ఇన్వెస్కో మాట చెల్లుబాటు, ఈజీఎం కు జీ సిద్ధం

0
578

నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ( ఎన్ సి ఎల్టీ ) సూచనలకు అనుగుణంగా చట్టబద్ధంగా అసాధారణ సర్వ సభ్య సమావేశం నిర్వహించటానికి సిద్ధంగా ఉన్నట్టు జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (జీల్) ప్రకటించింది. జీల్ లో అతిపెద్ద వాటాదారులలో ఒకటిగా ఉన్న ఇన్వెస్కో అసాధారణ సర్వసభ్య సమావేశం కోసం లేకరాసినా జీ యాజమాన్యం పట్టించుకోకపోవటం పట్ల అభ్యంతరం తెలియజేస్తూ ఎన్ సి ఎల్ టి కి లేఖ రాయగా ఆ వాదనను ఎన్ సి ఎల్ టి సమర్థించింది.

ఇంకా జీ సమావేశ తేదీ ప్రకటించలేదన్న ఇన్వెస్కో ఫిర్యాదును పరిశీలించిన ఎన్ సి ఎల్ టి చట్ట ప్రకారం సమావేశం జరపాలని జీ ని కోరింది. జీ బోర్డు తన ఇష్టాయిష్టాలకు అనుగుణంగా, తన విచక్షణతో జరిపే సమావేశం కాదని, చట్టపరంగా జరపాల్సిన సమావేశమని గుర్తు చేసింది. ఇన్వెస్కో, ఒ ఎఫ్ ఐ గ్లోబల్ చైనా ఫండ్ ఐఐసి అనే రెండు సంస్థలకు కలిపి ఉమ్మడిగా 18 శాతం వాటా ఉన్న విషయాన్ని ఎన్ సి ఎల్ టి గుర్తు చేసింది. అలాంటి వాటాదారు కోరిన మూడు వారాల్లోగా అసాధారణ సర్వసభ్య సమావేశం తేదీ నిర్ణయించాల్సిన బాధ్యత కంపెనీ మీద ఉంటుందని పేర్కొంది. సెప్టెంబర్ 12 న లేఖ అందుకున్న జీ యాజమాన్యం చట్టప్రకారం అక్టోబర్ 2 నాటికి సమావేశం ప్రకటించాల్సి ఉంటుంది.

జీ ప్రతినిధి కూడా తాము చట్టప్రకారం నడుచుకుంటామని చెప్పటం ద్వారా అసాధారణ సర్వసభ్య సమావేశానికి సిద్ధమైనట్టు స్పష్టమైంది. అంతకుముందు ఇన్వెస్కో జీ యాజమాన్యం మీద పెద్ద ఎత్తున అవిశ్వాసం ప్రకటిస్తూ, కొంతమంది డైరెక్టర్లు తప్పుకోవాలని, ఎండీ పునీత్ గోయెంకా కూడా ఆ హోదానుంచి తప్పుకోవాలని డిమాండ్ చేసింది. ఇలా ఉండగా, సోనీ, జీ విలీనం ప్రకటన యావత్ పరిశ్రమను కుదిపివేసింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్కో చేస్తున్న హడావిడి ప్రభావం నామామాత్రమే అయినప్పటికీ చట్టప్రకారం సమావేశం జరుతుందని తేలిపోయింది. .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here