బిగ్ బాస్ కు లక్ష జరిమానా, కంటెస్టెంట్లు హోటల్ కి తరలింపు!

0
677

మలయాళం బిగ్ బాస్ మూడో సీజన్ తాత్కాలికంగా నిలిచిపోయింది. చెన్నై నగరంలోని ఇవిపి ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ బిగ్ బాస్ సెట్ ను తమిళనాడు ప్రభుత్వం సీజ్ చేసింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన సాంకేతిక బృందంలో ఆరుగురికి కరోనా అని నిర్థారణ కావటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ బిగ్ బాస్ మూడో సీజన్ కేరళలో అత్యంత ప్రేక్షకాదరణ పొందింది. వరుసగా 95 రోజులుగా ఈ కార్యక్రమం ప్రసారమవుతోంది.

బిగ్ బాస్ రియాలిటీ షో నడుస్తూ ఉండగానే మే 10న తమిళనాడు ప్రభుత్వం సంపూర్ణ లాక్ డౌన్ విధించింది. సినిమా, టీవీ షూటింగ్స్ మీద కూడా నిషేధం విధించింది. అయితే, మరో ఐదు రోజుల్లో ఈ సీజన్ పూర్తి కావాల్సి ఉన్న సమయంలో తిరువళ్ళువర్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ( ఆర్డీవో) ప్రీతి భార్గవి సారధ్యంలో అధికారుల బృందం బిగ్ బాస్ మలయాళం సెట్ కు చేరుకొని కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన ఆరోపణలమీద సీజ్ చేశారు. ఆ తరువాత పరిస్థితిని మదింపు చేసిన అధికారులు నిర్వాహకులకు లక్ష రూపాయల జరిమానా విధించారు.

దక్షిణభారత చలన చిత్ర ఉద్యోగుల సమాఖ్య (ఫెఫ్సీ) తమిళనాడు అంతటా షూటింగ్స్ నిలిపివేస్తున్నట్టు ప్రకటించినప్పటికీ బిగ్ బాస్ నిర్వాహకులు షూటింగ్ కొనసాగించారని పేర్కొంటూ విపత్తుల నిర్వహణ చట్టం, 2005 కింద కేసు నమోదు చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించేవారి మీద కఠిన చర్యలు తీసుకోవటానికి ఈ చట్టం ప్రభుత్వ అధికారులకు అధికారం కట్టబెట్టింది.

నిజానికి ఈ కార్యక్రమానికి సంబంధించిన సాంకేతిక సిబ్బందిలో కోవిడ్ బారిన పడిన ఆరుగురికీ ఈ సెట్ లోని వారితో ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ, మిగిలిన సాంకేతిక సిబ్బందితో కలసి ఉండటం వలన కోవిడ్ వ్యాపిస్తుందని అధికారులు అంచనాకు వచ్చారు. కరోనా సోకిన ఆరుగురు సిబ్బందినీ క్వారంటైన్ చేశారు. ప్రస్తుత కరోనా సంక్షోభం సమసిపోయి షూటింగ్ మీద నిషేధం ఎత్తివేశాక బిగ్ బాస్ పునఃప్రసారమవుతుందని చానల్ యాజమాన్యం ప్రకటించింది. అదే సమయంలో కంటెస్టెంట్లను ఇళ్లకు పంపకుండా దగ్గర్లోని ఒక హోటల్ కి తరలించారు. మళ్ళీ షూటింగ్ మొదలయ్యేదాకా అక్కడే ఉంచుతారని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here