రెండో టారిఫ్ ఆర్డర్, రేటింగ్స్ కుంభకోణం, ఓటీటీ నియంత్రణపై రాజ్యసభలో మంత్రికి ప్రశ్నలు

0
548

సమాచార, ప్రసార శాఖామంత్రి అనురాగ ఠాకూర్ ఈ రోజు రాజ్యసభలో మీడియాకు సంబంధించిన అనేక తాజా అంశాలమీద ప్రశ్నాస్త్రాలు ఎదుర్కున్నారు. అందులో ప్రధానంగా రెండో టారిఫ్ ఆర్డర్ ప్రభావం, టీవీ రేటింగ్స్ లో అక్రమాలు, ఓటీటీ వేదికల నియంత్రణ చర్యలు, ఫిల్మ్స్ డివిజన్ కు సంబంధించిన నాలుగు విభాగాల విలీనం, న్యూస్ చానల్స్ ప్రసారాల మీద డేసవ్యతిరేకకార్యక్రమాలపై చర్యలు తదితర అంశాలు అందులో ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన (వైఎస్సార్సీపీ ఎంపీ, టీఆర్ ఎస్) ఎంపీలు అడిగిన ప్రశ్నలు కూడా ఇందులో ఉండటం గమనార్హం.
పేరు మోసిన జాతీయస్థాయి బ్రాడ్ కాస్టింగ్ సంస్థలు తమ ప్రధాన చానల్స్ ను బొకే నుంచి వెలుపలికి తీసి నెలకు రూ. 15 నుంచి 25 వరకు చందా ధరగా నిర్ణయించటం మీద వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. దీనికి సమాచార, ప్రసార శాఖామంత్రి స్పందిస్తూ, రూ.12 కు మించి ధర నిర్ణయించిన చానల్స్ ను బొకే కి వెలుపల మాత్రమే అ లా కార్టే పద్ధతిలో ఇస్తున్నారని చెప్పారు. 2020 జనవరిలో జారీ చేసిన కొత్త టారిఫ్ ఆర్డర్ కు అనుగుణంగా పంపిణీ వేదికలు చందాదారులకు ఇవ్వజూపే బొకే, అ లా కార్టే ధరలు 2022 జనవరి 31 లోగా ప్రకటించాల్సి ఉందని, చందాదారులు వాటిని అందుకోవటం ఏప్రిల్ 1 న మొదలవుతుందని చెప్పారు. ఈ కారణంగా మార్చి 31 తరువాత చందాదారులు తమకు కావాల్సిన ఛాన్సల్ ఎంచుకున్న మీదటమాత్రమే వాస్తవంగా ధరల ప్రభావం అర్థమవుతుందని జవాబిచ్చారు.
జర్నలిస్టు, మలయాళం టీవీ చానల్ కైరలి ఎండీ కూడా అయిన సిపిఐ ఎంపీ జయం బ్రిట్టాస్ బ్రాడ్ కాస్టింగ్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) రేటింగ్స్ లో అవకతవకల గురించి, దాన్ని సరిదిద్ది కచ్ఛితత్వం ఉండేట్టు చూడటటానికి మంత్రిత్వశాఖ తీసుకుంటున్న చర్యల గురించి చెప్పాలని మంత్రిని కోరారు. దీనికి మంత్రి ఠాకూర్ సమాధానమిస్తూ, ఈ విషయంలో బార్క్ కఠిన చర్యలకు శ్రీకారం చుట్టిందని, వివిధ రాష్ట్రాలలో 11 ఎఫ్ ఐ ఆర్ లు నమోదు చేసిందని చెప్పారు. అదే సమయంలో ప్రేక్షకాదరణ సమాచారంలో కచ్చితత్వం కోసం కృషి చేస్తోందని, పటిష్ఠమైన నిఘా వ్యవస్థను నెలకొల్పిందని కూడా వెల్లడించారు. రేటింగ్స్ మీద వస్తున్న విమర్శల నేపథ్యంలో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రసార భారతి సీఈవో అధ్యక్షతన ఐఐటీ, సి డాట్, ఐఐఎం సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేయటాన్ని గుర్తు చేశారు. ఈ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని, పారదర్శకత సాధిస్తామని బార్క్ తెలియజేసిందన్నారు. ఇప్పటికే బార్క్ అనేక చర్యలద్వారా రేటింగ్స్ లెక్కింపు వ్యవస్థను కట్టుదిట్టం చేసిందని మంత్రి ఠాకూర్ సభకు తెలియజేశారు.
భారతదేశంలో ఉన్న మతపరమైన, జాతులపరమైన వైవిధ్యాన్ని లెక్కలోకి తీసుకోవాల్సిన ఓటీటీ వేదికలు ప్రసారాలు అందిస్తూ ఉండగా వాటిని ఏ విధంగా నీయాంత్రిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఎంపీ కె. ఆర్ సురేష్ రెడ్డి ప్రశ్నించారు. దీనికి మంత్రి సమాధానమిస్తూ, 2021 ఫిబ్రవరి 25 న మార్గదర్శకాలతోబాటు డిజిటల్ మీడియా నైతికనియమావళిని ప్రకటించామని ఆన్ లైన్ కంటెంట్ ప్రసారం చేసే వారంతా ఆ నియమాలకు కట్టుబడి ఉండేలా నిర్దేశించామని చెప్పారు. దేశ వైవిధ్యాన్ని లెక్కలోకి తీసుకుంటూ విచక్షణ ప్రదర్శిస్తూ జాగ్రత్త తీసుకోవాల్సిందిగా హెచ్చరించామన్నారు. ఈ నిబంధనల ప్రకారం మూడంచెల పరిష్కార వ్యవస్థ పనిచేస్తుందని, అభ్యంతరాలు, నిబంధనల ఉల్లంఘనలు, ఫిర్యాదులమీద తగిన చర్యలు తీసుకుంటుందని మంత్రి వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here