గవర్నమెంట్ ఉద్యోగులకు కేబుల్ టీవీ కనెక్షన్ లేకపోతే ప్రశాంతంగా ఉంటారని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి చమత్కరించారు. ప్రభుత్వ ఉద్యోగుల నివాసాల్లో కేబుల్ కనెక్షన్ ఇచ్చే కాంట్రాక్టు రాలేదని ఒక ఆపరేటర్ కోర్టుకు వెళితే ఆ కేసు విచారణ సమయంలో న్యాయమూర్తి అలా వ్యాఖ్యానించారు. టీవీ ప్రసారాలు అందించే కేబుల్ టీవీ లేకపోతే ఉద్యోగులు టీవీ చూసే అవకాశం ఉండదని, అప్పుడు వాళ్ళు ప్రశాంతంగా పనిచేస్తారని అనటం విశేషం.
ఇక అసలు విషయానికొస్తే, కోయంబత్తూరు జిల్లా గౌండమపాళయం గాంధీనగర్ లో ప్రభుత్వోద్యోగుల ఇళ్ళున్నాయి. ఆ 532 ఇళ్ళకు 2002-2012 మధ్య కేబుల్ టీవీ కనెక్షన్ ఇచ్చే కాంట్రాక్టు స్టార్ చానెల్ అనే కేబుల్ సంస్థ దక్కించుకుంది. అలా పదేళ్లపాటు ఆ కాంట్రాక్టు నడిచిన తరువాత ప్రభుత్వం ఆ ఇళ్ళను కూలగొట్టి తమిళనాడు హౌసింగ్ బోర్డ్ చేత కొత్తగా 1848 ఇళ్ళు కట్టించింది. ఈ ఇళ్ళకు కేబుల్ టీవీ కాంట్రాక్ట్ తనకు కాకుండా మరొకరికి ఇవ్వటాన్ని స్టార్ చానెల్ యజమాని మద్రాసు హైకోర్టులో కోర్టులో సవాలు చేశాడు.
ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సీవీ కార్తికేయన్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వోద్యోగులకు టీవీ చానల్స్ చూపించటానికి ఉత్సాహం చూపుతున్న ఆ కేబుల్ ఆపరేటర్ తో “ అసలు ప్రభుత్వోద్యోగులకు మొత్తంగా టీవీ ప్రసారాలే చూపకపోవటం మేలు. వాళ్ళు ప్రశాంతంగా, హాయిగా ఉంటారు” అన్నారు.
పిటిషనర్ వాదనను న్యాయమూర్తి త్రోసిపుచ్చారు. ఇప్పుడు లేని కాంట్రాక్టును అమలు చేయటం కుదరదని, కొత్త కాంట్రాక్టరుకు ఇచ్చే హక్కు హౌసింగ్ బోర్డుకు ఉంటుందని స్పష్టం చేశారు. ఒకసారి ఇళ్ళు కూలగొట్టిన తరువాత పాత కాంట్రాక్టు రద్దయినట్టేనని, కొత్త ఇళ్ళ సంఖ్య కూడా ఎక్కువ కాబట్టి మళ్ళీ కొత్త కాంట్రాక్టర్ కు ఇచ్చే అధికారం తమిళనాడు హౌసింగ్ బోర్డుదేనని న్యాయమూర్తి చెప్పారు.
