పే చానల్స్ ధరల పెంపు ఆపాలని ట్రాయ్ కి ఆపరేటర్ల విజ్ఞప్తి

0
384

బ్రాడ్ కాస్టర్లు తమ పే ఛానల్స్ ధరలు అన్యాయంగా పెంచటాన్ని అడ్డుకోవాలని ఆల్ లోకల్ కేబుల్ ఆపరేట్ అసోసియేషన్ (ఢిల్లీ), టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఛైర్మన్ ను కోరింది. సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ నరేంద్ర బాగ్రీ ఈ మేరకు ట్రాయ్ ఛైర్మన్ శ్రీ పీడీ వాఘేలాకు లేఖ రాశారు. ఈ లేఖ ప్రతులను ప్రధానమంత్రి కార్యాలయానికి, సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు కూడా పంపారు.
కండిషనల్ యాక్సెస్ సిస్టమ్ (కాస్) అమలైన రోజుల్లోనూ, డిజిటైజేషన్ హయాంలో మొదటి టారిఫ్ ఆర్డర్ ( ఎన్టీవో 1.0), రెండో టారిఫ్ ఆర్డర్ (ఎన్టీవో 2.0) ద్వారా బ్రాడ్ కాస్టర్ల ధరల పెంపుతోనూ 300 శాతం మేరకు అదనపు భారం పడిందన్నారు. కాస్ రోజుల్లో బ్రాడ్ కాస్టర్లు వాళ్ళ ప్రధాన చానల్స్ కు రూ.5 చొప్పున ధర నిర్ణయించగా ఇప్పుడు ఎన్టీవో 2.0 కింద స్టార్ గోల్డ్ 250% పెంచటాన్ని సంఘం ప్రస్తావించింది. కాస్ నుంచి ఎన్టీవో దాకా పోల్చి చూస్తే సెట్ మాక్స్ (380%), సోనీ టీవీ (380%), స్టార్ ప్లస్ (360%), సబ్ టీవీ (360%), స్టార్ స్పోర్ట్స్ (360%), జీ టీవీ (340%) కలర్స్ టీవీ (320%), పెరిగినట్టు ట్రాయ్ దృష్టికి తెచ్చింది.
ఆదాయపంపిణీ నిష్పత్తిలో సైతం ఆపరేటర్లకు జరిగిన అన్యాయాన్ని ఈ లేఖలో ప్రస్తావించారు.

ఈ పరిశ్రమను తయారుచేసిందే కేబుల్ ఆపరేటర్ అని, చందాదారులనుంచి ఆదాయం వసూలు చేయటం ద్వారా పరిశ్రమ నడవటానికి కారణమయ్యే కేబుల్ ఆపరేటర్ ప్రాధాన్యాన్ని ప్రభుత్వంతోబాటు పరిశ్రమ వర్గాలు కూడా నిర్లక్ష్యం చేస్తున్నాయని సంఘం అభిప్రాయపడింది. కాస్ హయాంలో కేబుల్ ఆపరేటర్ కు రూ. 72-100 రాగా, ఆ తరువాత ఎన్టీవో 2.0 మరింత దిగజార్చిందన్నారు. పైగా, అదనవు ఛానల్ కు నెట్ వర్క్ కెపాసిటీ ఫీజ్ 40 శాతానికి పరిమితం చేయటం వలన ఒక్కో చందాదారుడి మీద సగటు ఆదాయం పడిపోయిందన్నారు.
ఈ కష్టాలన్నిటినీ ఏకరవు పెడుతూ, పే టీవీ బ్రాడ్ కాస్టర్ల ధనదాహానికి అడ్డుకట్టవేయాలని ట్రాయ్ ఛైర్మన్ కు ఆపరేటర్ల సంఘం విజ్ఞప్తి చేసింది. అది జరగకపోతే కేబుల్ ఆపరేటర్లు వ్యాపారం వదులుకోవటం, కేబుల్ సిబ్బంది లక్షల సంఖ్యలో నిరుద్యోగులుగా మారటం తప్పకపోవచ్చునని ఆ లేఖలో హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here