అతి విశ్వాసం, నిర్లక్ష్యం, పక్షపాతం… కలిస్తే ట్రాయ్

0
896

డిజిటైజేషన్ మొదలైనప్పటినుంచీ సామాన్యుడి మీదభారం మోపుతూ బ్రాడ్ కాస్టర్లకు, కార్పొరేట్ ఎమ్మెస్వోలకూ కాపు కాస్తున్న టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తన కొత్త టారిఫ్ ఆర్డర్ లోనూ అదే పక్షపాతం చాటుకుంది. తన మాట నెగ్గాలనే పట్టుదల, అసలైన భాగస్వాములను పట్టించుకోని నిర్లక్ష్యం. తాను చేసింది చెల్లుబాటవుతుందన్న అతి విశ్వాసం, తక్కువ సంఖ్యలో ఉండి ఎక్కువ పెట్టుబడులు పెట్టినవాళ్ళ పట్ల పక్షపాతం గడిచిన ఐదేళ్ళ కాలంలో చూస్తూనే ఉన్నాం.

మొదటినుంచీ ట్రాయ్ ఇదే ధోరణి అవలంబిస్తోంది. డిజిటైజేషన్ అమలుకు ముందు క్షేత్ర స్థాయి సమస్యలమీద ఎలాంటి అధ్యయనమూ చేయలేదు. ఆదాయం ఎంత వస్తుది, ఎలా వస్తుంది, నెట్ వర్క్ మీద ఎంత ఖర్చు ఉంటుంది, నిర్వహణకు ఎంత ఖర్చవుతుంది అనే విషయాలేమీ తెలుసుకోలేదు. రాను రాను సమస్యలు తెలిసేకొద్దీ వాటికి కప్పిపుచ్చుతూ వచ్చింది తప్ప దిద్దుబాటుకు తగిన చర్యలు తీసుకోలేదు.

డిజిటైజేషన్ అమలు అనేది ప్రజలలో అవగాహన కల్పించటం ద్వారా కాకుండా కేవలం ఒక నిర్ణయాన్ని బలవంతంగా ప్రజలమీద రుద్దుతూ సెట్ టాప్ బాక్స్ తీసుకోకపోతే ప్రసారాలు ఆగిపోతాయన్న హెచ్చరికతో కొనసాగించటమే మొదటి తప్పు. ఆ తరువాత అమలును పర్యవేక్షించటానికి ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ లో వినియోగదారులకు స్థానం కల్పించకపోవటం ఉద్దేశపూర్వకంగా జరిగిన కుట్ర. పదే పదే అడిగినమీదట నామమాత్రంగా కేబుల్ ఆపరేటర్లకు స్థానం కల్పించటం అంతకంటే పెద్ద కుట్ర. ఎమ్మెస్వోలలో కార్పొరేట్ ఎమ్మెస్వోలకే పెద్దపీట వేయటం వెనుక ఏ ప్రయోజనాలున్నాయి?  కేవలం తనకు అందుబాటులో ఉండే, తాను మేలు చేయదలచుకున్న వర్గాలకు మాత్రమే స్థానం కల్పించటం ద్వారా తన పని సులువవుతుందనుకునే ధోరణి అవలంబించటం ట్రాయ్ స్వభావానికి ఉదాహరణ.

టారిఫ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు దానిమీద స్టార్ కోర్టుకెక్కితే తనకు ధర పరిమితి నిర్ణయించే అధికారపరిధి ఉన్నదని నిరూపించుకోవటానికే ట్రాయ్ తహతహలాడింది తప్ప ప్రేక్షకుల ప్రయోజనాలను పెద్దగా పట్టించుకోలేదు. చానల్స్ ను వాటి కంటెంట్ ఆధారంగా విభజించి పరిమితులు విధించటానికి ససేమిరా అన్నది. స్పోర్ట్స్ చానల్స్  తమ కంటెంట్ హక్కులను ప్రస్తావించారు కాబట్టి రూ. 19 వరకు అనుమతించినప్పుడు అంతకంటే తక్కువ ధరకు మిగతా చానల్స్ ఉండేలా పరిమితి విధించకపోవటానికి కారణమేంటి? ప్రధాన చానల్ లో ప్రసారమైన అంశాలనే మార్చి మార్చి  అదనపు చానల్స్ తయారు చేస్తున్నప్పుడు వాటికి ధరలు తగించి నిర్ణయించేలా చూడాలని అడిగినా ట్రాయ్ పట్టించుకోని మాట నిజం కాదా?

ఇవన్నీ పక్కనబెడితే అలా గరిష్ఠ చిల్లర ధర పరిమితి రూ. 19 అని ప్రకటించినప్పుడే బొకేల విషయంలో డిస్కౌంట్ 15% తగ్గకూడదని చెబితే రెండూ ఉమ్మడిగా అమలు చేయటానికి ఎందుకు ప్రయత్నించలేదు? మద్రాసు హైకోర్టు ఆ అంశాన్ని కొట్టివేసినప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళకుండా తాత్సారం చేయడమెందుకు ? ప్రజలకు మేలు చేసే ఈ విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించాల్సి వచ్చింది? సుప్రీంకోర్టు స్వయంగా ఈ నిర్లక్ష్యాన్ని గుర్తు చేసేదాకా పరిస్థితి దిగజారటానికి కారణమెవరు? ఈ పనుల వల్ల ప్రజలకు, ఎమ్మెస్వోలకు, ఆపరేటర్లకు  ట్రాయ్ మీద విశ్వసనీయత ఎలా కలుగుతుంది?

దేశవ్యాప్తంగా పే వానల్స్ ధరమీద ఆందోళనలు జరుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ అసలు సమస్య మీద దృష్టిపెట్టకుండా నెలరోజులు వాయిదా వేస్తే సమస్య తీరుతుందా? బొకే ధరల మీద 15% డిస్కౌంట్ మీద ఆశలు పెట్టుకున్నవాళ్ళు సుప్రీంకోర్టు ఆదేశాలతో కంగుతిన్నప్పుడు ప్రత్యామ్నాయం ఏమిటో ట్రాయ్ చెప్పగలిగిందా? మళ్ళీ కొత్త టారిఫ్ ఆర్డర్ ఇచ్చే ఉద్దేశం ఉంటే ఆ విషయమైనా చెప్పకుండా వేచి చూద్దామన్నట్టు ఉండటం మొత్తంపరిశ్రమనే అయోమయానికి గురి చేయటం కాదా?

ఒకవైపు గడువు ఇచ్చినట్టే ఇచ్చి ఆరు నెలల్లో జరగాల్సిన ప్రక్రియ మొత్తం మూడు వారాల్లో పూర్తికావాలనటం ఎంతవరకు సమంజసం?  18 కోట్ల కనెక్షన్ల నుంచి వాళ్ళు కోరుకునే పాకేజీల వివరాలు సేకరించి వాళ్ల బిల్లులు లెక్కగట్టి సంతకాలు తీసుకొని ఆ సమాచారాన్నంతా అందజేయటం జనవరి 21 లోగా పూర్తి చేయాలనటం ఏ వ్యూహానికి నిదర్శనం? ప్రజల ఆందోళనను, ఉద్యమాన్ని నీరుగార్చటం కోసం ఎమ్మెస్వోలు, ఆపరేటర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తూ రోజుకో ఆదేశం జారీచేస్తూ రోజువారీ సమాచారం కావాలనటం  కుట్ర కాదా?

ఇల్లిల్లూ తిరుగుతూ సమాచారం సేకరించటం ఒక వంతయితే ఆ సమాచారం మీద ఎప్పటికప్పుడు నివేదికలు పంపటం మరోవంతు. మామూలుగా ప్రభుత్వం జనాభా లెక్కలలాంటి పనికి ఎంత సమయం తీసుకుంటుందో తెలుసు. కానీ ఇప్పుడు మాత్రం మూడు వారాల్లోనే అంతా జరిగిపోవాలి. ఇంటింటికీ వెళ్ళి బ్రాడ్ కాస్టర్ల ధన దాహం గురించి, వాళ్ళు అతి తెలివితో తయారు చేసిన బొకేల గురించి చెప్పి ప్రేక్షకుల నిస్సహాయ స్థితిని ఆసరాగా చేసుకొని వాళ్ళకు చానల్స్ అంటగట్టి ఆ సమాచారమంతా ట్రాయ్ కి సమర్పించాలి. ఆ సమాచారం ఆధారంగా డబ్బు వసూలుకు బ్రాడ్ కాస్టర్లు సిద్ధంగా ఉంటారు. ఇదీ ట్రాయ్ కేబుల్ రంగానికి చేస్తున్న సేవ!

అవగాహన కల్పించాల్సిన బాధ్యత నుంచి ట్రాయ్ ఎప్పుడో తప్పుకుంది. డిజిటైజేషన్ గురించి అవగాహన కల్పించటానికి బదులు సెట్ టాప్ బాక్స్ కొనకపోతే ప్రసారాలు ఆగిపోతాయని బెదరించటానికే పరిమితమైంది. ఇప్పుడేమో చానల్స్ ఎంచుకొని డబ్బు కట్టకపోతే ప్రసారాలు రావన్న బెదరింపు. అంతే తప్ప ఎలాంటి వివరణా ఉండదు. కేవలం పారదర్శకత, కోరుకున్న చానల్స్ కే చెల్లింపు లాంటి సొల్లు చెప్పటం తప్ప బిలులు భారీగా పెరుగుతాయన్న నిజం చెప్పటానికి మాత్రం ముందుకు రావటం లేదు. కేవలం ఎమ్మెస్వోలను, కేబుల్ ఆపరేటర్లను జనం ముందుకు తోస్తూ వెనక ఉండి చోద్యం చూస్తోంది.

అవగాహన కల్పించే బాధ్యత ఎమ్మెస్వోలమీదికి నెడుతూ తాజాగా మరో లేఖ రాసింది. ప్రతి ఎమ్మెస్వో ఒక చానల్ ను కేవలం అవగాహన కల్పించటానికే కేటాయిస్తూ దాని ద్వారా పూర్తి సమాచారాన్ని ప్రేక్షకులకు అందించాలని చెబుతోంది. భారీగా చందాల రూపంలో దోచుకునే బ్రాడ్ కాస్టర్లు మాత్రం తమ పాకేజీల గురించి మాత్రమే ప్రచారం చేసుకుంటారు తప్ప మొత్తంగా చందాదారు కోణంలో ఆలోచించి అవగాహన అకల్పించటానికి ప్రయత్నించరు. నిజానికి ఈ మధ్య కాలంలో న్యూస్ చానల్స్ ఈ విషయంలో పూర్తిగా సహకరించి కొంతలో కొంతయినా ఈ కేబుల్ బిల్లుల పెరుగుదలకు కారణాలు ప్రేక్షకులకు తెలిసేలా చర్చలకు అవకాశం కల్పించి  కొంతయినా అవగాహన కల్పించాయనిచెప్పక తప్పదు.

ట్రాయ్ తీరు చూస్తుంటే ముందు ముందు కూడా ప్రజాప్రయోజనకరమైన అంశాలకంటే బ్రాడ్ కాస్టర్లకు, కార్పొరేట్ ఎమ్మెస్వోలకు అనుకూలమైన ధోరణే అవలంబిస్తుందని స్పష్టంగా తెలుస్తోంది. కార్పొరేట్ ఎమ్మెస్వోలు తమ పరిధిలోని కేబుల్ ఆపరేటర్లతో సహా జియో లాంటి సంస్థలకు అమ్ముడుపోతున్నప్పుడు ఆపరేటర్లకు ఎలాంటి లాభం గాని, రక్షణ గాని లేదా అని అడిగినా, ట్రాయ్ మౌనం వహించటం దేనికి సంకేతం? ఆపరేటర్లను డిజిటైజేషన్ హయాంలో గుర్తించి లైసెన్స్ మంజూరు చేయటానికి ఎందుకు వెనకాడుతున్నట్టు?

నిబంధనల పేరుతో చిన్న ఎమ్మెస్వోలమీద భారం మోపుతుంటే సగటు వ్యయం పెరిగిపోయి నష్టాల పాలయ్యే పరిస్థితి దాపురిస్తే ఏమవుతుంది? అమ్ముకోవాల్సి వస్తుంది. అంటే కార్పొరేట్ ఎమ్మెస్వోలు లేదా జియోలాంటి అనకొండ సిద్ధంగా ఉండనే ఉంటాయి. మొత్తంగా ట్రాయ్ రెగ్యులేషన్ ఎవరికి మేలు చేస్తున్నట్టు? ఎవరికి కొమ్ము కాస్తున్నట్టు ? ఆపరేటర్లతోబాటు సామాన్య ప్రజలు కూడా ఆలోచించాల్సిన విషయాలివి.

ఆపరేటర్లు తమ ఉనికిని కాపాడుకోవటానికి పోరాటాన్ని కొనసాగిస్తూ ప్రేక్షకులను కూడా నిరసనోద్యమాలలో భాగం చేసినప్పుడే బ్రాడ్ కాస్టర్ల మెడలు వంచి వాళ్ళ ధన దాహానికి అడ్డుకట్ట వేయగలుగుతాం. మన పరిశ్రమను మనమే కాపాడుకోవాలి. మన చందాదారులను మనమే చైతన్యవంతులను చేయాలి. మన చందాదార్ల ప్రయోజనాలను మనమే కాపాడాలి. ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ నమ్మకంగా సేవలందించే మనమే మన చందాదారుల విశ్వాసం చూరగొనాలి.

ఈ కొత్త సంవత్సరం ఇలా ఆరంభం కావటం బాధాకరం. అయినప్పటిఈ పాతికేళ్ళుగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కుంటూ ఇక్కడిదాకా వచ్చిన మనం ఈ సవాలునూ ఎదుర్కోవటానికి మరింత మెరుగైన సేవలు అందించటానికిఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుదాం. మన చందాదారుల ప్రయోజనాలే మనకు ముఖ్యం. మన సేవలే వాళ్లను మనవెంట ఉంచుతాయనే నమ్మకంతో…

మీ

సుభాష్ రెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here