రిపబ్లిక్ టీవీ రేటింగ్స్ కోసం కేబుల్ నిర్వాహకుడి ద్వారా 15 లక్షల పంపిణీ

0
483

రేటింగ్స్ కుంభకోణం మీద దర్యాప్తు జరుపుతున్న ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు క్రమంగా ఆ వ్యవహారాన్ని ఛేదిస్తున్నారు. ఇప్పుడు తాజాగా థానేకి చెందిన ఒక కేబుల్ టీవీ పంపిణీదారుడు నెలనెలా హవాలా ద్వారా రూ. 15 లక్షలు అందుకుంటూ బార్క్ రేటింగ్ మీటర్లు (బారోమీటర్లు) ఉన్న ఇళ్ళకు పంచి రిపబ్లిక్ టీవీ ప్రేక్షకాదరణ లెక్కలు పెంచటానికి సాయ పంపినట్టు ఒప్పుకున్నాడు. ఈ వ్యవహారంలో అప్రూవర్ గా మారటంతో జరిగింది మొత్తం పోలీసులకు చెప్పాడు. ఇదే విషయాన్ని ముంబయ్ పోలీసులు కోర్టుకు తెలియజేశారు. 

క్రిస్టల్ బ్రాడ్ కాస్ట్ అనే సంస్థ ద్వారా టీవీ చానల్స్ పంపిణీ చేసే అశిష్ చౌధురి అనే వ్యక్తి ఈ వ్యవహారం మొత్తాన్ని పోలీసుల సమక్షంలో వెల్లడించటంతో అతడిని రిమాండుకు పంపాల్సిందిగా పోలీసులు కోర్టుకు ఇచ్చిన దరఖాస్తులో వివరాలు పేర్కొన్నారు. అభిషేక్ కొలవాడే అనే వ్యక్తి మాక్స్ మీడియా అనే మార్కెటింగ్ సంస్థను నిర్వహిస్తూ  పంపిణీ చేస్తున్నట్టు తేలింది. తనకు చౌధురి నుంచి నెలనెలా డబ్బు అందుతున్నట్టు చెప్పటంతో పోలీసులు చౌధురిని అరెస్ట్ చేశారు.  రాంజీ వర్మ, దినేష్ విశ్వకర్మ, ఉమేశ్ మిశ్రా అనేవారికి కూడా ఇలాగే డబ్బిచ్చి బారోమీటర్లు ఉన్న ఇళ్ళకు పంచే ఏర్పాటు జరిగినట్టు వెల్లడైంది. 

అభిషేక్ కొలవాడే కేవలం రిపబ్లిక్ టీవీ నుంచి మాత్రమే కాకుండా వావ్ మ్యూజిక్ చానల్ అధికారులనుమ్చి, రిపబ్లిక్ భారత్ హిందీ న్యూస్ చానల్ నుంచి కూడా 2017-2020 జులై దాకా డబ్బు అందుకున్నట్టు ఒప్పుకున్నాడు. అందులో కొన్ని లక్షలు తాను ఉంచుకొని మిగిలినవి పంచినట్టు చెప్పగా పోలీసులు ఆదివారం నాడు అతడి ఇంట్లో సోదాచేసి 11.7 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. చౌధురిని ప్రశ్నించిన తరువాత థానేలోని అతడి ఆఫీసులో రూ. 2 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితుల ఆవరణలలో ఒక లాప్ టాప్, పెన్ డ్రైవ్ లు కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో కోర్టు చౌధురిని జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేయగా కొలవాడే పోలీస్ కస్టడీని నవంబర్ 5 వరకు పొడిగించింది. ప్రాసిక్యూషన్ కేసును బలోపేతం చేస్తూ, అప్రూవర్ గా మారినవాళ్లలో చౌధురి రెండో నిందితుడు. ఇళ్ళకు చెల్లింపు జరిపినట్టు ఆరోపణలు ఎదుర్కుంటున్న  మరో అనుమానితుడు ఉమేశ్ మిశ్రా కూడా అప్రూవర్ గా మారిన సంగతి తెలిసిందే.  రేటింగ్స్ కోసం అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలున్న వ్యవహారంలో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు  రిపబ్లిక్ టీవీ, ఫక్త్ మరాఠీ, బాక్స్ సినిమా, న్యూస్ నేషన్, మహా మూవీస్, వావ్ చానల్స్ పాత్రమీద దర్యాప్తు జరుపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here