రేటింగ్స్ కుంభకోణం చార్జ్ షీట్ లో ఆర్ణబ్ పేరు

0
446

టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ ( టీఆర్పీ) కుంభకోణంలో రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ ఆర్ణబ్ గోస్వామిని నిందితునిగా పేర్కొంటూ ముంబయ్ పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేశారు. తొమ్మిది నెలల కిందట ముంబయ్ నగర పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ ఈ కుంభకోణంలో రిపబ్లిక్ టీవీ పాత్రను పేర్కొంటూ ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ముంబయ్ లోని ఎస్ ప్లనేడ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో దాఖలు చేసిన 1800 పేజీల అనుబంధ చార్జ్ షీట్ లో ఆర్ణబ్ గోస్వామితో బాటు మరో నలుగురిని నిందితులుగా పేర్కొన్నారు. రిపబ్లిక్ టీవీ యాజమాన్య సంస్థ ఎ ఆర్ జి ఔట్లియర్ మీడియా కు చెందిన మరో నలుగురిని కూడా నిందితులుగా చేర్చారు. వారిలో సంస్థ సీవోవో ప్రియా ముఖర్జీ, శివేందు ములేల్కర్, శివ సుందరం ఉన్నారు.
ఇప్పటివరకు ఈ కేసులో మొత్తం 15 మందిని చార్జ్ షీట్ లో చేర్చారు. వారిలో బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) మాజీ సీఈవో పార్థోదాస్ గుప్తా, రిపబ్లిక్ టీవీ సీఈవో వికాస్ ఖాన్ చందానీ కూడా ఉన్నారు. మోసం, ఫోర్జరీ, నేరపూరితకుట్ర తదితర అభియోగాలు వీరిపై మోపారు. ముంబయ్ నగర పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ సహా కొందరు పోలీసులమీద ఆరోపణలు చేస్తూ ఆర్ణబ్ గోస్వామి దాఖలు చేసుకున్న పిటిషన్ మీద బొంబాయ్ హైకోర్టు పరిమిత రక్షణ మాత్రమే కల్పిస్తూ మార్చి 24 న అదేశాలిచ్చింది.
2020 అక్టోబర్ 6 నాటి చార్జ్ షీట్ ను, ఆ తరువాత దాఖలైన మరో రెండు అనుబంధ చార్జ్ షీట్ లను రద్దు చేయాలని కోరుతూ ఎ ఆర్ జి ఔట్లియర్ మీడియా సంస్థ వారి రిపబ్లిక్ టీవీ తరఫున ఆర్ణబ్ గోస్వామి కోర్టును కోరారు. చానల్ పేరును నిందితుల జాబితాలో చేర్చకపోయినా, అనుమానితుల జాబితాలో చేర్చి ఇబ్బంది పెడుతున్నారని అందువలన వాటిని రద్దు చేయాలని విన్నవించారు.
జస్టిస్ ఎస్ ఎస్ షిండే, మనీష్ పితాలే తో కూడిన డివిజన్ బెంచ్ ఆ పిటిషన్ ను స్వీకరిస్తూ, ఆర్ణబ్ కు సమన్లు జారీ చేయాలకున్నా, మరేదైనా చర్యలు తీసుకోవాలనుకున్నా మూడు రోజుల ముందుగా తెలియజేయాలని పోలీసులను ఆదేశించింది. 12 వారాల్లోగా దర్యాప్తు పూర్తి చేస్తామని పోలీసులు కోర్టుకు తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here