పే బ్రాడ్ కాస్టర్ల ధనదాహం: జవాబు లేని ప్రశ్నలెన్నో!

0
600

* ఒకప్పుడు చానల్ కు నెలకు రూ.5 చొప్పున వసూలు చేస్తున్నప్పుడు ట్రాయ్ రూ. 19 వరకు పెంచుకునే అవకాశమిస్తే ఎగిరి గంతేసి పూర్తి స్థాయిలో ఆ రేటు పెట్టుకున్నారు తప్ప చందాదారుల గురించి ఆలోచించారా? ఇంతకుముందు ఎమ్మెస్వోలు, ఆపరేటర్లు కనెక్షన్ల లెక్క సరిగా చెప్పలేదని అభాండాలు వేసి ఇప్పుడు లెక్కలు తెలుస్తున్నా, ధర పెంచాల్సిన అవసరమేంటో?

* లాక్ డౌన్ సమయంలో పాత కార్యక్రమాలే ప్రసారం చేసి కూడా పూర్తి స్థాయిలో చందాలు వసూలు చేసుకున్న మీరు నిజాయితీగా ఉన్నారా? కొత్త కార్యక్రమాల నిర్మాణానికి లాక్ డౌన్ నిబంధనలు ఒప్పుకోలేదన్నది నిజమే. కానీ మీరు ధరలు తగ్గించవద్దని ఎవరూ మీమీద ఆంక్షలు పెట్టలేదు కదా?

* ఒక మెయిన్ చానల్ తో బాటు నాలుగైదు చిన్నచితకా చానల్స్ పెట్టి అవే సినిమాలు, అందులోనివే పాటలు, అందులోనివే కామిడీ సీన్స్ చూపిస్తూ ” ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ” అని మురిసిపోవటం జనం గుర్తించలేదనుకుంటున్నారా? స్పోర్ట్స్ ఈవెంట్స్ ఆగిపోయిన వేళ స్పోర్ట్స్ చానల్స్ లోనూ పాతవే ప్రసారం చేసి పెద్దమొత్తాల్లో చందాలు కొల్లగొట్టటం నిజం కాదంటారా?

* ఎవరూ చూడని చానల్స్ కూడా బొకేలో పెట్టి అంటగట్టాలనుకోవటం నిజం కాదా? కాదంటే ఇప్పుడు మీకొచ్చిన ఇబ్బందేంటో చెప్పండి. ఏదోవిధంగా బొకే తీసుకునేలా ఊరించే బొకేలు పెట్టి మీ అతి తెలివి చూపించలేదా? అ లా కార్టే లో మీ స్వేచ్ఛకు ఎవరూ అడ్డు లేరుకదా?

* బొకేలో పెట్టే చానల్స్ అన్నిటి మొత్తం ధరలో మూడో వంతు మించి డిస్కౌంట్ ఇవ్వకూడదని ట్రాయ్ చెబితే కలవరమెందుకు? నిజానికి 2017 మార్చి నిబంధనల్లో 15%డిస్కౌంట్ పరిమితి పెడితే కోర్టు కెక్కినా ట్రాయ్ కి ఆ హక్కు ఉందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది కదా. పోనీలే అని 33% దాకా అవకాశమిచ్చినా సంతృప్తి లేదా?

* మీ చానల్ గొప్పదైతే బొకేలో పెట్టకుండా అ లా కార్టే లో మాత్రమే ఇస్తూ మీ ధర మీరు నిర్ణయించుకునే అవకాశం ఉండగా ఎందుకే ఉలికిపాటు? ట్రాయ్ నియంత్రణ బొకేల విషయంలో మాత్రమేనన్న విషయం జనానికి తెలియనివ్వకుండా ఈ హడావిడి ఎందుకు? చిన్న నెట్ వర్క్ ల ప్రయోజనాలు కాపాడటం కూడా పెద్ద నెట్ వర్క్ లకు ఇష్టం లేదని పరోక్షంగా చెబుతున్నారా, లేదా?

* ఇలా అయితే 100-150 చానల్స్ మూతపడతాయంటూ బ్లాక్ మెయిల్ చేయటమేంటి? స్టార్ వాల్డ్ చానల్ మూసేస్తున్నామని  చెప్పటమెందుకు? మీకు గిట్టుబాటయ్యే ధర పెట్టుకోండి. నచ్చితే జనం చందా కడతారు.

* ఒక ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ టీవీ కనెక్షన్లు  ఉంటే అదనపు కనెక్షన్ కు కనీస ధర ( నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు రూ. 130 ప్లస్ పన్నులు ) లో 40% మాత్రమే తీసుకునేలా ట్రాయ్ నిబంధన పెట్టటానికి పరోక్షంగా మీ వత్తిడే కారణం కాదా? డబ్బునవాళ్ళకు సబ్సిడీ వచ్చేలా చేసి, మీ పే చానల్ చందాలు మాత్రం నూరు శాతం వసూలు చేసుకోవటం ఏం న్యాయం? ఆపరేటర్లు మాత్రం నష్టపోవాలా?చూసేది ఒక కుటుంబం లోని వారే కాబట్టి మీరు సబ్సిడీ ఇవ్వొచ్చుగా?

* కారేజ్ ఫీజు మీద పరిమితి పెట్టి ఎమ్మెస్వోలు, డిటిహెచ్ ఆపరేటర్ల ఆదాయానికి గండికొట్టే నిర్ణయం తీసుకున్నందుకు ట్రాయ్ ని అభినందించటానికి బ్రాడ్ కాస్టర్లుగా మీకు నోరు పెగలటం లేదెందుకని? అదే నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు రూ130 తో 100 కు బదులు 200 దాకా చానల్స్ ఇవ్వాలన్న ట్రాయ్ నిర్ణయం ఉచిత చానల్స్ కు ఎంతో మేలు చేస్తుంటే అదీ పట్టించుకోరా? రూ.160కి అపరిమితంగా ఉచిత చానల్స్ అందించే నిర్ణయాన్ని కూడా హర్షించలేరా?

* అసలు నియంత్రించే అధికారమే ట్రాయ్ కి లేదంటూ కోర్టుకెక్కి మొట్టికాయలు తిన్నాక ఇప్పుడు మళ్ళీ ట్రాయ్ వల్లనే పరిశ్రమ ఎదగటం లేదని వేదికలెక్కి ఉపన్యాసాలు దంచే మీకు చందాదారుల మీద ఏమైనా సానుభూతి ఉందా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here