రేటింగ్స్ కుంభకోణం: బార్క్ మాజీ సీఈవో అరెస్ట్

0
531

రేటింగ్స్ కుంభకోణం కీలకమైన మలుపు తిరిగింది. ఇన్నాళ్ళూ క్షేత్రస్థాయి సిబ్బంది కుమ్మక్కవటం వల్లనే చానల్ యాజమాన్యాలు రేటింగ్స్ కొనగలిగినట్టు భావిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు నేరుగా రేతింగ్స్ లెక్కించే బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ( బార్క్) మాజీ సీఈవో పార్థోదాస్ గుప్తా ను అరెస్ట్ చేయటంతో టీవీ పరిశ్రమ మొత్తం ఉలిక్కిపడింది. స్వయంగా బ్రాడ్ కాస్టర్లు, అడ్వర్టయిజర్లు కలిసి ఏర్పాటు చేసుకున్న సంస్థ ఉన్నతాధికారికి రేటింగ్స్ కుంభకోణంలో పాత్ర ఉన్నట్టు ముంబయ్ పోలీసుల దర్యాప్తులో వెల్లడవటం ఆశ్చర్యానికి కారణమైంది.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా వరుస అరెస్టులు చేస్తూ ఆధారాలు సేకరిస్తూ వస్తున్న ముంబయ్ పోలీసులు ఈ మధ్యనే రిపబ్లిక్ టీవీ సీఈవోను, బార్క్ మాజీ సివోవో రోమిల్ రామ్ గడియాను అరెస్ట్ చేసి విచారించిన అనంతరం మరికొంత సమాచారం సేకరించగలిగారు. వీరిద్దరి మధ్య వాట్సాప్ సంభాషణ పొలీసుల చేతికి చిక్కటంతో దాని ఆధారంగానే బార్క్ మాజీ సీఈవో ప్రమేయాన్ని పోలీసులు నిర్థారించుకున్నారు. ఇప్పటివరకు 14 మందిని అరెస్ట్ చేయగా ఇప్పుడు నేరుగా బార్క్ మాజీ సీఈవో అరెస్టు మరింత సంచలనానికి దారితీసింది. ముంబయ్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పూణె రూరల్ రాజ్ గడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పార్థోదాస్ గుప్తాను అరెస్ట్ చేసి అదనపు ఛీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్త్రేట్ కోర్టులో హాజరు పరచటానికి ముంబయ్ తీసుకువచ్చారు.
బార్క్ స్వయంగా హన్సా రీసెర్చ్ ఏజెన్సీ ద్వారా రేటింగ్స్ కుంభకోణం మీద కేసు నమొదు చేయించగా ఇప్పుడు తన మాజీ ఉద్యోగుల మెడకు చుట్టుకోవటం ఆ సంస్థ విశ్వసనీయత మీద వస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చింది. ఇంతకాలం ఎన్ని విమర్శలు వచ్చినా ఏదో ఒక సమాధానం ఇచ్చి నెట్టుకొస్తూ వస్తున్న బార్క్ ఇప్పుడు ఆత్మ రక్షణలో పడింది. నెంబర్ వన్ చానల్ తప్ప అందరూ మమ్మల్ని విమర్శిస్తూనే ఉంటారు అంటూ తేలిగ్గా కొట్టిపారేసే బార్క్ ఇప్పుడు దీన్ని ఎలా సమర్థించుకుంటుందో చూడాలి. అదే విధంగా ఇదంతా కేవలం రాజకీయ కుట్ర అంటూ విచారణకు దురుద్దేశాలు ఆపాదించే ప్రయత్నం చేసిన ఆర్ణబ్ గోస్వామి కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here