తెలంగాణలో అతి పెద్ద ఎమ్మెస్వో ఇప్పుడు ‘లైటస్’ చేతికి

0
331

తెలంగాణలో అతిపెద్ద ఎమ్మెస్వోగా ఉంటూ శాటిలైట్ టీవీ చానల్స్ పంపిణీలో గుత్తాధిపత్యం కొనసాగిస్తూ ఉన్న శ్రీ సాయి కేబుల్ సంస్థ యాజమాన్యం ఇప్పుడు లైటస్ టెక్నాలజీస్ హోల్డింగ్స్ అనే సంస్థ చేతుల్లోకి వెళ్ళింది. టీవీ పంపిణీ రంగంలో సిద్దిపేట కేంద్రంగా పనిచేసే ఎస్సెస్సీ సంస్థ తెలంగాణలోని అనేక జిల్లాలతో బాటు ఈ మధ్య కాలంలో ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ లో కూడా కొన్ని ప్రాంతాలకు విస్తరించటం తెలిసిందే.

ఎస్సెస్సీ పరిధిలో దాదాపు 6,500 మంది కేబుల్ ఆపరేటర్లు ఉన్నారు. ఏ శాటిలైట్ చానల్ అయినా తెలంగాణలో ఎక్కువ ఇళ్ళకు చేరాలంటే కచ్ఛితంగా శ్రీ సత్య సాయి కేబుల్ అండ్ బ్రాద్ బాండ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా పంపిణీ జరగాల్సిందే. అలాంటి సంస్థలో ఇప్పుడు 51% వాటాలు కొనుగోలు చేయటం ద్వారా లైటస్ టెక్నాలజీస్ సంస్థ భారతదేశంలో తన ఉనికిని మరింత విస్తరించినట్లయింది. లైటస్ టెక్నాలజీస్ సంస్థ అనుసరించే అత్యాధునిక టెక్నాలజీ వలన ఎస్సెస్సీ చందాదారులు నాణ్యమైన వీక్షణ అనుభూతి పొందుతారని భావిస్తున్నారు.

ఎస్సెస్సీలో మెజారిటీ వాటాలు కొనుగోలు చేయటం ద్వారా ప్రధానంగా తెలంగాణలోనూ, ఎస్సెస్సీ విస్తరించిన అంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళలోని కొన్ని ప్రాంతాలలో కూడా మెరుగైన కేబుల్, ఇంటర్నెట్ సేవలు అందించగలుగుతామని, ఎస్సెస్సీతో కలిసి చందాదారులకు కొత్త టెక్నాలజీ అనుభూతిని అందిస్తామని లైటస్ సీఈవో ధర్మేష్ పాండ్యా చెప్పారు. మెరుగైన సేవలు అందిస్తూ, కొత్త టారిఫ్ ఆర్డర్ ప్రకారం ధరలు పెంచబోతున్నట్టు కూడా చెప్పారు.

భారతదేశపు చందాదారులు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మరింత మెరుగైన సేవలు కోరుకుంటున్నారని, తెలంగాణలో అతిపెద్ద ఎమ్మెస్వోలలో ఒకరుగా చందాదారుల ఆలోచనలకు తగినట్టుగా వ్యవహరించటం తమ లక్ష్యమని ఎస్సెస్సీ సీఈవో పల్లె శ్రీనివాస్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. లైటస్ టెక్నాలజీస్ సంస్థతో ఏర్పడిన కొత్త భాగస్వామ్యంతో చందాదారుల అవసరాల మీద మరింత దృష్టి సారించటంతోబాటు మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామన్నారు. మెరుగైన టెక్నాలజీని వాడుకుంటూ మార్కెట్ విస్తరించటమే ధ్యేయంగా కృషి చేస్తామని శ్రీనివాస్ చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here