ఇక బ్రాడ్ కాస్టింగ్ తోబాటు ఒటిటి కూడా ఐబిఎఫ్ పరిధిలోకి

0
486

దేశంలో బ్రాడ్ కాస్టర్ల సంఘమైన ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్ ( ఐబిఎఫ్) ఇప్పుడు డిజిటల్ ను కూడా కలుపుకుంటూ ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ అండ్ డిజిటల్ ఫౌండేషన్ (ఐబిడిఎఫ్) గా పేరు మార్చుకుంటోంది. టీవీ తో బాటు ఒటిటి ని కూడా తన పరిధిలోకి తెచ్చుకుంటూ ఇలా విస్తరణ నిర్ణయం తీసుకుంది. అందువలన ఇకమీదత ఒటిటి వేదికలకు సంబంధించిన అంశాలను కూడా ఈ సంస్థ చూస్తుంది. ఇప్పటికే దాదాపు అన్ని ప్రధాన బ్రాడ్ కాస్టింగ్స్ సంస్థలకూ సొంత ఒటిటి ఉన్న విషయం తెలిసిందే.
కొత్త సంస్థ ఐబిడిఎఫ్ కూడా ఒటిటి వేదికల స్వీయ నియంత్రణ బాధ్యతలు తీసుకుంటుంది. భారత ప్రభుత్వం 2021 ఫిబ్రవరి 25న ఐటి రూల్స్-2021 పేరుతో డిజిటల్ మాధ్యమాలకు మార్గదర్శకాలు, నైతిక నియమావళి నోటిఫై చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఆయా సంస్థలు తమకు తాముగా ఏర్పరచుకునే నియంత్రణ మొదటి దశకాగా, ఈ రంగంలోని సంస్థలు నియంత్రించటం రెండో దశ. ఇక మూడోది ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుంది. బ్రాడ్ కాస్టింగ్ కోసం ఇప్పటికే ఐబిఎఫ్ వారు బ్రాడ్ కాస్టింగ్ కంటెంట్ కంప్లెయింట్స్ కౌన్సిల్ ( బిసిసిసి) ను నిర్వహిస్తుందగా ఇప్పుడు ఒటిటి వేదికలకోసం డిజిటల్ మీడియా కంటెంట్ రెగ్యులేటరీ కౌన్సిల్ ( డిఎంసిఆర్ సి) ఏర్పాటు చేస్తారు.
బ్రాడ్ కాస్టింగ్ రంగం తరఫున ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికలందించటం ద్వారా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేయటంలో ఐబిఎఫ్ చురుగ్గా వ్యవహరిస్తోంది. మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగానికి ఇదే వెన్నెముకగా నిలిచింది. ఇప్పుడు సరికొత్త డిజిటల్ టెక్నాలజీ అందుబాటులోకి రావటంతో బాటు దానికి సంబంధించిన అంశాలను కూడా తన పరిధిలోకి తీసుకోవాలని ఐబిఎఫ్ నిర్ణయించింది. నిజానికి బ్రాడ్ కాస్టింగ్ లో ప్రసారాలు కొన్ని పరిమితులకు కట్టుబడేలా చేయటంలో విజయం సాధించిన ఐబిఎఫ్ ఇప్పుడు కొత్తరూపంలో కచ్చితంగా ఒటిటి నియంత్రణకు సంబంధించి అనేక సవాళ్ళు ఎదుర్కొవాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here