వివాదాల సుడిగుండంలో టీవీ రేటింగ్స్ విశ్వసనీయత

0
527

రేటింగ్స్ కోసం టీవీ చానల్స్ తమ ప్రసారాల్లో విలువలు వదిలేస్తాయన్న విమర్శ చాలా కాలంగా ఉంది. ఏ కార్యక్రమమైనా రేటింగ్స్ సంపాదించుకోవటమే లక్ష్యంగా రూపొందిస్తారనే అభిప్రాయం ప్రజల్లో బలంగా పాతుకు పోయింది. “నా భార్య నగలు తాకట్టుపెట్టి మరీ చానల్ నడుపుతున్నా. రేటింగ్స్ రాకపోతే ఎలా? “ అని ఇండియా టీవీ అధిపతి రజత్ శర్మ అనటం మీడియా వాళ్ళకు తెలుసు. ఏ క్షణమైనా రిమోట్ మీదికి చేయి పోవచ్చు గనుక అనుక్షణం ఆకట్టుకుంటూ ఉండటం కోసమే చానల్స్ పనిచేస్తాయి. ఇది రేటింగ్స్ సంపాదించుకోవటానికి ప్రాథమిక సూత్రంగా మారంది. అందుకే చానల్స్ టీవీ తెరమీద రకరకాల జిమ్మిక్కులకు పాల్పడతాయి. కానీ కొంతకాలంగా తెర వెనుక అనైతిక పద్ధతులలో రేటింగ్స్ సంపాదించుకోవటానికి అడపాదడపా ప్రయత్నాలు జరుగుతున్నట్టు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అలా మొదలైన తెరవెనుక రేటింగ్స్ యుద్ధం ఇటీవలికాలంలో ఒక పెద్ద కుంభకోణమై యావత్ టీవీ పరిశ్రమను కుదిపేసింది. రిపబ్లిక్ టీవీ అధిపతికీ, బార్క్ మాజీ సీఈవో కూ మధ్య లాలూచీ, కోట్ల కొద్దీ చేతులు మారటాన్ని పోలీసులు నిర్థారించారు. టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ లేదా క్లుప్తంగా టీఆర్పీలు అని పిలుచుకునే ఈ లెక్కల కథేంటి? రేటింగ్స్ కోసం ఎందుకింత ఆరాటం? ఎన్ని రకాల అడ్డదారుల్లో వాటికోసం ప్రయత్నిస్తున్నారు? తాజా కుంభకోణం కథేంటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సమగ్ర వ్యాసం.
అసలు రేటింగ్స్ అంటే ఏంటి? ఒక్క ముక్కలో చెప్పాలంటే, టీవీ ప్రేక్షకుల ఆదరణను కొలిచే కొలమానం. ఎంతమంది ఏ చానల్స్ లో ఏయే కార్యక్రమాలు ఎంత సేపు చుస్తున్నారో లెక్కగట్టి చానల్స్ కు, కార్యక్రమాలకు వాటి ఆదరణ ఆధారంగా రాంకులివ్వటమే రేటింగ్. ఈ రేటింగ్స్ ఆధారంగా ఆ చానల్ కు, ఆ కార్యక్రమానికి ఎంత ఆదరణ ఉంటుందో తెలుస్తుంది కాబట్టి ప్రకటనలిచ్చేవారు ఆ చానల్ లో, ఆ కార్యక్రమం మధ్యలో తమ ప్రకటన వస్తే ఎక్కువమంది చూస్తారని అంచనా వేసుకుంటారు. ఆదరణ ఎంత ఎక్కువగా ఉంటే చానల్స్ తమ కార్యక్రమాల మధ్య ప్రకటనలకు అంత ఎక్కువ ధర నిర్ణయిస్తారు. ఆ విధంగా ఎక్కువ రేటింగ్స్ ఉన్న చానల్స్ కు, ఎక్కువ రేటింగ్స్ ఉన్న కార్యక్రమాలకు ఎక్కువ ప్రకటనల ఆదాయం వస్తుంది. అందుకే బ్రాడ్ కాస్టింగ్ వ్యాపారంలో రేటింగ్స్ చాలా కీలకమయ్యాయి.
దూరదర్శన్ రోజుల్లో కొన్ని ఎంపిక చేసిన ఇళ్లకు డైరీలు ఇచ్చి అందులో వాళ్లు చూసిన, వాళ్లకు నచ్చిన కార్యక్రమాలు అందులో నమోదు చేసేట్టు చూసేవారు. ఆ సమాచారం అధారంగా ప్రేక్షకాదరణను లెక్కించేవారు. అయితే, ప్రైవేట్ శాటిలైట్ చానల్స్ వచ్చాక ప్రైవేట్ రేటింగ్ ఏజెన్సీలు వచ్చాయి. టామ్ ఇండియా, ఇన్ టామ్ అనే సంస్థలు మొదట్లో రేటింగ్స్ లెక్కించటం మొదలుపెట్టాయి. కానీ లెక్కించటానికయ్యే ఖర్చు, తక్కువ చానల్స్ ఉండటం కారణంగా ఇది లాభదాయకంగా అనిపించటం లేదని టామ్ ఇండియా సంస్థలో ఇన్ టామ్ విలీనమైంది. అప్పటినుంచి దాదాపు పదిహేనేళ్లపాటు టామ్ ఇండియా తిరుగులేని గుత్తాధిపత్యం సాగించింది.
అయితే, రేటింగ్స్ ఎలా లెక్కిస్తారనే అనుమానం చాలా మందికి ఉంటుంది. ముందుగా, గమనించాల్సింది ఇది సర్వే పద్ధతి మాత్రమే తప్ప అందరి అభిప్రాయాల ఆధారంగా జరిగే లెక్కింపు కాదని. అందువలన వీలైనంత వరకు అన్ని ఆదాయ వర్గాల వారిని, నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రజలను ప్రతిబింబించేలా కొన్ని శాంపిల్ ఇళ్లను ఎంపిక చేస్తారు. ఆ ఇళ్లలో టీవీలకు మీటర్లు అమర్చుతారు. మనం మొబైల్ ఫోన్ ఎంత సేపు దేనికి వాడామో మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ కి లెక్క తెలిసినట్టే ఆ శాంపిల్ ఇంట్లో పెట్టిన మీటర్ సాయంతో రేటింగ్ సంస్థ కార్యాలయంలో సమాచారం నమోదవుతుంది. వారం రోజులపాటు సేకరించిన డేటా ఫలితాలను రేటింగ్స్ రూపంలో వెల్లడిస్తారు. కొద్దిపాటి శాంపిల్ ఇళ్లలో ప్రేక్షకాదరణే అందరి అభిప్రాయంగా లెక్కిస్తారు.
ఈ పద్ధతిమీద ప్రధానమైన అభ్యంతరం ఏంటంటే, ఇన్ని కోట్లమంది టీవీ చూసే జనాభా ఉన్నప్పుడు శాంపిల్ వలన కచ్చితమైన సమాచారం వస్తుందా అనేది. నిజానికి టామ్, ఇన్ టామ్ ఉన్నప్పుడు కూడా రెండూ భిన్నమైన ఫలితాలిచ్చేవి. అప్పట్లో 2000 మీటర్లతో రేటింగ్స్ లెక్కింపు మొదలైంది. అంటే, 20 కోట్లకు పైగా టీవీ ఇళ్ళు ఉంటే 2 వేల మీటర్లు ఉండేవి. అయితే బ్రాడ్ కాస్టర్లు. ప్రకటనదారులు వత్తిడి పెంచటంతో టామ్ వాటి సంఖ్యను పెంచుతూ 10 వేలదాకా తీసుకు వచ్చింది. కానీ అవి నగరాలకు, పట్టణాలకు మాత్రమే పరిమితమయ్యాయి. జిల్లా స్థాయికంటే దిగి రాలేదు. అందువల్ల సగం జనాభా ఆదరణకు గుర్తింపు రాలేదు. నగర, పట్టణ ప్రాంత ప్రజలకోసమే కార్యక్రమాలు తయారయ్యేవి. శాంపిల్ సైజు మరీ తక్కువ ఉండటం మీద విమర్శలనుంచి తప్పించుకోవటానికి టామ్ ఒక వాదన తెరమీదికి తెచ్చింది. రక్తపరీక్షకు కొన్ని చుక్కలు సరిపోయినట్టే శాంపిల్స్ తక్కువ ఉన్నా నష్టం లేదన్నది. కానీ వైవిధ్య భరితమైన దేశంలో నిజమైన ప్రజాభిప్రాయ సేకరణకు అ శాంపిల్ సరిపోదన్నది వాస్తవం.
రేటింగ్స్ కు ప్రాధాన్యం పెరిగే కొద్దీ, కార్యక్రమాలమీద నాణ్యత పెంచటం లాంటి ఖరీదైన వ్యవహారానికి ప్రత్యామ్నాయం ఆలోచించటం మొదలైంది. దొడ్డిదారిన రేటింగ్స్ పెంచుకోవటం మీద కొన్ని చానల్స్ దృష్టిపెట్టాయి. శాంపిల్ ఇళ్ల ఆచూకీ కనిపెట్టటం మొదటి అడుగు. రేటింగ్ సంస్థలు తాము ఎంచుకున్న శాంపిల్ ఇళ్ళకు వెళ్ళి, యజమానికి నచ్చజెప్పి వెయ్యి రూపాయలు బహుమతిగా ఇచ్చి ఆ మీటర్ పెట్టి వెళతాయి. అప్పుడు కేబుల్ ఆపరేటర్ల ద్వారా కొంతమంది చానల్ యజమానులు ఆ ఇళ్ళ ఆచూకీ తెలుసుకుంటారు. నిజానికి ఏ ఊళ్ళో రేటింగ్ మీటర్లు ఉంటే ఆ ఊళ్ళ ఎమ్మెస్వోలకు బ్రాడ్ కాస్టర్లు ఎక్కువ కారేజ్ ఫీజు కట్టి తమ చానల్ తప్పకుండా ఆ ఊళ్ళో వచ్చేట్టు చూసుకుంటారు. అందువలన కేబుల్ ఆపరేటర్లద్వారా, ఎమ్మెస్వోలకు, ఎమ్మెస్వోల ద్వారా బ్రాడ్ కాస్టర్లకు ఆ ఇళ్ళు తెలియటం చాలా మామూలైపోయింది.
రేటింగ్స్ లెక్కించే పట్టణాల వార్తలు ఎక్కువగా ప్రసారం చేయటం, ఎంటర్టైన్మెంట్ చానల్స్ అయితే ఆ ఊళ్లలో చానల్ ప్రమోషన్ పేరుతో యాంకర్లు, సీరియల్స్ నటీనటులతో కార్యక్రమాలు నిర్వహించటం మొదలుపెట్టాయి. చివరికి ఫోన్-ఇన్ కార్యక్రమాలలో కూడా ఆ పట్టణాలనుంచి వచ్చే వాటికే స్పందించటం దాకా వెళ్లాయి. అయితే, ఇంతకంటే ఇంకా దగ్గరిదారి కోసం మరికొందరు బ్రాడ్ కాస్టర్లు ప్రయత్నించారు. కేబుల్ ఆపరేటర్ సాయంతో రేటింగ్ మీటర్లున్న ఇళ్ళను సంప్రదించి ఖరీదైన ఎల్ ఇ డి టీవీలు బహుమతిగా ఇచ్చి, ఇకమీదట అందులో చూసుకోవాలని, మీటర్ ఉన్న పాత టీవీలో తమ చానల్ ఆన్ చేసి వెనక్కి తిప్పి అలా వదిలేయాలని సూచించేవారు. అసలే తక్కువ శాంపిల్స్ కావటం వల్ల ఇలా 50 ఇళ్ళను మేనేజ్ చేయగలిగినా రేటింగ్స్ లో భారీగా తేడా వచ్చేది.
ఈ విషయం గ్రహించిన మిగతా చానల్స్ టామ్ మీద విమర్శలు చేయటం, ప్రత్యర్థి చానల్స్ మీద ఫిర్యాదులు చేయటం పెరిగిపోయింది. రేటింగ్స్ మీద నమ్మకం పోవటానికి ఇది మరో ప్రధానకారణమైంది. చివరికి ఏ చానల్ కైనా కేవలం కొన్ని ఇళ్ళ వలన అనూహ్యమైన రేటింగ్స్ వస్తుంటే ఆ చానల్ రేటింగ్స్ లెక్కలోకి తీసుకోవద్దని వాదించటం మొదలైంది. ఎంత ఇష్టమైనా, 24 గంటలూ ఒక న్యూస్ చానల్స్ చూస్తూ ఉండటమన్నది అసాధ్యమని అప్పటికి గాని టామ్ గుర్తించలేదు. ఈ లోగా క్రమంగా శాంపిల్ సైజును 10 వేలకు పెంచింది. అయినా సరే విమర్శలు ఆగలేదు. అక్రమాలు బైటపడుతూనే ఉన్నాయి. అడ్డుకోవటంలో టామ్ వైఫల్యం స్పష్టంగా కనబడుతూ వచ్చింది. ఎన్డీటీవీ లాంటి సంస్థలు టామ్ మాతృ సంస్థ అయిన నీల్సన్ మీద అమెరికాలో కేసు వేసే దాకా పరిస్థితి వెళ్ళింది.
ఈ నేపథ్యంలో బ్రాడ్ కాస్ట్ రంగపు నియంత్రణా సంస్థ అయిన టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) జోక్యం చేసుకుంది. రేటింగ్స్ కమిషన్ ను ఏర్పాటు చేసి సిఫార్సులు చేయాల్సిందిగా కోరింది. శాంపిల్ ఇళ్ళు కనీసం 50 వేలు ఉండాలని, గ్రామీణ ప్రాంతాలకు కూడా ప్రాధాన్యం ఉండేట్టు చూడాలని కమిషన్ సిఫార్సు చేసింది. ఒక్కో మీటర్ కి లక్షన్నర దాకా ఖర్చవుతుంది గనుక, తన చందాదారుల నుంచి వసూళ్ళు తక్కువ గనుక ఈ సిఫార్సులకు తగినట్టు వ్యాపారంలో ఉండటం తనవల్ల కాదని టామ్ చేతులెత్తేసింది. అప్పుడు బ్రాడ్ కాస్టర్లు, యాడ్ ఏజెన్సీలు, అడ్వర్టయిజర్ల నిధులతో బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) ఏర్పాటైంది. రేటింగ్స్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా శాంపిల్స్ సైజ్ క్రమంగా పెంచుతూ 60 వేలవరకు తెచ్చింది. అదే విధంగా గ్రామీణ ప్రాంతాలకు తగిన ప్రాధాన్యం ఇస్తూ వచ్చింది.
అయితే, బార్క్ కూడా విమర్శలకు అతీతం కాదని కొద్ది కాలానికే తేలిపోయింది. క్షేత్రస్థాయిలో పనిచేసే బార్క్ సిబ్బంది ద్వారా బార్క్ మీటర్లు (బారోమాటర్లు) పెట్టిన ఇళ్ళ జాబితా సంపాదించి చానల్స్ కోసం రేటింగ్స్ తెప్పించే దళారులు పుట్టుకొచ్చారు. ఆ ఇళ్లను సంప్రదించి ఏ సమయంలో ఏ చానల్ చూడాలో చెప్పి, దానికి ఒప్పుకున్నవాళ్ళకు డబ్బివ్వటం వాళ్లపని. ఒక్కో ఏజెంట్ రెండు నుంచి మూడు చానల్స్ దగ్గర డబ్బు తీసుకొని రోజుకు మూడు నాలుగు గంటలపాటు ఒక్కో చానల్ చూసే ఏర్పాటు చేస్తాడు. తన కమిషన్ తనకు వస్తుంది. ఇది చానల్స్ కే పరిమితం కాకుండా కొంతమంది ప్రైవేట్ ప్రొడ్యూసర్లు తమ కార్యక్రమం కోసం మాత్రమే చెల్లించటం కూడా బైటపడింది. ఎప్పటికప్పుడు క్రమశిక్షణ కమిటీ ద్వారా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటిస్తూ వస్తున్న బార్క్ మీద అనుమానాలు పెరుగుతూనే ఉన్నాయి. గతంలో ఆరోపణలు చేసుకున్న చానల్స్ మీద తాత్కాలిక నిషేధం విధించిన బార్క్ ఇప్పుడు మూడు నెలలుగా న్యూస్ చానల్స్ రేటింగ్స్ బైటపెట్టటం లేదు.
ఇలా ఉండగా రేటింగ్స్ లో కనీవినీ ఎరుగని కుంభకోణం బైటపడటంతో మొత్తం టీవీ పరిశ్రమ ఉలిక్కి పడింది. కొన్ని చానల్స్ రేటింగ్స్ కోసం లంచాలిస్తున్నాయన్న ఆరోపణతో మొదలైన దర్యాప్తు మరిన్ని కొత్త విషయాలు బైటపెట్టింది. ఒక జాతీయ చానల్ నేరుగా బార్క్ అత్యున్నత అధికారులకే లంచమిచ్చి రేటింగ్స్ పెంచుకున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. పైగా, తమ చానల్ రేటింగ్స్ పెంచటంతోబాటు పోటీ చానల్స్ రేటింగ్స్ తగ్గించాల్సిందిగా కోరినట్టు అందుకు అప్పటి బార్క్ సీఈవో దాదాపు కోటి రూపాయల దాకా డబ్బు తీసుకున్నట్టు బైటపడింది. ఆ చానల్ యజమానికి, బార్క్ సీఈవోకు మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణ ముంబయ్ పోలీసులకు దొరికింది. చాలా పకడ్బందీగా సాగిన దర్యాప్తు చాలా విషయాలు బైటపెట్టింది. ఇలాంటి రేటింగ్స్ కొనుగోలు ఒప్పందాలలో కొన్ని ఇంగ్లిష్, తెలుగు చానల్స్ కూడా ఉన్నట్టు ముంబయ్ పోలీసులు గుర్తించారు.
ఇలా దర్యాప్తు తీవ్రతరం అవుతున్నప్పుడే సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ రేటింగ్స్ లెక్కింపు మీద ఒక త్రిసభ్య సంఘాన్ని నియమించింది. శాంపిల్ సైజు భారీగా పెంచే అవకాశాన్ని, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే రేటింగ్స్ లెక్కించగలిగే అవకాశాన్ని కూడా ఈ కమిటీ పరిశీలించి నివేదిక అందజేసింది. ప్రభుత్వం దీని మీద నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఏమైనా, రేటింగ్స్ మీద పడిన మచ్చ మాత్రం శాశ్వతంగా టీవీ పరిశ్రమ మీద ఉండిపోతుంది. స్వయంగా ఏర్పాటు చేసుకున్న సంస్థ కావటంతో బ్రాడ్ కాస్టర్లు, అడ్వర్టయిజర్లు, యాడ్ ఏజెన్సీలు ఏం చేయాలో తెలియని అయోమయంలో పడ్దారు. కంచే చేను మెసినట్టు తాము నియమించుకున్న అధికారులే ఇలాంటి అవకతవకలకు పాల్పడటాన్ని భరించలేకపోతున్నారు. లక్ష కోట్ల టెలివిజన్ పరిశ్రమలో సగానికి పైగా ఆదాయం తెచ్చే ప్రకటనలకు ప్రాతి పదిక అయిన రేటింగ్స్ ను ఇంత సులభంగా తారుమారు చేయవచ్చునన్న వాస్తవాన్ని పరిశ్రమ జీర్ణించుకోలేక పోతున్నది.

  • తోట భావనారాయణ ( నమస్తే తెలంగాణ సౌజన్యంతో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here