ట్రాయ్ కి షాక్: పే చానల్స్ చందా ధరల పెంపు

0
1267

దాదాపు 20 నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న రెండో టారిఫ్ ఆర్డర్ అమలు చేయటానికి నిర్ణయించుకున్న బ్రాడ్ కాస్టర్లు తమ ఆలోచన బైటపెట్టారు. చందాదారుల భారం తగ్గిస్తానంటూ ముందుకొచ్చిన టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కి తిరుగులేని షాక్ ఇచ్చారు. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టయింది. బొకేలో పెట్టదలచుకున్న చానల్స్ వీడి ధరలు గరిష్ఠంగా రూ.12 కే పరిమితం కావాలని ట్రాయ్ చెబితే ఎక్కువ ఆదరణ ఉన్న చానల్స్ కు రూ. 23 మొదలు రూ. 30 దాకా పెట్టుకొని చిన్న చితకా చానల్స్ అన్నీ బొకేలలో పెట్టాయి.

నిరుడు జనవరి 1 న ట్రాయ్ రెండో టారిఫ్ ఆర్డర్ ప్రకటించింది. బొకేలో పెట్టదలచుకున్న చానల్ గరిష్ఠ ధర రూ. అంతకుముందు రూ.19 ఉండగా దాన్ని రూ.12 కు తగ్గించాలని అందులో ట్రాయ్ స్పష్టం చేసింది. అదే విధంగా బొకేలో విపరీతమైన డిస్కౌంట్లు ప్రకటించి చందాదారులు అనివార్యంగా ఎంచుకునే పరిస్థితి రాకూడదని డిస్కౌంట్ కు 34% పరిమితి విధించింది. దీంతో తక్కువ చానల్స్ తో ఎక్కువ బొకేలు తయారుచేయాల్సి వస్తుంది. ఇది పంపిణీ సంస్థలకు కచ్చితంగా ఇబ్బందికరం.

ఇప్పటికే ధరలు ప్రకటించిన సోనీ, జీ, స్టార్ ఛానల్స్ దాదాపు ఒకే విధ్యంగా వ్యవహరించాయి. తెలుగు ప్రేక్షకులు చూసే జీ తెలుగు, స్టార్ మా చానల్స్ ను దృష్టిలో పెట్టుకొని పరిశీలిస్తే పరిస్థితి అర్థమవుతుంది. జీ తెలుగు కు గతంలో గరిష్ఠ చిల్లర ధర రూ. 19 కాగా, జీ సినిమాలు రూ.10. తెలుగులో జీ గ్రూప్ చానల్స్ ఈ రెండే కాబట్టి మరో 8 ఇతర భాషల చానల్స్ కూడా కలిపి మొత్తం 10 చానల్స్ రూ.20 కి ఇస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. జీ తెలుగు అ లా కార్టే ధర రూ.22 తప్పనిసరిగా విడిగా మాత్రమే అందుబాటులో ఉంటుంది. రూ.4.50 చెల్లించి జీ సినిమాలు కూడా విడిగా తీసుకోవచ్చు. లేదా మరికొన్ని ఇతర భాషల జీ చానల్స్ కూడా కలిపి ఇస్తున్న రూ.5 బొకే తీసుకుంటే జీ చానల్స్ కు అయ్యే మొత్తం బిల్లు రూ. 26.50 లేదా రూ.27 అవుతుంది. కాబట్టి గతంలో జీ చానల్స్ బొకేలో తెలుగు ప్రేక్షకులు చెల్లించిన మొత్తం రూ. 20 బదులు ఇప్పుడు రూ.27 చెల్లించాల్సి వస్తుంది. అంటే 35% మేరకు ఒక్క జీ చానల్స్ కే బిల్లులో పెరుగుదల కనబడుతోంది. స్టార్ మా చానల్స్ విషయానికొస్తే, ప్రధాన చానల్ స్టార్ మా ధర గతంలో ఉన్న రూ.19 నుంచి ఇప్పుడు రూ.23 కు పెరిగింది. మా మూవీస్ ఇంతకు ముందు రూ.10 ఉండగా ఇప్పుడు గరిష్ఠంగా అవకాశమిచ్చిన రూ.12 ను వాడుకుంటూ ఇంకో రూ.2 పెంచారు. అలాగే స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు గతంలో రూ.19 ఉండగా ఇప్పుడది కూడా రూ. 23 కు పెరిగింది. గతంలో స్టార్ తెలుగు పాకేజ్ మొత్తం ధర రూ.63 కాగా బొకే రూపంలో అది రూ. 39 కి అందేది. అందులో మా గోల్డ్, మా మూవీస్, మా మ్యూజిక్, నాలుగు స్పోర్ట్స్ ఛానల్స్ , నేషనల్ జాగ్రఫిక్, ఎన్ జీ వాల్డ్ ఉండేవి. అవే ఛానల్స్ కావాలంటే ఇప్పుడు స్టార్ మా (23), స్టార్ స్పోర్ట్స్ 1(23), స్టార్ స్పోర్ట్స్ 2 (10), స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు (19) తోబాటు ఎస్ వి పి లైట్ బొకే (12) కలిపి మొత్తం రూ.87 కట్టాలి. అంటే, ధర ఇప్పుడు రెట్టింపు కంటే ఎక్కువైంది. బాగా తగ్గించుకోవాలన్నా, స్టార్ మా (23), స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు (19) తోబాటు ఎస్ వి పి లైట్ (12) తీసుకుంటే రూ.54 తో సరిపెట్టుకోవచ్చు. అయినా సరే, దాదాపు 40% బిల్లు పెరిగినట్టే.

ఆ విధంగా చూసినప్పుడు ప్రస్తుతం చూస్తున్న చానల్స్ కే ఇకమీదట నెలవారీ చందా కానీసంగా చూసినా మరో 25% దాకా పెరిగే అవకాశాలు కనిపిస్తోంది. అయితే, చందారుల చానల్స్ ఎంపిక ఎలా ఉంటుందనేదాన్నిబట్టి పరిస్థితిలో కొద్దిపాటి మార్పు ఉంటుంది. తెలుగు ప్రేక్షకులు బొకేల జోలికి పోకుండా అ లా కార్టే వైపు మొగ్గు చూపితే ప్రధానమైన ఎంటర్టైన్మెంట్ చానల్స్ నాలుగూ తీసుకుంటే స్టార్ మా, జీ తెలుగు, ఈటీవీ తెలుగు, జెమిని టీవీ తీసుకోవచ్చు. సినిమా చానల్స్ ఈ నాలుగింటికీ ఉన్నా, వాటిలో అన్నీ తీసుకోవటమా, ఒకటీ రెండు మాత్రమే తీసుకోవటమా అని ఆలోచిస్తారు. ఆ విధంగా బొకేల జోలికి పోవటానికి ఇష్టపడకపోతే చానల్ యాజమాన్యాలు ఇరకాటంలో పడతాయి.

వాటికి రీచ్ లేకపోతే ప్రకటనల ఆదాయం రాదు. ఇటు పే చానల్ ఆదాయమూ రాక, అటు ప్రకటనల ఆదాయమూ రాకపోతే అలాంటి చిన్న చానల్స్ ఇరకాటంలో పడతాయి. మరి బ్రాడ్ కాస్టర్లకు ఆ మాత్రం తెలియదా అనేది సహజంగానే ఎవరికైనా వచ్చే ప్రశ్న. వాళ్ళ ఆలోచన మాత్రం ఏ విధంగానైనా ప్రేక్షకులకు వీలైనన్ని ఎక్కువ చానల్స్ అంటగట్టటమే. అందుకే ఎమ్మెస్వోల ద్వారా ప్రేక్షకులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు. చట్టబద్ధం కాకపోయినా కొంతమంది బ్రాడ్ కాస్టర్లు చందాదారుల సంఖ్యతో సంబంధం లేకుండా లోపాయికారిగా ఫిక్సెడ్ డీల్స్ చేసుకుంటారనే ప్రచారం ఉంది. అలాంటప్పుడు పంపిణీదారులే సొంత బొకేలు తయారుచేసి ఒకమోస్తారుగా ధరలు తగ్గించటానికి అవకాశముంటుంది. అప్పుడే చానల్స్ కు కావాల్సిన రీచ్ కూడా దొరుకుతుంది. చట్ట ప్రకారం ప్రమోషనల్ ఆఫర్ ఇవ్వటానికి అవకాశం కూడా ఉంది. అయితే అది ఏడాదికి ఒకసారి మాత్రమే అనుమతిస్తారు. బ్రాడ్ కాస్టర్లు ఈ అవకాశాన్ని కూడా వాడుకుంటారు కాబట్టి పంపిణీ సంస్థలకు మేలు జరగవచ్చు.

కొత్త ధరలతో బొకేల సంఖ్య పెరిగితే మాత్రం వాటన్నిటినే అందుబాటులో ఉంచటం పంపిణీ సంస్థలకు తలనొప్పి వ్యవహారంగా మారుతుంది. పైగా, ఒక బొకేలో అన్ని చానల్స్ ఇచ్చి తీరాలే తప్ప ఏ ఒకటో రెండో ఇవ్వకపోయినా ఆ బొకేలోని మొత్తం చానల్స్ ను అ లా కార్టే ధర కే లెక్కించి వసూలు చేస్తామని కూడా బ్రాడ్ కాస్టర్లు స్పష్టం చేయటాన్ని బట్టి ఎమ్మెస్వోలకు ఇది కత్తిమీద సామే అవుతుంది. ఇప్పుడు మళ్ళీ కొత్త ధరలకు అనుగుణంగా కాస్, ఎస్ ఎం ఎస్ సరిదిద్దుకోవాలి. అవి ఎంత సమర్థంగా పనిచేస్తాయో చెక్ చేసుకోవాలి. ఇదంతా ఒక వంతయితే, ఇప్పటికైనా చందాదారుకు స్వేచ్ఛ ఇస్తారా, పంపిణీ సంస్థలే బెస్ట్ ఫిట్ పాక్ అంటూ పగ్గాలు తమ చేతుల్లో పెట్టుకుంటాయా అన్నది మరో ప్రశ్న.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here