ఎమ్మెస్వోలకు, ఆపరేటర్లు సహకరిస్తేనే బ్రాడ్ బాండ్ ఆదాయం: ట్రాయ్ సలహాదారు

0
652

డిజిటల్ ఇప్పుడు తప్పనిసరి. దేశవ్యాప్తంగా, అన్ని వయోవర్గాలవారూ ఆన్ లైన్ మంత్రమే జపిస్తున్నారు. ఇంతకుముందు కంటే ఇప్పుడు ఎక్కువగా హైస్పీడ్ బ్రాడ్ బాండ్ వాడుతున్నారు. వినోదం కోసం కావచ్చు, చదువు కోసం కావచ్చు, బాంకు పనులకు కావచ్చు లేదా ఆన్ లైన్ కొనుగోళ్ళకోసం కావచ్చు.. బ్రాడ్ బాండ్ ఇప్పుడు తప్పనిసరి అయింది. అయితే, టెలికామ్ కంపెనీలు చాలావరకూ ఈ అవసరాలు తీర్చుతున్నప్పటికీ జనం ఇంకా వేగంగా డేటా కోరుకోవటం వలన ఎమ్మెస్వోలకు, స్థానిక కేబుల్ ఆపరేటర్లకు వినోదంతోబాటు బ్రాడ్ బాండ్ పంపిణీ చేయాల్సిన అవసరం కూడా బాగా పెరిగింది.
భవిష్యత్తులో ఎమ్మెస్వోలు, కేబుల్ ఆపరేటర్లు ఈ రంగంలో పోషించాల్సిన పాత్ర గురించి టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) సలహాదారు అర్వింద్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో తన అభిప్రాయం వ్యక్తం చేశారు. చాలామందికి ఇప్పుడు బ్రాడ్ బాండ్ అవసరం కావటంతో వాళ్లంతా ఫైబర్ టు ద హోమ్ ( ఎఫ్ టి టి హెచ్ ) వైపు చూస్తున్నారని, చెప్పారు. నిజానికి టెలికామ్ కంపెనీలు స్వయంగా ఇవ్వటం మొదలుపెట్టినా 30 కోట్ల ఇళ్ళకు బ్రాడ్ బాండ్ ఇవ్వాలంటే కనీసం పదేళ్ళు పట్టే అవకాశం ఉందన్నారు.
” అందుకే ఎమ్మెస్వోలు కేబుల్ తీవీ సర్వీసులతోబాటు బ్రాడ్ బాండ్ ఇవ్వటం మీద దృష్టి సారించాలి. ఇదే వాళ్ళకు సరైన అవకాశం. ఎమ్మెస్వోలకు ఇది మంచి ఆదాయ మార్గం కూడా. ఏ టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ కూడా ఎమ్మెస్వోలతో పోటీ పడటం కుదరదు. డిటిహెచ్ ఆపరేటర్లకు ఎలాగూ ఆ అవకాశమే లేదు. అందువల్లనే ఎమ్మెస్వోలు తమ చందాదారులను కాపాడుకోవటానికి కేబుల్ సర్వీసులతోబాటు బ్రాడ్ బాండ్ కూడా ఇవ్వటం గురించి ఆలొచించాలి. ” అన్నారు అర్వింద్ కుమార్. పైగా, కోవిడ్ సంక్షోభం కారణంగా బ్రాడ్ బాండ్ కు మరింత డిమాండ్ పెరిగిందన్నారు.
డిటిహెచ్ ఆపరేటర్ల నుమ్చి ఎదురవుతున్న పోటీని ఎదుర్కోవటానికి ఎమ్మెస్వోలకు ఇదే సరైన సమయమని, డిటిహెచ్ కి టెక్నాలజీ పరంగా పైచేయి ఉన్నప్పటికీఎమ్మెస్వోలు పోటీ పడాలంటే నాణ్యమైన సేవలు అందించటంలోను, బ్రాడ్ బాండ్ ఇవ్వటంలోను తిరుగులేని ఆధిక్యం సంపాదించుకోవచ్చునని సూచించారు. ట్రాయ్ ఇటీవలే జారీచేసిన కొత్త టారిఫ్ ఆర్డర్ అమలు చేయటం మొదలుపెట్టిన తరువాత చందాదారులు డిటిహెచ్ వైపు చూస్తుందటంతో ఎమ్మెస్వోల ఆదాయం పడిపోతున్నట్టు, డిటిహెచ్ పుంజుకుంటున్నట్టు తమకు సమాచారం అందుతోందని అరవింద్ కుమార్ వెల్లడించారు.
ఇతర ఆర్థిక అంశాలతోబాటు ఎమ్మెస్వోలకు స్థానిక కేబుల్ ఆపరేటర్లతో ఘర్షణవాతావరణం సర్వసాధారణంగా ఉంటున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. అయితే, ఇరుపక్షాలూ ఇలా పరస్పరం గొడవపడుతూ ఉంటే అసలు ఆటను అర్థం చేసుకోలేరన్నారు. కేబుల్ ఆపరేటర్లు తమ ఆలొచనా విధానాన్ని, టెక్నాలజీని ఏకకాలంలో మార్చుకోవాల్సిన అవసరం ఉమ్దన్నారు. ” ఈ ఆటలో నిలబడాలంటే కేబుల్ ఆపరేటర్లు ఎమ్మెస్వోలకు అండగా నిలబడాలి. లేదంటే ఇద్దరూ వ్యాపారంలో తమ వాటా కోల్పోతారు ” అని అరవింద్ కుమార్ వ్యాఖ్యానించారు.
కేబుల్ ఆపరేటర్లు బ్రాడ్ బాండ్ ప్లాన్ల మీద దృష్టి పెట్టి ఎమ్మెస్వోలతో చర్చించాలని సూచించారు. ఈ మొత్తం వ్యవహారంలో తమ పాత్రను గుర్తించి దీర్గకాల ప్రయోజనాల కోసం పనిచేయాలన్నారు. ఒకవేళ కేబుల్ ఆపరేటర్లనుంచి ఆశించినంత మద్దతు లభించని పక్షంలో జియో తప్పనిసరిగా ఎమ్మెస్వోల సహకారం కోరుకుంటుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. అయితే చందాదారులతో మాట్లాడి ఒప్పించటం, స్థానిక అధికారులతో సమన్వయం సాధించటం కేబుల్ ఆపరేటర్లకే బాగా తెలుసు గనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ట్రాయ్ దగ్గర అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం భారత దేశంలో 2020 మార్చి 31 నాటికి 1 కోటీ 93 లక్షల 80 వేల వైర్డ్ బ్రాడ్ బాండ్ కనెక్షన్లు ఉన్నాయి. అందులో అత్యధిక కనెక్షన్లతో బి ఎస్ ఎన్ ఎల్ (79.3 లక్షలు) మొదటి స్థానంలో ఉండగా, భారతీ ఎయిర్ టెల్ (24.1 లక్షలు) రెండో స్థానంలోను, ఏట్రియా కన్వర్జెన్స్ టెక్నాలజీస్ – ఎసిటి (16.4 లక్షలు) మూడో స్థానంలోను, హాత్ వే కేబుల్ అండ్ డేటాకామ్ (9.7 లక్షలు) నాలుగో స్థానంలోను, రిలయెన్స్ జియో ఇన్ఫొకామ్ ( (9.7 లక్షలు) ఐదో స్థానంలోను ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here