కేబుల్ టీవీ సిబ్బందికి ముందుగా టీకాలివ్వండి

0
636

ఒకవైపు దేశవ్యాప్తంగా కరోనా రెండో విడత ఉద్ధృతంగా భయపెడుతుండగా రేయింబవళ్ళు పనిచేస్తున్న కేబుల్ టీవీ సిబ్బందికి టీకాలలో ప్రాధాన్యమివ్వాలని తెలంగాణ ఎమ్మెస్వోల సంఘ అధ్యక్షుడు శ్రీ ఎం సుభాష్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. భయంకరమైన వైరస్ గురించి ప్రజల్లో అవగాహన పెంచటానికి కృషి చేస్తున్న టీవీ చానల్స్ ను ఇంటింటికీ చేర్చటంతోబాటు ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యేలా నిరంతరం టీవీ ప్రసారాలు అందటానికి కేబుల్ రంగం చేస్తున్న కృషిని ఆయన కేంద్ర సమాచార, ప్రసార శాఖామంత్రి శ్రీ ప్రకాశ్ జవడేకర్ కు రాసిన లేఖలో ప్రస్తావించారు.
కేబుల్ టీవీ సిబ్బందిని కూడా కోవిడ్ యోధులుగా గుర్తించి వయసుతో నిమిత్తం లేకుండా ప్రాధాన్యతా క్రమంలో ముందుగా టీకాలివ్వాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. టీకా రక్షణ లేకుండా కేబుల్ సిబ్బంది తమ వృత్తిపరమైన విధులు నిర్వహించటం చాలా కష్టంతో కూడుకున్న విషయమని గుర్తు చేశారు. విధినిర్వహణలో కొంతమంది కేబుల్ సిబ్బంది ప్రాణాలు కోల్పోవటాన్ని కూడా ప్రస్తావించారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం కేబుల్ టీవీ ఉద్యోగులకు వయసుతో నిమిత్తం లేకుండా తక్షణమే టీకాలు ఇచ్చే ఏర్పాటు చేయటం సమంజసమని సూచించారు. అప్పుడే ఈ క్లిష్టకాలంలో కేబుల్ సిబ్బంది ధైర్యంగా తమ విధులు నిర్వర్తించగలుగుతారన్నారు.
దేశంలో ఇప్పుడు ఒక్క రోజులోనే 2,17,353 మంది కోవిడ్ బారిన పడటం ద్వారా ప్రమాద ఘంటికలు మోగిస్తున్నదని ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 1,42,91,917 మంది కోవిడ్ బారిన పడ్డారని ఆ లేఖలో ప్రస్తావించారు. రెండో దశ కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధుల సరసన కేబుల్ రంగాన్ని చేర్చేలా ప్రభుత్వ ఆదేశాలు రావటానికి కృషి చేయాలని మంత్రిని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here