రూ.431 కోట్ల పరిహారం కోరుతూ బార్క్ కు టైమ్స్ నోటీస్

0
581

టెలివిజన్ ప్రేక్షకాదరణను లెక్కించే బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) రేటింగ్స్ సమాచారాన్ని తారుమారు చేసి తమ నెట్ వర్క్ కు కలిగించిన నష్టానికి గాను మొత్తం రూ.431 కోట్ల పరిహారం చెల్లించాలని బార్క్ కు టైమ్స్ నెట్ వర్క్ లీగల్ నోటీస్ పంపింది. బార్క్ ఇండియా జారీచేసిన తప్పుడు సమాచారం కారణంగా పెద్ద ఎత్తున ఆదాయం కోల్పోయామని తైమ్స్ ఆ నోటీసులో ఆరోపించింది.
2017 మొదలుకొని బార్క్ ఏళ్ళ తరబడి తప్పుడు రేటింగ్ సమాచారం ఇచ్చిందని, నెలవారీ లైసెన్స్ ఫీజు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నప్పటికీ రేటింగ్స్ ను తారుమారు చేసి అందించిందని ఆ నోటీసులో టైమ్స్ ఆరోపించింది. అందువలన సివిల్ చర్యలతోబాటు క్రిమినల్ చర్యలకు కూడా బార్క్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
“బార్క్ ఈ విషయంలో సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ నియమాలను తుంగలో తొక్కటమే కాకుండా తన సొంత సంస్థ విధానాలు/నియమాలు/ నియంత్రణానిబంధనలు కూడా ఉల్లంఘించింది. ఉద్దేశపూర్వకంగా ప్రేక్షకాదరణ సమాచారాన్ని తగ్గించి చూపి కొత్తగా ప్రారంభమైన మరో చానల్ కు మేలు చేయటం వలన మా టైమ్స్ నౌ నెట్ వర్క్ ఆదాయాన్ని, ప్రతిష్ఠను, ఎదుగుదలను, గుడ్ విల్ ను కోల్పోయింది. దీనివలన జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా టైమ్స్ ప్రతిష్ఠ మసకబారింది” అని నోటీస్ పేర్కొంది.
పైగా, ఉద్దేశపూర్వకంగానే తప్పు చేసిన వారిమీద బార్క్ ఎలాంటి క్రమశిక్షణా చర్యలూ తీసుకోలేదని టైమ్స్ ఆరోపించింది. కొంతమంది అధికారులు తప్పు చేసినా, రేటింగ్స్ లో అవకతవకలు జరిగాయని తేలినా, అంతర్గతంగా కూడా ఫిర్యాదులు అందినా, 2020 జులై 24 నాటి ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ స్పష్టంగా తప్పు పట్టినా బాధ్యులైన ధికారులు రాజీనామా చేసి వెళ్ళిపోవటాన్ని అనుమతించిందని ఆరోపించింది. ఆ నివేదిక విషయంలో ఉద్దేశపూర్వకంగానే బార్క్ మౌనముద్ర దాల్చిందనేది కూడా టైమ్స్ ఆరోపణ. ముంబయ్ పోలీసుల దర్యాప్తులో బైటపడేదాకా ఆ నివేదికను రహస్యంగా ఉంచాల్సిన అవసరమేంటని టైమ్స్ నోటీసు ప్రశ్నించింది. ఇది సభ్యులపట్ల నిర్లక్ష్యమేనని అభివర్ణించింది.
టైమ్స్ నెట్ వర్క్ డిమాండ్లు ఇవి:
ఆదాయాన్ని దెబ్బతీసినందుకు మొత్తం నష్టపరిహారంగా రూ.431 కోట్లు చెల్లించాలి. నెలవారీ చందా రూపంలో చెల్లించిన రూ. 21.83 కోట్లను ఏడాదికి 18% చొప్పున వడ్దీతో సహా తిరిగి ఇవ్వాలి.
• వాస్తవానికి 2017-19 మధ్య టైమ్స్ నౌ నెంబర్ వన్ చానల్ అని ఒప్పుకుంటూ బార్క్ తన వెబ్ సైట్ లో ప్రకటించాలి.
• ఇదే విషయాన్ని టాప్ 5 ఇంగ్లిష్, హిందీ చానల్స్ తోబాటు అత్యధిక సర్క్యులేషన్ ఉన్న ఇంగ్లిష్ దినపత్రికతోబాటు ఒక్కో రాష్ట్రంలో అత్యధిక సర్క్యులేషన్ ఉన్న ప్రాంతీయ భాషా పత్రికలోనూ ప్రచురించాలి.
• 2020 జులై 24 నాటి ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ ను బార్క్ వెబ్ సైట్ లో ప్రచురిస్తూ, మార్గదర్శకాలు కూడా చెప్పాలి.
• తప్పు చేసిన బ్రాడ్ కాస్టర్లను రేటింగ్స్ నుంచి తప్పించటంతోబాటు, ఈ కుంభకోణంలో పాత్ర ఉన్న బార్క్ అధికారులమీద చర్యలు తీసుకోవాలి, జరిమానాలు విధించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here