 11 సెట్ టాప్ బాక్సులు దొరికాయి. వాటిని ముందుగానే ప్రోగ్రామ్ చేసి ఉన్నట్టు గుర్తించారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇవి ఇంటర్నెట్ సాయంతో పనిచేస్తూ పే చానల్స్ అందుకుంటాయి. షాపు యజమానులు ఈ పగారియా సెట్ టాప్ బాక్సులు పైన చెప్పిన వాగ్దానం ప్రకారం పనిచేస్తాయని చెబుతున్నారు. ఇటీవలి కాలంలో పైరసీ కారణంగా నష్టపోతున్నట్టు బ్రాడ్ కాస్టర్లు, కొంతమంది పెద్ద ఎమ్మెస్వోలు ఆందోళనవ్యక్తం చేస్తూ ఉన్న నేపథ్యంలో పైరసీని కనిపెట్టటానికి కొన్ని ఏజెన్సీల సాయం తీసుకోవాల్సి వస్తోంది.
ప్రధానమైన చానల్స్ కు అధికారికంగా నెలవారీ బిల్లు రూ.300 నుంచి 350 వరకూ అవుతున్న సమయంలో ఇలాంటి వారు తక్కువ ధరకే ఇవ్వజూపటం వలన వారి మోసాలకు అమాయకులు బలవుతున్నారు. ఇలాంటి సెట్ టాప్ బాక్సులు అకస్మాత్తుగా పనిచేయటం ఆగిపోయినప్పుడు సర్వీసింగ్ కు ఎవరూ అందుబాటులో లేనప్పుడు రాకెట్ బైటపడుతోంది. సోనీ సమ్స్థ ఇతర బ్రాడ్ కాస్టర్లతో కలసి గుజరాత్, పంజాబ్ సహా మరికొన్ని రాష్ట్రాలలో దాడులకు సిద్ధమవుతోంది.
ఎప్పటికప్పుడు సాంకేతికపరిజ్ఞానంలో వస్తున్న మార్పులను వాడుకుంటూ టీవీ పైరసీకి పాల్పడటం భారతదేశంలో ఇప్పుడొక పెద్ద వ్యాపారంగా తయారైంది. ప్రీమియం చానల్స్ ను నామమాత్రపు ధరకు అందించటానికి ప్రయత్నిస్తుండగా ఇలాంటి చర్యలను అరికట్టే నియమనిబంధనలమీద నియంత్రణ సంస్థలు దృష్టి సారిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here