కొత్త టారిఫ్ ఆర్డర్ కేసు వచ్చే నెల 7కు వాయిదా

0
825

సుప్రీం కోర్టుకు చేరిన కొత్త టారిఫ్ ఆర్డర్ కేసు విచారణ సెప్టెంబర్ 7 కు వాయిదా పడింది. సబొంబాయ్ హైకోర్టు తీర్పు మీద స్టే ఆశించిన బ్రాడ్ కాస్టర్లకు ఈరోజు కూడా నిరాశే ఎదురైంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) 2020 జనవరి 1 న జారీచేసిన రెండో టారిఫ్ ఆర్డర్ ( ఎన్టీవో 2.0) మీద బ్రాడ్ కాస్టర్లు బొంబాయ్ హైకోర్టును ఆశ్రయించగా బొకేల జంటనిబంధనలలో ఒకదాని మీద తప్ప బ్రాడ్ కాస్టర్లకు ఎలాంటి ఊరటా లభించలేదు. దీంతో ట్రాయ్ తమ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించి ధరలు నిర్ణయిస్తున్నదంటూ జులై 13న బ్రాడ్ కాస్టర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
టారిఫ్ ఆర్డర్ అమలుకు ఆగస్టు 12 వరకు ఆరువారాల గడువుమడగా ఈలోపు కనీసం స్టే లభించవచ్చునని బ్రాడ్ కాస్టర్లు ఆశించారు. అయితే 51 వాల్యూమ్ ల రికార్డులు కోర్టుకు ఇవ్వటం మీద సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ డాక్యుమెంట్లను అక్షరాలా లారీలో తరలించాల్సి వచ్చిందని, న్యాయమూర్తులను చదవకుండా భయపెట్టేందుకే ఇలా చేశారా అంటూ కోప్పడటం గమనార్హం. అదే సమయంలో స్టే ఇవ్వకుండానే ఆగస్టు 18 కి విచారణ వాయిదా వేశారు. సమాచారం సంక్షిప్తంగా ఉంటేనే ఒప్పుకుంటామని కూడా హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో ఈరోజు కేసు విచారణకు రాగా, ట్రాయ్ తన సమాధానం దాఖలు చేయటానికి సెప్టెంబర్ 7 వరకు గడువునిస్తూ ఆ రోజుకు తదుపరి విచారణను వాయిదావేశారు. ఈ రోజు కూడా స్టే లభించలేదు. అయితే, ట్రాయ్ సమాధానానికి గడువు ఇచ్చిన నేపథ్యంలో ట్రాయ్ ఇప్పటికిప్పుడు ఎన్టీవో 2.0 అమలుకోసం పట్టుబట్టకపోవచ్చు. కానీ నిర్దిష్టమైన ఆదేశాలు లేకపోతే బొంబాయ్ హైకోర్టు ఆదేశాల ప్రకారం ప్రస్తుతమున్న రిఫరెన్స్ ఇంటర్ కనెక్షన్ ఆఫర్స్ చెల్లుబాటయ్యే అవకాశం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here